ఈసారి వివేకాను చంపిందెవరో చెప్పి జగన్‌ ఓట్లు అడగాలి: దస్తగిరి వ్యాఖ్యలు

చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టం చేశారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Updated : 24 Feb 2024 08:42 IST

అవినాష్‌రెడ్డి ఇంటి పక్కనే నా నివాసం.. అయినా భయపడను

ఈనాడు, కడప, న్యూస్‌టుడే- కడప నేరవార్తలు: చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టం చేశారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వివేకా హత్యకు సంబంధించి తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్‌గా మారానని, ఇప్పుడు సీఎం, ఎంపీల మాటలు విని మళ్లీ తప్పు చేసి పాపం మూటకట్టుకోదలచుకోలేదని పేర్కొన్నారు.

ఎట్రాసిటీ, దాడి కేసుల్లో నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దస్తగిరి బెయిల్‌పై శుక్రవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకుని జగన్‌ సానుభూతితో గెలుపొందారని, ఇప్పుడు అదే కుట్రతో మళ్లీ గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్నాననే ఉద్దేశంతోనే కుట్ర పన్ని, కేసుల్లో ఇరికించి వైకాపా పెద్దలు తనను జైలుకు పంపారని చెప్పారు. కడప జైల్లో ఉన్న సమయంలో వివేకా కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను కలిశారని, డబ్బు ఆశ చూపి రాజీకి రావాలని అభ్యర్థించారని దస్తగిరి తెలిపారు.

సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభ పెట్టారని, వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తాను తేల్చిచెప్పినట్లు వెల్లడించారు. ఈసారి వివేకాను ఎవరు హత్య చేశారో చెప్పి ఓట్లు అడగాలని జగన్‌, అవినాష్‌రెడ్డిలను డిమాండ్‌ చేశారు. వారిద్దరూ పులివెందులలో ఓట్లు అడిగే పక్షంలో ప్రజలు రాళ్లు వేస్తారని హెచ్చరించారు. సిద్ధం సభల్లో వివేకాను హత్య చేసిందెవరో జగన్‌ చెబితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత దస్తగిరి పోలీసు బందోబస్తు మధ్య పులివెందుల వెళ్లారు. నాలుగు నెలల పాటు జైలు జీవితం అనుభవించిన దస్తగిరి.. ఏమాత్రం తగ్గకుండా సీఎం, వైకాపా నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని