కొడాలి నాని నియోజకవర్గానికెళ్లే దారి ఇదీ!

రాష్ట్రంలో అత్యంత నిరాదరణకు నోచుకున్నవంటే రోడ్లే కావచ్చు. విస్తరణ పక్కనపెడితే గుంతలూ పూడ్చడం లేదు. దాంతో వాటిపై ప్రయాణాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి.

Published : 25 Feb 2024 04:32 IST

రాష్ట్రంలో అత్యంత నిరాదరణకు నోచుకున్నవంటే రోడ్లే కావచ్చు. విస్తరణ పక్కనపెడితే గుంతలూ పూడ్చడం లేదు. దాంతో వాటిపై ప్రయాణాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. గుడివాడ నుంచి కంకిపాడు వరకు 21 కి.మీ రహదారి వాహనదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు 2021 మేలో ఈ రోడ్డు విస్తరించాలని శంకుస్థాపన చూశారు. రూ.16.1 కోట్లు ఇందుకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గుడివాడ నుంచి సుమారు కిలోమీటరు మేర పనులు చేశారు.

8 నెలల కిందట పనులు ఆపేశారు. ఇప్పుడా రహదారి అధ్వానంగా మారింది. ఓ వైపు కుంగిపోయి, పెచ్చులుగా లేచిన తారుతో, భారీ గోతులు ఏర్పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఎంత నెమ్మదిగా వెళ్లినా పడిపోవడం ఖాయం అన్నట్లు ఆ రోడ్డు ఉంది. అందుకే ఆ మార్గంలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. బస్సుల వంటి పెద్ద వాహనాలు ఇటుగా ఒక్క ట్రిప్పు వేస్తే బోల్టులు, సీట్లు, చక్రాలు ఊడిపోతున్నాయని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కొడాలి నాని రెండున్నరేళ్లు మంత్రిగా చేసినా తన నియోజకవర్గానికి కనీసం రోడ్డు వేయించుకోలేకపోయారని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని