అన్నం బిల్లులకూ ఆటంకాలే!

అయిదేళ్ల కిందట... చక్కెర పోయకుండానే... నాలుకలను తీపెక్కించారు!  చిక్కటి హామీలతో... మెదళ్లను మార్చేశారు!  పీఠమెక్కాక అసలు రంగు చూపించారు! హాస్టల్‌ పిల్లలనూ ఆకలికి వదిలేశారు.. అన్నం బిల్లులను అటకెక్కిస్తున్నారు.. మేనమామనంటూనే మేలు మరిచారు!!

Published : 24 Feb 2024 04:43 IST

వసతి గృహాలకు డైట్‌ఛార్జీలను సక్రమంగా చెల్లించని జగన్‌
భోజనం పెట్టేందుకు  అల్లాడుతున్న వార్డెన్లు
రాష్ట్రవ్యాప్తంగా రూ.54 కోట్ల బకాయిలు
ఈనాడు - అమరావతి

అయిదేళ్ల కిందట...
చక్కెర పోయకుండానే...
నాలుకలను తీపెక్కించారు!  
చిక్కటి హామీలతో...
మెదళ్లను మార్చేశారు!  
పీఠమెక్కాక అసలు రంగు చూపించారు!
హాస్టల్‌ పిల్లలనూ ఆకలికి వదిలేశారు..
అన్నం బిల్లులను అటకెక్కిస్తున్నారు..  
మేనమామనంటూనే మేలు మరిచారు!!

పిల్లల ఆకలిదప్పులను తీర్చే వారిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం మేనమామదే. అందుకే మేలు కోరేవాడే మేనమామ అంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు తనను తాను మేనమామగా ప్రచారం చేసుకుంటున్న జగన్‌... వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారానికి ఏడాదిన్నరగా సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదు. ప్రస్తుతం ఆయా హాస్టళ్లకు కొన్నిచోట్ల 3 నుంచి 5 నెలల డైట్‌ఛార్జీల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులకు పోషకాహారం అందించలేక వార్డెన్లు చేతులెత్తేస్తున్నారు. కొందరు ఉన్నవాటితో సర్దుబాటు చేస్తున్నారు. మరికొందరు నాసికరం సరకులు తెచ్చి పెడుతున్నారు. కొన్నిచోట్ల సొంత డబ్బులతో పిల్లలకు తిండి పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే హాస్టళ్లకు సంబంధించి మొత్తం రూ.54 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి.

ఇవిగో కొన్ని ఉదాహరణలు

  •  పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల విద్యార్థులకు మూడు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
  • కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో 2023 సెప్టెంబరు నుంచి బకాయి పెట్టారు.
  • కర్నూలు జిల్లాలో బీసీ వసతి గృహ విద్యార్థులకు అయిదు నెలలుగా డైట్‌ఛార్జీల చెల్లింపులు లేవు.
  • అనంతపురం జిల్లా   పరిధిలోనూ కొన్ని వసతి గృహాలకు 5 నెలలు,  మరికొన్ని వసతి గృహాలకు ఆరు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
  • సీఎం జగన్‌ సొంత జిల్లా వైయస్‌ఆర్‌లోనూ బీసీ వసతి గహాలకు 2023 నవంబరు నుంచి చెల్లింపులను నిలిపేశారు.
  •  విజయనగరం జిల్లాలోని ఎస్సీ ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలకు 2023 అక్టోబరు నుంచి డైట్‌ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి.

గ్రీన్‌ఛానల్‌లో చూపుతూనే...

వాస్తవానికి వసతి గృహ విద్యార్థుల డైట్‌ఛార్జీల బిల్లులను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా చెల్లించాలి. ఏ నెలకానెల నిధులను ఠంచనుగా విడుదల చేయాలి. జగన్‌ అధికారంలోకి రాగానే గ్రీన్‌ ఛానల్‌ కూడా రివర్స్‌ అయింది. జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడమే తప్ప... వాటికి సకాలంలో చెల్లింపులు జరగడంలేదు. పైగా అదేం మాయో గానీ... గ్రీన్‌ఛానల్‌లో ఎప్పుడూ డబ్బులు ఉన్నట్లు కనిపిస్తుంది.

మూడేళ్లపాటు విన్నవిస్తే... నిరుడు విదిల్చారు...

ప్రస్తుత నిత్యావసరాల ధరలతో పోలిస్తే ప్రభుత్వం డైట్‌ ఛార్జీల కింద విద్యార్థులకు చెల్లిస్తున్నది నామమాత్రమే. అవి కూడా సక్రమంగా చెల్లించకపోతే ఎలా? వైకాపా అధికారంలోకి రాకముందున్న నిత్యావసరాల ధరలతో పోలిస్తే ప్రస్తుతం కొన్నింటి ధరలు వంద శాతానికిపైగా పెరిగాయి. సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మూడేళ్లపాటు డైట్‌ ఛార్జీలను పెంచాలని వసతి గృహాల అధికారులు విన్నవిస్తున్నా... జగన్‌ వినిపించుకోలేదు. విద్యార్థులను తీవ్ర ఇక్కట్లపాలు చేశారు. ఎట్టకేలకు గతేడాది జూన్‌ నుంచి నామమాత్రంగా పెంచారు. నిత్యావసరాల ధరలను పరిగణనలోకి తీసుకోకుండా పెంపును 15 శాతానికే పరిమితం చేశారు. అధికారులు కనీసం 25% పెంచాలని ప్రభుత్వానికి నివేదించడం గమనార్హం. పైగా సంబంధిత బిల్లులను కూడా సక్రమంగా చెల్లించడం లేదు.

గత ప్రభుత్వ హయాంలో 33% నుంచి 66% పెంపు

గత ప్రభుత్వం వసతి గృహాల విద్యార్థులకు 2018లో డైట్‌ఛార్జీలను పెంచి, అమలు చేసింది. మూడు, నాలుగు తరగతుల విద్యార్థులకు 2012 నుంచి నెలవారీగా ఇస్తున్న మొత్తం రూ.750 ఉండగా 2018లో తెదేపా ప్రభుత్వం    రూ.1000 (33%)కి పెంచింది. 5, 6, 7 తరగతుల విద్యార్థులకిచ్చే మొత్తాన్ని రూ.750 నుంచి రూ.1,250 (66%)కి, 8, 9, 10 తరగతులకు రూ.850 నుంచి రూ.1,250 (47%)కి, ఇంటర్‌, ఆపై తరగతుల విద్యార్థులకు రూ.1,200 నుంచి రూ.1,400 (16.5%)కు పెంచడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు