టెట్‌, టీఆర్‌టీల షెడ్యూల్‌ మార్చాలన్న అభ్యర్థనకు తిరస్కరణ

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ-డీఎస్సీ)ల నిర్వహణ మధ్య సముచిత సమయం ఉండే విధంగా షెడ్యూల్‌ను నిర్ణయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

Published : 24 Feb 2024 05:38 IST

ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వలేమన్న హైకోర్టు
తుది విచారణ 28కి వాయిదా

ఈనాడు, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ-డీఎస్సీ)ల నిర్వహణ మధ్య సముచిత సమయం ఉండే విధంగా షెడ్యూల్‌ను నిర్ణయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్‌ను ఆదేశించింది. తుది విచారణ జరిపేందుకు కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. టెట్‌ నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం ఈ నెల 8న ఇచ్చిన నోటిఫికేషన్‌, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12న ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. పరీక్షలకు సిద్ధపడేందుకు సముచిత సమయం లేకుండా షెడ్యూల్‌ను ఖరారు చేశారన్నారు. బుధవారం ఈ వ్యాజ్యంపై వాదనలు ముగిశాయి. శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించిన న్యాయమూర్తి.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని