తిరుపతిలో మేయర్‌ అనుచరుల దౌర్జన్యం

తిరుపతిలో అధికార పార్టీ నాయకుల భూ ఆగడాలపై ఇటీవలే ఓ ప్రవాస భారతీయురాలు విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపగా.. అదే సర్వే నంబరులో శనివారం 30 మందికి పైగా భూయజమానులపై మేయర్‌ శిరీష అనుచరులు దౌర్జన్య కాండ సాగించారు.

Published : 25 Feb 2024 06:08 IST

భూ యజమానులకు బెదిరింపులు
ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకులు

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతిలో అధికార పార్టీ నాయకుల భూ ఆగడాలపై ఇటీవలే ఓ ప్రవాస భారతీయురాలు విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపగా.. అదే సర్వే నంబరులో శనివారం 30 మందికి పైగా భూయజమానులపై మేయర్‌ శిరీష అనుచరులు దౌర్జన్య కాండ సాగించారు. తిరుపతి- రేణిగుంట మార్గంలోని పద్మావతినగర్‌ ప్రాంతంలో సర్వే నంబరు 1 మీదుగా మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు వేశారు. దానికి ఇరువైపులా ఉన్న భూముల్లో 30 ప్లాట్లను దశాబ్దాల క్రితం స్థానికేతరులు కొన్నారు. అక్కడ ఇళ్ల నిర్మాణాలకు పూనుకోగా, మేయర్‌ బంధువులమంటూ కొందరు ఆకతాయిలు అడ్డుకుంటున్నారు. ఏడాదిగా ప్రహరీలు కూడా నిర్మించుకోనివ్వలేదు. శనివారం శ్రీకాళహస్తి మండలం ముసలిపేడుకు చెందిన సుందరనాయుడు తన స్థలంలో షెడ్డు నిర్మాణ పనులు చేపట్టగా, 20 మందికి పైగా యువకులు మద్యం తాగొచ్చి కట్టడాలను కూలదోశారు. అడ్డుకునేందుకు యత్నించిన సుందరనాయుడి భార్య మస్తానమ్మపై దాడికి పాల్పడ్డారు. తాము ఇళ్లు కట్టుకుంటే చంపేస్తామని హెచ్చరించారని బాధితులు వాపోయారు. ఈ విషయం తెలిసి మిగతా ప్లాట్ల యజమానులు వచ్చారు. ఈ ఘర్షణను కొందరు ఫొటోలు, వీడియోలు తీయగా, దౌర్జన్యకారులు వారి ఫోన్లు లాక్కొని వారితోనే డిలీట్‌ చేయించారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. తిరుపతి తూర్పు స్టేషన్‌ పోలీసులు వచ్చాక వారంతా పరారయ్యారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు మేయర్‌ అనుచరులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తాము కోల్పోయిన స్థలాలకు టీడీఆర్‌ బాండ్లు కూడా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. ఈ పంచాయితీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి వద్దకు వెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని