AP News: టెట్‌ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద ‘పరీక్ష’

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరానికి చెందిన అభ్యర్థికి బెంగళూరులో టెట్‌ పరీక్ష కేంద్రం కేటాయించారు.

Updated : 25 Feb 2024 08:52 IST

కొందరు అభ్యర్థులు 30 గంటలు ప్రయాణించాలి
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అభ్యర్థికి బెంగళూరులో పరీక్షా కేంద్రం
బెంగళూరు, చెన్నై, బరంపురం, హైదరాబాద్‌ల్లోనూ సెంటర్లు
నిరుద్యోగులతో జగన్‌ సర్కార్‌ ఆటలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరానికి చెందిన అభ్యర్థికి బెంగళూరులో టెట్‌ పరీక్ష కేంద్రం కేటాయించారు. పరీక్ష కేంద్రానికి వెళ్లాలంటే 855 కిలోమీటర్లు ప్రయాణించాలి. వెళ్లి వచ్చేందుకు 30 గంటలు సమయం పడుతుంది. ఇది ఎన్నికల ముందు జగన్‌ సర్కార్‌ నిరుద్యోగులకు ఇస్తున్న కానుక.

ఈనాడు, అమరావతి: ఎన్నికల ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), డీఎస్సీ ప్రకటించిన జగన్‌ సర్కార్‌ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. చదువుకునేందుకు సమయం ఇవ్వలేదని ఒకపక్క అభ్యర్థులు గగ్గోలు పెడుతుండగా.. ఇప్పుడు టెట్‌ పరీక్ష కేంద్రాలను వందల కిలోమీటర్ల దూరంలోని పక్క రాష్ట్రాల్లో కేటాయించి వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టింది. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినా ఇష్టారాజ్యంగా పరీక్ష కేంద్రాలను కేటాయించింది. బెంగళూరు, చెన్నై, బరంపురం, హైదరాబాద్‌ల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మొదట్లో సమీప జిల్లాల వారికే పక్క రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తామని గొప్పలు చెప్పింది. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేసేలా పరీక్ష కేంద్రాలు కేటాయించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను చూసి, బెంబేలెత్తిపోతున్నారు. పరీక్ష రాసేందుకు ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదారి జిల్లా రాయవరానికి చెందిన అభ్యర్థికి బెంగళూరులో పరీక్ష కేంద్రం కేటాయించారు. సాధారణంగా టెట్‌, డీఎస్సీ రాసే అభ్యర్థుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతివారే ఉంటారు. పైగా అభ్యర్థులు నిరుద్యోగులు. పరీక్షల సన్నద్ధతకే అప్పులు చేస్తున్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి కూడా రూ.వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని అభ్యర్థులు వాపోతున్నారు.

అభ్యర్థులు తగ్గినా..

టెట్‌-2022కు రాష్ట్రవ్యాప్తంగా 5,25,789 మంది దరఖాస్తు చేయగా.. ఈసారి 51 శాతం తగ్గి 2,67,559 దరఖాస్తులే వచ్చాయి. కానీ, పరీక్ష కేంద్రాలను మాత్రం పక్క రాష్ట్రాల్లో కేటాయించారు. మొదట పరీక్ష కేంద్రాన్ని ఎంచుకున్న వారికి రాష్ట్రంలో పరీక్ష కేంద్రం వస్తుందని చెప్పిన ప్రభుత్వం అభ్యర్థుల మధ్య పోటీ పెట్టింది. సర్వర్‌ సమస్య కారణంగా వెబ్‌సైట్‌ సక్రమంగా పని చేయక కొందరు అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేయలేకపోయారు. అభ్యర్థి స్థానిక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా కేంద్రాలు కేటాయించారు. 2022లోనూ ఇలా పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో చాలా మంది పరీక్ష రాయలేకపోయారు. అప్పట్లో దరఖాస్తులు ఎక్కువగా రావడం వల్ల పొరుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దరఖాస్తులు తగ్గినా అదే పరిస్థితి. పరీక్ష రాయాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిందే అంటే ఎట్లా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఎస్జీటీ (పేపర్‌1)కి 23 శాతం మందికి వారు ఎంచుకున్న మొదటి ప్రాధాన్య కేంద్రం కాకుండా ఇతర కేంద్రాలు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు