జగన్‌ వెడలె.. జనం గుండెలదరగ...!

‘‘రాజువెడలె రవితేజములలరగ’’ అన్నట్లు తమ రాజ్యాల్లో తిరిగేవారు ఆనాటి చక్రవర్తులు.

Updated : 18 Apr 2024 16:28 IST

‘‘రాజువెడలె రవితేజములలరగ’’ అన్నట్లు తమ రాజ్యాల్లో తిరిగేవారు ఆనాటి చక్రవర్తులు. ‘‘జగన్‌ వెడలె జనం గుండెలదరగ’’ అన్నట్లుగా అడుగు బయటపెడుతుంటారు నేటి తాడేపల్లి ప్యాలెస్‌ ప్రభువులు. గడచిన అయిదేళ్లలో రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాదంమోపిన ప్రతిచోటా ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. విద్యార్థులు ఆగమయ్యారు. తన పర్యటనలకోసం జనజీవనాన్ని స్తంభింపజేయడం- జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వానికి నిలువుటద్దం. ఇక రాజకీయ సభలకోసం పచ్చని చెట్లు, పంట పొలాలు, కాల్వలను నాశనం చేయించడమైతే- నిస్సందేహంగా జగన్‌ పైత్యమే!


కూల్చివేతలు, నరికివేతలు... క్షతగాత్రులతో కకావికలమైనది ....యుద్ధక్షేత్రం! చెట్ల నరికివేతలు... కట్టడాల కూల్చివేతలు.. పంట కాలువ మూసివేతలు.. పరీక్షల వాయిదాలు... బలవంతపు రవాణాలు... ఇదీ- జగన్‌ సిద్ధ క్షేత్రం! ఆయన వస్తున్నాడంటే మనుషులే కాదు... చెట్టూ పుట్టా, రోడ్లూ, కాలువలూ... అన్నీ అదురుతున్నాయి. మౌనంగా రోదిస్తున్నాయి!


అడ్డగోలు పనులన్నింటికీ ‘సిద్ధం’ 

కాల వర్షాలో వరదలో ముంచెత్తినప్పుడు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇస్తుంటారు. జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తారు. కానీ, ఒక రాజకీయ సభకోసం పరీక్ష తేదీని హఠాత్తుగా మార్చిపారేయడం అంటే- అది హద్దులెరగని అధికార దుర్వినియోగం. అంతకుమించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే జగన్‌ వికార వ్యక్తిత్వానికి నిదర్శనం. తన బురదజల్లుడు ఉపన్యాసాలు, అసత్య విన్యాసాల ప్రదర్శనకుగాను జగన్‌కు జనం కావాలి. జిల్లాల నుంచి వారిని సభావేదికల దగ్గరికి తరలించడానికి బస్సులు పెట్టాలి. అందుకుగానూ విద్యాలయాలను మూసేయించాలి. ఆ రోజు పరీక్షలు ఏమైనా ఉంటే- వాటినీ ఆపేయాలి. మొన్న మూడో తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో జగన్‌ ‘సిద్ధం’ సభకోసం ఇంటర్‌ పరీక్షను అలాగే వాయిదా వేశారు. అయిదు లక్షల మంది విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. జనాన్ని లోకువగా జమకట్టే జగన్‌కు ఇది అలవాటైన పాత రోత పనే!


పిచ్చి ముదిరి...

ప్రజాస్వామ్య దేశంలో వీఐపీల పేరిట కొంతమందికి రాచమర్యాదలు చేయడాన్ని సుప్రీంకోర్టు గతంలోనే ఛీత్కరించింది. అసహ్యకరమైనదిగా ‘సుప్రీం’ అభివర్ణించిన ఆ వీఐపీ సంస్కృతిని జగన్‌ కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. తన పర్యటనలప్పుడు భద్రత పేరిట పట్టణాలూ నగరాల దిగ్బంధనాన్ని ఆయన ఓ ఆనవాయితీగా మార్చారు. ముఖ్యమంత్రికి తగిన విధంగా రక్షణ కల్పించడాన్ని ఎవరూ అభ్యంతరపెట్టరు. కానీ, అధికారిక కార్యక్రమాలకు కొద్ది రోజుల ముందు నుంచే షాప్‌లను మూసేయించడం, బ్యారికేడ్లు పాతి జనం రాకపోకలను అడ్డుకోవడం, ప్రతిపక్షాలూ ప్రజాసంఘాల నేతలను గృహనిర్బంధం చేయించడం వంటివి కచ్చితంగా కిరాతక పాలకుడి దుర్లక్షణాలే.

  • పదిహేను నెలల క్రితం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వెళ్లారు జగన్‌. ఆ రోజు ఉదయం నుంచే ఆ పట్టణంలోకి వచ్చే అయిదు రోడ్లనూ పోలీసులు మూసేశారు. ఎక్కడి వారిని అక్కడే కట్టిపడేసినట్లు పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేశారు.
  • మదనపల్లెలో జగన్‌ పర్యటన సందర్భంగా టమాటా మార్కెట్‌ యార్డును మూసేసి రైతుల పొట్టకొట్టారు. యార్డును పార్కింగ్‌ ప్రదేశంగా మార్చేశారు. స్థానిక దుకాణాలకూ తాళాలేయించారు. 
  • జగన్‌ నర్సీపట్నం వెళ్లినప్పుడు గంటల తరబడి కరెంట్‌ తీసేశారు. సీఎం భద్రతకోసం ముందస్తు జాగ్రత్త అంట అది! కరెంట్‌ ఉంటే జగన్‌కు వచ్చే ప్రమాదమేముంటుంది... పిచ్చి ముదిరి తలకు రోకలి చుట్టుకోవడం కాకపోతే!
  • రాజమహేంద్రవరంలో అయ్యవారి రోడ్‌ షో కోసం కొట్లను కట్టేయించి వ్యాపారుల నోట్లో మట్టికొట్టారు. కుప్పంలోనేమో రోడ్లు తవ్వి బ్యారికేడ్లు బిగించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, సామర్లకోట, అమలాపురం, తిరువూరు, గుంటూరు, నెల్లూరు జిల్లా సంగం, అనంతపురం జిల్లా నార్పాల, తిరుపతి,  నగిరి, చిత్తూరు... ఇలా అన్ని చోట్లా జగన్‌ పర్యటనలు స్థానికులను నరకయాతనలకు గురిచేశాయి. జగన్‌ సభలకు జనాన్ని తరలించడానికి వందల సంఖ్యలో బస్సులను వినియోగిస్తుంటారు. ఆ సమయంలో పిల్లాజెల్లాతో బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు గాస్తూ ఆర్టీసీ ప్రయాణికులు అనుభవించే కష్టాలైతే చెప్పనలవి కానివి!

‘కంస మామ’

నిరుడు అనంతపురం జిల్లాలో జగన్‌ సభకోసం స్థానిక జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్షలను వాయిదా వేశారు. అంతకు ముందు సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌, న్యాయ, అనుబంధ కళాశాలల్లో సెకండ్‌ మిడ్‌ ఎగ్జామ్స్‌ను అలాగే ఆపేశారు. విద్యార్థులను సీఎం కార్యక్రమానికి తరలించారు. జగన్‌ పార్టీ ప్లీనరీకోసమని చెప్పి నాగార్జునా విశ్వవిద్యాలయంలోనూ పరీక్షలు వాయిదా వేశారు. పరీక్షల కోసం పిల్లలు రాత్రనక పగలనక కష్టపడి చదువుకుంటారు. అవి హఠాత్తుగా వాయిదా పడితే- వారు అనుభవించే మానసిక క్షోభ అంతాఇంతా కాదు. తన పనికిమాలిన రాజకీయాలకోసం విద్యార్థులను విపరీతమైన ఒత్తిడికి గురిచేసిన జగన్‌ను ‘కంస మామ’ అని తిట్టుకుంటున్నారు అందరూ!


హెలికాప్టర్‌లో జగన్‌... రోడ్లన్నీ బంద్‌!

వీఐపీల రాకపోకల పేరిట ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టేయడం సబబు కాదని మద్రాస్‌ హైకోర్టు అభిప్రాయపడింది. అయిదు పది నిమిషాలకు మించి ట్రాఫిక్‌ ఆపొద్దని పోలీసులకు సూచించింది. జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో సాటిలేని ప్రజాకంటకులైన ఏపీ ఖాకీలకు ఇటువంటి పట్టింపులేమీ లేవు. వైకాపా అధినేత అడుగులకు మడుగులొత్తుతూ వారు చేసిన తలకుమాసిన పనులకు లెక్కేలేదు. విజయనగరం జిల్లా భోగాపురంలో జగన్‌ పర్యటన కోసమని అక్కడికి 135 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్‌ ఆపేశారు. తాను హెలికాప్టర్‌లో వెళ్తుంటే కింద రోడ్లన్నీ నిర్మానుష్యం కావాలనుకునే అధికార అహంభావం జగన్‌ది! అవసరానికి మించి హెలీపాడ్‌లను నిర్మించి ప్రజాధనాన్ని మట్టిపాలు చేయడం వంటివీ ఆయన ఏలుబడిలో పరిపాటి అయ్యాయి.


చెట్లను కూల్చిన చరిత్రహీనుడు

విద్వేష మనస్కులు, హింసోన్మాదుల్లో అత్యధికులు వ్యక్తిగతంగా భయస్తులు. జగన్‌మోహన్‌రెడ్డిది కూడా అదే బాపతు. అందుకే ప్రాణవాయువును అందించే చెట్లను చూసినా ఆయన వెన్నులో వణుకుపుడుతుంది. రాజ్యాధినేతగా రహదారుల పక్కన మొక్కలు నాటించిన అశోకుడు చరిత్రలో నిలిచిపోయాడు. నడమంత్రపు అధికార కిరీటం పెట్టుకున్న జగన్‌- తాను అడుగుపెట్టిన ప్రతిచోటా పచ్చటి చెట్లను కొట్టేయించి చరిత్రహీనుడయ్యారు. అసలు ఇంతకూ చెట్లకూ భద్రతకూ లంకె ఏమిటో... దేశంలో మరే ముఖ్యమంత్రికి, ఆఖరికి రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు కూడా లేని సమస్య జగన్‌కు ఎందుకో ఎవరికీ తెలియదు.


సామాజిక ఆస్తుల విధ్వంసం

ప్రచార సభలు నిర్వహించే మైదానాల్లో పిచ్చి మొక్కలు, రాళ్లు వంటివి ఉంటే తొలగించడం మామూలే. అంతటితో ఊరుకుంటే అది జగన్‌ పార్టీ ఎందుకు అవుతుంది. వైకాపా అధినేత ఆత్మస్తుతులకోసం అవసరమైతే పొలాలను పాడుచేయడానికి కూడా వెనకాడరు. దెందులూరు జగన్‌ సభ ఏర్పాట్లలో భాగంగా చుట్టుపక్కల మినప పంటను నాశనం చేశారు. సభాస్థలికి సమీపంలోని ఓ కాల్వను పూడ్చేశారు. కొద్ది నెలల క్రితం నూజివీడులో కూడా అలాగే జగన్‌కోసం ఓ పంట కాల్వను మట్టితో నింపేశారు. సీఎం కాన్వాయ్‌కు అడ్డు వస్తోందని చెప్పి అక్కడి మామిడి పరిశోధనా కేంద్రం ప్రహరీని కూల్చేశారు. అమలాపురంలోనూ అంతే. జగన్‌ సభ ఏర్పాట్లలో భాగంగా బాలయోగి స్టేడియం ప్రహరీని కూలగొట్టారు. ఒట్టి డబ్బు దండగ పనులు తప్ప వీటిలో ప్రజాప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అసలు? ప్రజలకు, సామాజిక ఆస్తులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించడం సర్కారీ బాధ్యత అన్న కనీస ఇంగితం జగన్‌ ప్రభుత్వంలో కొరవడింది. సీఎంకు స్వాగతం పలికేందుకు మండుటెండలో బడి పిల్లలను రోడ్డు పక్కన నిల్చోబెట్టడం వంటి పిచ్చి పనులతోనూ జగన్‌ జమానా పరువుమాసింది.


పరదాల మధ్యలో జగ్గరాజు!

ప్రజానాయకులు ఎవరైనా జనాన్ని నేరుగా కలుస్తారు. వారి కష్టనష్టాలను స్వయంగా తెలుసుకుంటారు. ముఖ్యమంత్రిగా జగన్‌ ఆ పని ఎప్పుడైనా చేశారా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఆయన సభలూ సమావేశాల్లో భారీయెత్తున బారికేడ్లు పాతేసి సామాన్యులను అల్లంత దూరంలో నిలబెట్టేస్తుంటారు. ఆఖరికి సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్‌ పర్యటించినప్పుడూ అలాగే చేశారు. యుద్ధం, సిద్ధం అంటూ వీర ప్రగల్భాలు పలికే జగన్‌కు జాగృత జనవాహిని అంటే భయం. అందుకే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడూ స్థానికులకు తీవ్ర నిర్బంధం తప్పలేదు.

పరదాల మధ్యలో రాకపోకలు-  సామాన్యుల ఆందోళనలను పట్టించుకోవడానికి ఇష్టపడని జగన్‌ నిజ నైజానికి తార్కాణాలు. నలుపు నారాయణ స్వరూపం అంటారు కానీ, ఆ రంగు చూస్తే జగన్‌కు తన పాలనపై పెల్లుబుకుతున్న జనాగ్రహం గుర్తొస్తుందేమో! నరసాపురంలో ఆయన నిర్వహించిన సభకు నల్లబట్టల్లోని వారిని అనుమతించలేదు. నల్ల చున్నీలు ధరించిన యువతులను వాటిని తీసేసి లోపలికి వెళ్లమన్నారంటే ఏమనుకోవాలి? బాధ్యత కలిగిన సీఎంగా జనహితాన్ని, రాష్ట్రాభివృద్ధిని జగన్‌ ఏనాడూ పట్టించుకోలేదు. కానీ, మందీమార్బలంతో హంగూ ఆర్భాటాలతో పర్యటనలు చేస్తూ- కరకు ఆంక్షలతో జనజీవనాన్ని పెను ఇక్కట్ల పాల్జేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని