వైకాపా నాయకుల దాష్టీకం.. తెదేపా, జనసేన మద్దతుదారుడి కోళ్లఫారం కూల్చివేత

వైకాపా నాయకులు.. రాజకీయ కక్షతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని పార్వతీశంపేట వద్ద తెదేపా, జనసేన మద్దతుదారుడి కోళ్ల ఫారాన్ని కూల్చేశారు.

Updated : 24 Feb 2024 08:49 IST

ఆమదాలవలస పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు.. రాజకీయ కక్షతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని పార్వతీశంపేట వద్ద తెదేపా, జనసేన మద్దతుదారుడి కోళ్ల ఫారాన్ని కూల్చేశారు. అడ్డువచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఆమదాలవలస పురపాలక సంఘం పరిధిలోని లక్ష్ముడుపేటకు చెందిన వైకాపా మద్దతుదారుడు పైల అప్పారావుకు చెందిన సుమారు 90 సెంట్ల మెట్ట భూమిని 2019లో కోళ్లఫారం పెట్టుకునేందుకు కిల్లి వెంకట ప్రసాద్‌ లీజుకు తీసుకున్నారు. ఇటీవల దాని కాలపరిమితి పూర్తయిందని, ఖాళీ చేయాలని స్థల యజయాని అప్పారావు.. ప్రసాద్‌కు సూచించారు. లీజు 15 ఏళ్లకు ఉందని ప్రసాద్‌ చెప్పగా.. కేవలం అయిదేళ్లకు మాత్రమే ఉందని అప్పారావు చెప్పడంతో ఇద్దరికి విబేధాలు వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున అప్పారావుతో పాటు మరికొందు వైకాపా నాయకులు పొక్లెయిన్‌తో కోళ్ల ఫారం ఉన్న మూడు షెడ్లను పడగొట్టేశారు. దీంతో కొన్ని కోళ్లతో పాటు కౌజు పిట్టలు మృత్యువాత పడ్డాయి. కేవలం తెదేపా నుంచి వైకాపాలోకి రాలేదనే ఉద్దేశంతో తన ఫారంపై దాడి చేశారని బాధితుడు ప్రసాద్‌ ఆరోపించారు. షెడ్లు కూల్చివేయడంతో రూ.50 లక్షలు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ కౌన్సిలర్‌ దుంపల చిరంజీవిరావుతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి, పొక్లెయిన్‌ను సీజ్‌ చేశామని సీఐ దివాకర్‌ యాదవ్‌ తెలిపారు. బాధితుడిని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహనరావు వేర్వేరుగా పరామర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని