ఏజీ శ్రీరామ్‌, స్టాండింగ్‌ కౌన్సిల్‌ మనోహర్‌రెడ్డిపై ఆరోపణలు ఊహాజనితం

వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌, స్టాండింగ్‌ కౌన్సిల్‌ మనోహర్‌రెడ్డిలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.

Published : 24 Feb 2024 05:37 IST

న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత

ఈనాడు, అమరావతి: వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌, స్టాండింగ్‌ కౌన్సిల్‌ మనోహర్‌రెడ్డిలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. స్టాండింగ్‌ కౌన్సిల్‌ మనోహర్‌రెడ్డి రెగ్యులర్‌గా ప్రాక్టీసు చేయరని, మంచి ట్రాక్‌ రికార్డు లేదని పిటిషనర్‌ చేసిన ఆరోపణ.. ఆయన ప్రతిష్ఠకు కళంకం తెచ్చేదిగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు గతంలో లా ఆఫీసర్‌గా నియమితులైనట్లు పిటిషనర్‌ శివప్రసాద్‌రెడ్డి అంగీకరించారని, ఏజీగా శ్రీరామ్‌ వ్యవహరిస్తున్న సమయంలో మధ్యలో తొలగించారని గుర్తుచేసింది. ఏజీ శ్రీరామ్‌, స్టాండింగ్‌ కౌన్సిల్‌ మనోహర్‌రెడ్డిపై పిటిషనర్‌ చేసిన అవినీతి ఆరోపణలు కేవలం ఊహాజనితం, అనుమానంతో చేసినవని స్పష్టం చేసింది. ఇలాంటి ధోరణితో దాఖలు చేసే వ్యాజ్యాలను కట్టడి చేసే దిశగా పిటిషనర్లకు భారీగా ఖర్చులు విధించాలంటూ సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని గుర్తుచేసింది. వాస్తవానికి ఈ వ్యాజ్యంలో పిటిషనర్‌కు రూ.లక్ష ఖర్చులు విధించేవాళ్లమని తెలిపింది. పార్టీ ఇన్‌ పర్సన్‌గా హాజరై వాదనలు వినిపించిన ఆయన న్యాయవాద వృత్తిలో ఉన్నందున ఆ పని చేయడం లేదంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని