ఎమ్మెల్యే రాచమల్లుతో ప్రాణహాని

తన భర్త రామాంజనేయులురెడ్డికి, తనకు ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి నుంచి ప్రాణహాని ఉందని వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు మూడో వార్డు కౌన్సిలర్‌ వెంకటలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 24 Feb 2024 09:18 IST

మాట వినకపోతే లేపేస్తామని బెదిరిస్తున్నారు
ఎస్పీకి కౌన్సిలర్‌ దంపతుల ఫిర్యాదు

ఈనాడు, కడప: తన భర్త రామాంజనేయులురెడ్డికి, తనకు ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి నుంచి ప్రాణహాని ఉందని వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు మూడో వార్డు కౌన్సిలర్‌ వెంకటలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చేసిన హెచ్చరికల గురించి అందులో వివరించారు. ‘ముందు వాడికి (కౌన్సిలర్‌ భర్త) చెప్పు. మాట వినకపోతే శాల్తీ లేచిపోతుంది’ అంటూ బెదిరించారని ఆమె పేర్కొన్నారు. ‘ఈ నెల 19న ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ఇంటికి వచ్చారు. నా భర్త ఇంట్లో లేరు ఆయన వచ్చాక రండి అని అడ్డుకోబోయాను. అయినా వినకుండా రాచమల్లు, ఆయన వెంట వచ్చిన వారంతా దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చారు. తలుపులు మూసి మహిళ అనే గౌరవం లేకుండా నానా మాటలు అన్నారు. వైకాపా తరఫున గెలిచారు కాబట్టి, మీరు పార్టీ మారాలంటే రాజీనామా చేసి వెళ్లండి అంటూ నన్ను దుర్బాషలాడారు. నీ భర్తకు చెప్పు వాడి కాళ్లు విరిచేస్తా’ అని ఎమ్మెల్యే బెదిరించారని పేర్కొన్నారు. నా భర్తలేరు ఆయన వచ్చాక మాట్లాడండి అని చెప్పినా వినిపించుకోలేదన్నారు. ‘నా కుటుంబాన్ని అంతం చేస్తామని ప్రతినబూనిన ఎమ్మెల్యే.. ఆయన వెంట వచ్చిన వారిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని’ కౌన్సిలర్‌ ఎస్పీని కోరారు. అయితే, ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్‌ బాధితులను శుక్రవారం తన కార్యాలయానికి పిలిపించి విచారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని