జగన్‌.. మా ఇంటికి దారేది?

అజీర్తి రోగికి ఆకలి ఎక్కువన్నట్లు... జగన్‌కు ప్రచారంపై మక్కువ.. ‘కాలనీలు కాదు ఊళ్లు కడుతున్నాం’ అని చెప్పిన జగన్‌.. వాగులూ వంకల్లో.. కొండలూ గుట్టల్లో..ఇళ్ల స్థలాలు ఇచ్చారు... వాటినైనా సవ్యంగా అప్పగించారా అంటే అదీ లేదు!

Published : 24 Feb 2024 04:50 IST

తప్పులు తడకలతో ఇళ్ల రిజిస్ట్రేషన్లు
స్థలాలు, హద్దులు చూపించకుండానే హడావుడి!
చదును చేయని లేఅవుట్లు ఎన్నో!
సర్వే, ప్లాట్ల నంబర్ల నమోదులో పొరపాట్లు!

అజీర్తి రోగికి ఆకలి ఎక్కువన్నట్లు... జగన్‌కు ప్రచారంపై మక్కువ.. ‘కాలనీలు కాదు ఊళ్లు కడుతున్నాం’ అని చెప్పిన జగన్‌..
వాగులూ వంకల్లో.. కొండలూ గుట్టల్లో..ఇళ్ల స్థలాలు ఇచ్చారు... వాటినైనా సవ్యంగా అప్పగించారా అంటే అదీ లేదు!
అవి ఎక్కడున్నాయో చూపడం లేదు..చూపిన వాటికీ దారీతెన్నూ లేదు.. ఆ మాత్రం దానికే..తన ఫొటో ముద్రించిన ఉత్తుత్తి రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇచ్చి‘ఇళ్లు నిర్మించేశాం.. ఊళ్లు కట్టించేశాం..’ అని బాకా ఊదుతున్నారు!

ఇంటి పట్టాల ఉత్తుత్తి రిజిస్ట్రేషన్లతో పేదల్ని అయోమయానికి గురిచేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌. కన్వీనియన్స్‌ డీడ్‌ రూపంలో జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ప్రచార యావతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. అసలు కన్వీనియన్స్‌ డీడ్‌ పేరుతో రిజిస్ట్రేషన్లు జరగడం ఇదే తొలిసారి. ఈ హడావుడి ప్రక్రియ ప్రారంభమై రెండు వారాలు గడిచినా రకరకాల సాంకేతిక సమస్యలతో ముందుకు సాగడం లేదు. ఇప్పటికే అమల్లో ఉన్న నిర్ణయం ప్రకారం పట్టా కేటాయించిన పదేళ్ల తర్వాతే లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. అయినా కన్వీనియన్స్‌ డీడ్‌లతో ఏదో ఉపయోగం ఉన్నట్లు రిజిస్ట్రేషన్ల పేరుతో లబ్ధిదారులను ప్రభుత్వం మభ్యపెడుతోంది. ఈ క్రమంలో గతంలో దొర్లిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పట్టాల్లో పేర్లు, సర్వే నంబరు, ప్లాట్‌ నంబరు, స్థలం హద్దులు తప్పుగా నమోదవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పొలాలు, చెరువులు, కొండగట్లలో లేఅవుట్లు వేసి, పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదు. మొదట పట్టాలిచ్చి, తర్వాత సీఎం ఫొటోతో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పేరిట ప్రచారం చేసుకుంటోంది. చదును చేయనందున చాలా జిల్లాల్లో లేఅవుట్లలో పిచ్చిమొక్కలు మొలిచాయి. చాలాచోట్ల స్థలాలు అనువుగా  లేకపోవడం, దూరంలో ఉన్నందున లబ్ధిదారులు అక్కడికి  వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. వారి అభ్యర్థనలపై  పునఃపరిశీలన చేయకుండానే రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు.

సర్వే నంబరు తప్పుతో నిలిచిన రిజిస్ట్రేషన్లు!

ప్రకాశం జిల్లా పొదిలిలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచింది. జిల్లాలోనే ఒకేచోట ఎక్కువ మంది పేదలకు పట్టాలిచ్చిన లేఅవుట్‌గా ఉన్న సర్వే నంబరు 1177లోని ప్లాట్‌ నంబర్లకు రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది. అయితే.. సర్వే నంబర్లు 1195, 1193గా ఆన్‌లైన్‌లో గతంలోనే నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఒక సర్వే నంబరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తే పట్టా పొందిన వ్యక్తి స్థలం మరో నంబరులోకి మారిపోతోంది. దీంతో ఇక్కడ రిజిస్ట్రేషన్లను నిలిపేశారు. మండలంలో 2,350 మందికిగాను ఇప్పటివరకు సుమారు 400 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి.

  • ఏలూరు మండలం మాదేపల్లిలో ఏడు గ్రామాలకు చెందిన 754 మందికి స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ప్లాట్ల విభజన జరగకుండా, పూర్తిగా భూమి చదును చేయకుండా పట్టాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగించారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సమీపంలోని కొండగట్టులో 255 మంది అర్బన్‌ లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తూ లేఅవుట్‌ వేశారు. అయితే ఇక్కడ విద్యుత్తు స్తంభాలు వేసి, నీళ్ల ట్యాంకులు పెట్టి వదిలేశారు. ఇతర మౌలిక సదుపాయాలను కల్పించలేదు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంత యలమంచిలిలో 23 మందికి ఓ శ్మశానవాటికని ఆనుకుని స్థలాలు కేటాయించారు. అవి వద్దని లబ్ధిదారులు ఇటీవల ఆందోళనకు దిగారు.
  • చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో 904 పట్టాలకుగాను 400 వరకు వివిధ కారణాలతో ఆన్‌లైన్‌లో తిరస్కరణకు గురయ్యాయి.
  • కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 2019 సంవత్సరంలో రెండు విడతల్లో దాదాపు 4000 మందికి పట్టాలిచ్చారు. ఇప్పటి వరకూ ఎవరికీ స్థలాలు చూపించలేదు. మూడేళ్ల కిందట కేటాయించిన స్థలాలు ఎలా ఉన్నాయో... ఇప్పుడూ అలాగే ఉన్నాయి. చదును చేసి, లేఅవుట్‌గా విభజించి, సరిహద్దులు ఏర్పాటు చేసి, స్థలాలు కేటాయిస్తామన్న నేతలు ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. సరిహద్దు రాళ్లు వేయకుండానే రిజిస్ట్రేషన్లకు రావాలని లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు.
  • కాకినాడ నియోజకవర్గంలో 2,500 మంది పేదలకు పట్టాలిచ్చినా స్థలాలు చూపించలేదు. భూసేకరణ జరిగినా లేఅవుట్లు సిద్ధం చేయలేదు. ఇక్కడ పట్టాలు పొందినవారికి రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశాలు లేవు.
  • కృష్ణా జిల్లా బాపులపాడు మండలం పెరికీడులో 155 మందికి, కె.సీతారాంపురంలో 321 మందికి రెండేళ్ల కిందట పట్టాలు పంపిణీ చేశారు. ఈ రెండుచోట్ల లేఅవుట్లలో స్థలాలు విభజించి, లబ్ధిదారులకు పొజిషన్‌ చూపించలేదు. తాజా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఈ రెండు గ్రామాలకు మినహాయింపు ఇచ్చారు.
  • గన్నవరం నియోజకవర్గంలోని మూడు ప్రధాన మండలాల్లో 25,699 మందికి పట్టాలు ఇచ్చినా 15,549 మందికి మాత్రమే స్థలాలు చూపించారు. చాలా గ్రామాల్లో ఇంకా భూసేకరణ జరగలేదు. వేరే గ్రామాల్లో స్థలాలు కేటాయించడంతో లబ్ధిదారులు అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది.
  • పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 2,400 మంది లబ్ధిదారులకు పది కిలోమీటర్ల దూరంలోని లేఅవుట్లలో స్థలాలు ఇచ్చారు. ఆయా లేఅవుట్లలో ఇప్పటివరకు సరిగా చదును చేయలేదు. కానీ రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. మరోవైపు కొందరి పేదల ఇంటి స్థలాలను పలువురు వైకాపా నేతలు ఇప్పటికే కొనేస్తున్నారు.

దూరంగా స్థలాలిచ్చిన వారికి...

లబ్ధిదారుల్లో కొందరికి వారి నివాస ప్రాంతాలకు 15-20 కి.మీ. దూరంలో స్థలాలిచ్చారు. ఏ గ్రామంలో స్థలాలు ఇచ్చారో.. ఆ గ్రామ సచివాలయ అధికారితోపాటు లబ్ధిదారు రిజిస్ట్రేషన్‌ కోసం బయోమెట్రిక్‌ వేయాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇదో పెద్ద సమస్యగా మారింది. కాకినాడ జిల్లా సామర్లకోట గ్రామీణ మండలంలోని వి.కె.రాయపురం ముంపు ప్రాంతంలో... అదీ 6కి.మీ. దూరంలో చిన్నపాటి వర్షానికే మునిగిపోయే పొలాల మధ్య కొన్న స్థలాలు తమకొద్దని.. వేరేచోట ఇవ్వాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. స్థలాలు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడుతున్నారు.


‘సర్వర్‌’ సహకరించక...!

ఒక్కో సచివాలయ పరిధిలో రోజూ 50 పట్టాల రిజిస్ట్రేషన్లు చేయాలని లక్ష్యం పెట్టుకున్నా.. చాలాచోట్ల కనీసం 20 కూడా పూర్తవడం లేదు. ప్రకాశం జిల్లాలో 51,060 పట్టాల పంపిణీ జరగ్గా గడిచిన రెండు వారాల్లో 24,471 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 54 వేలకు గాను మూడోవంతు రిజిస్ట్రేషన్లే జరిగాయి. ఇతర జిల్లాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. లబ్ధిదారుల్లో 90% మంది దినసరి కూలీలే. సకాలంలో రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో కూలి డబ్బులు పోగొట్టుకుని మరీ నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ కారణంగా కొందరు లబ్ధిదారులు రిజిస్ట్రేషన్లకు రావడమే లేదు. సర్వర్‌ మొరాయిస్తుండటంతో కొన్నిచోట్ల ఒక్కో పట్టా రిజిస్ట్రేషన్‌కు గంట సమయం పడుతోంది. కొన్ని సచివాలయాల్లో రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో లబ్ధిదారులు అప్పటి వరకు నిరీక్షిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు లక్ష్యాలు విధించడంతో సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను రిజిస్ట్రేషన్లకు రావాలని బతిమాలుకోవాల్సిన పరిస్థితి.


పదేళ్ల తరువాతే అమ్ముకోవాలి!

ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా.. పదేళ్ల తరువాతే లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. పట్టా ఇచ్చిన 24 నెలల్లోగా నిర్మాణాలు పూర్తిచేయాలి. పట్టాల పంపిణీ జరిగి 24 నెలలు ఇప్పటికే గడిచినా.. చాలాచోట్ల నిర్మాణాలు జరగలేదు. ప్రస్తుతం ‘కన్వీనియన్స్‌ డీడ్‌’ పేరుతో జరుగుతోన్న రిజిస్ట్రేషన్లవల్ల లబ్ధిదారులకు అదనంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ వైకాపా ప్రభుత్వం ప్రచారం కోసం విలువైన సమయాన్ని, మానవ వనరులను వృథా చేస్తోంది.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని