ఎయిమ్స్‌పైనా జగన్‌ అక్కసు

ఎయిమ్స్‌.. దేశంలోనే అత్యున్నత జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ రాష్ట్రానికి వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే.. అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పిస్తారు.

Updated : 25 Feb 2024 08:09 IST

శాశ్వత తాగునీటి సదుపాయం కల్పించకుండా కక్ష సాధింపు
సమీపంలోనే 10 ఎకరాల్లో డంపింగ్‌ యార్డు నిర్వహణ
నేడు జాతికి అంకితం చేయనున్నప్రధాని మోదీ

ఈనాడు, అమరావతి: ఎయిమ్స్‌.. దేశంలోనే అత్యున్నత జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ రాష్ట్రానికి వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే.. అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పిస్తారు. సీఎం జగన్‌ మాత్రం వసతులు కల్పించట్లేదు సరికదా.. వాటికి అడుగడుగునా మోకాలడ్డుతున్నారు. అధికారం చేపట్టి అయిదేళ్లవుతున్నా శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సదుపాయం కల్పించలేదు. దీంతో గత్యంతరం లేక ఆ సంస్థే.. తమ అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటోంది. బహుశా దేశంలో ఏ ప్రఖ్యాత సంస్థా ఇంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొని ఉండదేమో. దీనికితోడు ఎయిమ్స్‌ ప్రవేశద్వారాన్ని ఆనుకుని 10 ఎకరాల విస్తీర్ణంలో జగన్‌ ప్రభుత్వం డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసింది. తాడేపల్లి మంగళగిరి పట్టణాల్లో పోగయ్యే చెత్తను తెచ్చి ఇక్కడ పారబోసింది. రోజూ చెత్తకు నిప్పంటిస్తూ.. ఆ పొగతో రోగులు, వైద్యులు ఉక్కిరిబిక్కిరయ్యేలా చేసింది. చివరికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆసుపత్రికి చేరుకోవడానికి సరిపడా ఆర్టీసీ బస్సులు నడపకుండా తన అక్కసు ప్రదర్శిస్తోంది. ఈ సంస్థ తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రావడం, అందులోనూ రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో జగన్‌ దీనిపై కక్ష సాధిస్తున్నారు. 

మూడున్నరేళ్లు కాలయాపన చేసి..

గత తెదేపా ప్రభుత్వ హయాంలో మంగళగిరి వద్ద రూ.1,618 కోట్ల వ్యయంతో 183 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)ను ఏర్పాటు చేసింది. 2019 మార్చి నుంచి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్‌ అవసరాల కోసం రోజుకు 2.5 మెగాలీటర్ల నీరు(ఎంఎల్‌డీ) కావాలి. గుంటూరు ఛానల్‌ నుంచి ఆత్మకూరు చెరువుకు నీళ్లు మళ్లించి.. అక్కడి నుంచి అయిదున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రి వరకూ పైపులైన్లు వేసి నీరు సరఫరా చేయాలనేది ప్రణాళిక. 2019 ఎన్నికల్లో అధికారం చేపట్టిన జగన్‌ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాటు తాగునీటి సదుపాయం కల్పించే పనులు చేపట్టలేదు. ఆ తరువాత ఏడాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో 2022 డిసెంబర్‌లో రూ.8 కోట్లతో పనులు ప్రారంభించింది. ఇప్పటికే రెండుసార్లు నిర్దేశిత గడువు దాటినా పనులు పూర్తికాలేదు.

అత్యవసర సేవల విభాగానికి స్థలం కేటాయించని జగన్‌

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పోగయ్యే చెత్తను ఎయిమ్స్‌ సమీపంలోని 10 ఎకరాల్లో డంపింగ్‌ చేసేవారు. ఈ విషయంపై పత్రికల్లో కథనాలు రావటంతో గత కొన్నాళ్లుగా అక్కడ చెత్త వేయట్లేదు. ఆ స్థలాన్ని తమకు అప్పగిస్తే అత్యవసర సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని నిర్మిస్తామంటూ ఎయిమ్స్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయినా జగన్‌ సర్కార్‌ ఆ స్థలాన్ని అప్పగించడం లేదు.

సరిపడా ఆర్టీసీ బస్సులు నడపట్లేదు

గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి ఎయిమ్స్‌కు చేరుకునేందుకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేవు. రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. శని, ఆదివారాల్లో సర్వీసులను మరింతగా తగ్గిస్తున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్న రోజుల్లో సర్వీసులన్నీ రద్దు చేస్తున్నారు. చాలా మంది వడ్డేశ్వరం వద్ద బస్సు దిగి అక్కడి నుంచి ఆటోల్లో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పేద రోగులకు ఈ రవాణా ఛార్జీలు భారమవుతున్నాయి.

రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌గా

మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని ఆదివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. దీంతోపాటు కడప, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం ప్రభుత్వ బోధన ఆసుపత్రులతో పాటు తెనాలి, హిందూపురం జిల్లా ఆసుపత్రుల్లో రూ.230 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖలో స్టేట్‌ ఫుడ్‌ల్యాబ్‌ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రో బయాలజీ టెస్టింగ్‌ ల్యాబ్‌ను, రూ.2.07 కోట్ల విలువైన నాలుగు మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లనూ ప్రారంభించనున్నారు.


రూ.3 లక్షలు చెల్లించలేరా?

  • వడ్డేశ్వరం కూడలి నుంచి ఎయిమ్స్‌ వరకూ గతంలోనే రహదారి నిర్మించారు. దీనికి సంబంధించి కటింగ్‌ ఛార్జీల కింద జాతీయ రహదారి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆ సొమ్ము చెల్లిస్తేనే కొండను తొలచి తాగునీటి పైపులైన్‌ వేసుకోవటానికి పర్యావరణ అనుమతులు లభించనున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
  • ఎయిమ్స్‌కు తాగునీటి సదుపాయం కల్పన కోసం కొద్దిపాటి సివిల్‌ పనులు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించకపోవటంతో గుత్తేదారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాదాపు రూ.2 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
  • రోగులు, వారి సహాయకులు సీసాల్లో తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఎయిమ్స్‌ కూడా అయిదేళ్లుగా ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటుంది. ఇందుకోసం రూ.కోటి ఖర్చు చేయాల్సి వచ్చింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని