తెనాలిలోనూ అతిసార?

గుంటూరు మాదిరిగా తెనాలిలోనూ కలుషిత నీరు ప్రజలను కాటేస్తోందని, ఇప్పటికే ఒకరు మృతి చెందినట్లు ప్రజలు చెబుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Published : 24 Feb 2024 05:28 IST

ఇప్పటికే ఒక మహిళ మృతి
కలుషిత నీటివల్లే: నాదెండ్ల మనోహర్‌

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: గుంటూరు మాదిరిగా తెనాలిలోనూ కలుషిత నీరు ప్రజలను కాటేస్తోందని, ఇప్పటికే ఒకరు మృతి చెందినట్లు ప్రజలు చెబుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ఆయన పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో పర్యటించారు. వాంతులు, విరేచనాలతో గురువారం ప్రాణాలు కోల్పోయిన బండి లక్ష్మి (62) కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. కొద్దిరోజుల నుంచి 25 మందికి పైగా జనం అతిసార లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని స్థానికులు వారికి చెప్పారు. పలువురు ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకోగా, మరికొందరు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారని, వారిని గుంటూరు పంపారని వివరించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ గుంటూరు ఘటన తర్వాత కూడా ప్రభుత్వం సరిగా స్పందించలేదని విమర్శించారు. గురవయ్య కాలనీలో అతిసార ప్రబలిందని చెప్పారు. మున్సిపల్‌, ఆరోగ్య విభాగాలు సత్వరం స్పందించి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితులు ఆరా తీయాలని డిమాండ్‌ చేశారు. రూ. 100 కోట్లతో తెనాలికి రక్షిత మంచినీటి పథకం తీసుకువస్తే దానిని నిర్వీర్యం చేశారని, కనీస మరమ్మతులు, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని