సర్కారువారి విషపు ‘సుక్క’

మామూలుగానైతే... మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఏపీలో ఏకంగా ప్రాణాంతకం. పాలకుల ధనదాహం.. విషాల రసాయనం.. వెరసి గుల్లవుతున్న పేదల దేహం.. కాలేయాలు చెడిపోయి.. నాలుకలు ఎండిపోయి.. కడుపులు మంటెక్కిపోయి.. కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి.. మంచానికే పరిమితం.. కుటుంబాలు కకావికలం.. జె బ్రాండ్లలో హానికర అవశేషాలున్నాయని తేలినా.. వైకాపా సర్కారు అడ్డగోలు వాదనలు.. ఆయనకేమో కట్టలకొద్దీ డబ్బులు.. పేదల ఇళ్లలో చావుడప్పులు!

Updated : 26 Feb 2024 06:53 IST

అమాయకులను పొట్టనబెట్టుకుంటున్న జె బ్రాండ్‌ మద్యం
చిన్న చిన్న సమస్యలతో మొదలై.. కాలేయాన్నే తినేస్తున్న మందు
పేద కుటుంబాలతో జగన్‌ చెలగాటం
ఎవరిని కదిపినా.. కన్నీటి గాథలే..
‘ఈనాడు’, ‘న్యూస్‌టుడే యంత్రాంగం’ రాష్ట్ర వ్యాప్త సర్వేలో వెల్లడి
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే యంత్రాంగం

మామూలుగానైతే... మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఏపీలో ఏకంగా ప్రాణాంతకం. పాలకుల ధనదాహం.. విషాల రసాయనం.. వెరసి గుల్లవుతున్న పేదల దేహం.. కాలేయాలు చెడిపోయి.. నాలుకలు ఎండిపోయి.. కడుపులు మంటెక్కిపోయి.. కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి.. మంచానికే పరిమితం.. కుటుంబాలు కకావికలం.. జె బ్రాండ్లలో హానికర అవశేషాలున్నాయని తేలినా.. వైకాపా సర్కారు అడ్డగోలు వాదనలు.. ఆయనకేమో కట్టలకొద్దీ డబ్బులు.. పేదల ఇళ్లలో చావుడప్పులు!

ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరైనా విషమని తెలిసీ కొనుక్కుంటారా? ప్రాణాంతకమని తెలిసినా.. రోజువారీ సంపాదనలో సగానికి పైగా సొమ్ము దాని కోసమే తగలేస్తారా?

మేము మాత్రం ‘జగన్‌ అమ్ముతున్న’ ఆ విషాన్నే కొంటున్నాం.. చావును కొనితెచ్చుకుంటున్నామని ఏపీలో మద్యం తాగే వారు చెబుతున్నారు. రోజువారీ ఆదాయంలో సగానికి పైగా మద్యానికే అవుతుందని,

ప్రభుత్వానికి డబ్బులిచ్చి మరీ బలిపీఠంపైకి ఎక్కుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలవాటు మానుకోలేక.. నాణ్యమైన మద్యం దొరక్క.. ‘జగన్‌ అమ్మే మందు’ తాగుతున్నామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో మద్యం తాగే అలవాటున్న పలువురిని ‘ఈనాడు’, ‘న్యూస్‌టుడే’ ప్రతినిధులు పలకరించగా వెలిబుచ్చిన అభిప్రాయాలివీ..

‘రాష్ట్రంలో ఇప్పుడు లభిస్తున్న మందంతా నాసిదే. ఈ మద్యం వల్ల తెలిసిన వారు చాలామంది నా కళ్లముందే చనిపోయారు’ అని విశాఖ గంగవరానికి చెందిన ఓ మత్స్యకారుడు చెప్పారు.

‘వైకాపా ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం నాసిరకమైంది. దీని బారిన పడి మా గ్రామంలో చిన్న వయసులోనే అనేక మంది మృతిచెందారు. ఇలాంటి మందు అమ్మకాలను ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిది’ అని విజయనగరం జిల్లా ముంజేరుకు చెందిన ఒకరు అన్నారు.

నిద్ర పట్టదు.. కడుపులో మంట తగ్గదు

  • ‘ప్రస్తుతం రాష్ట్రంలో లభిస్తున్న మద్యం తాగితే నిద్ర పట్టదు. కడుపులో మంట వస్తోంది. నోరంతా ఎండిపోతోంది. నాసిరకం మద్యం తాగటం వల్లే నా ఆరోగ్యం దెబ్బతింది. ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతున్నా’ అని పుట్టపర్తికి చెందిన ఒకరు వాపోయారు.  
  • ‘నాసిరకం మద్యం తాగటం వల్ల పక్కటెముకల్లో నొప్పి, గుండె దడ వస్తోంది. వైద్యులేమో విశ్రాంతి తీసుకోమన్నారు. గతంలో రోజంతా పనిచేసుకుని, రాత్రికి మద్యం తాగి పడుకుంటే ఉదయాన్నే హుషారుగా మళ్లీ పనికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఉదయం లేవలేకపోతున్నాం’ అని గుంటూరు మిర్చియార్డులో కూలీగా పనిచేసే ఓ వ్యక్తి వివరించారు.  

ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా

కొన్నేళ్లుగా మద్యం తాగుతున్నా, ఏ సమస్యా రాలేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక నాసిరకం మందును తీసుకొచ్చారు. ఆ ప్రభావంతో కాలేయం దెబ్బతింది. తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

రాము, అల్లూరి సీతారామరాజు జిల్లా


కాలేయం దెబ్బతిందన్నారు

రెండు నెలల కిందట విపరీతంగా కడుపులో మంట వచ్చింది. వైద్యులు పరీక్షించి.. మద్యం తాగటం వల్ల కాలేయం దెబ్బతిందన్నారు.

రిక్షా కార్మికుడు, ఏలూరు


ప్రతిపక్షాల కుట్ర అంటూ కొట్టిపడేసిన జగన్‌

రాష్ట్ర మద్యంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తొలి నుంచీ సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అయినా సరే.. జగన్‌ ప్రభుత్వం వాటిని బేఖాతరు చేసింది. చెన్నై ల్యాబ్‌ నివేదికపై సీఎం జగన్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. మద్యం ఆదాయాన్ని తగ్గించేందుకు ప్రతిపక్షాలు కుట్రకు తెరలేపాయనీ.. సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకోవాలనేదే ఉద్దేశమంటూ అడ్డగోలుగా వాదించారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో తరచూ తాగే అలవాటున్న వారి అభిప్రాయాలను విశ్లేషిస్తే.. వైకాపా సర్కారు అమ్ముతున్న మద్యంపై వస్తున్న ఫిర్యాదులు, అనుమానాలు, సందేహాలు నిజమేనని స్పష్టమవుతోంది.


అంతకుముందెన్నడూ లేనిది..

మద్యం ‘స్లో పాయిజన్‌’లా తమ ఊపిరి తీసేస్తోందనీ, ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లు ఉంటోందనీ, ఉన్నట్టుండి ఆయాసంగా అనిపిస్తోందనీ.. ఇలా రకరకాల దుష్ప్రభావాలను ఏకరవు పెడుతున్నారు. కొందరైతే చర్మం కందిపోతూ.. కళ్లు ఎరుపెక్కిపోతున్నాయంటున్నారు. ఇంకొందరు.. జీర్ణవ్యవస్థ దెబ్బతింటోందని, మూర్ఛతో పడిపోతున్నామని వాపోతున్నారు. అసలేం జరుగుతోందో తెలిసేలోగానే కాలేయం, క్లోమ గ్రంథి (పాంక్రియాస్‌) దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నామంటూ మరికొందరు ఆందోళనగా చెబుతున్నారు. చాలా ఏళ్లుగా మద్యం తాగుతున్నా.. అంతకు ముందెన్నడూ ఆరోగ్య సమస్యలు లేవనీ.. స్పిరిట్‌లో రంగు, ఇతర ఫ్లేవర్లు కలుపుతుండటంతో నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.


విష రసాయనాలు ఉన్నట్లు అప్పుడే వెలుగులోకి..

రాష్ట్రంలో విక్రయిస్తున్న పలు రకాల బ్రాండ్ల మద్య నమూనాలను తెదేపా నేతలు సేకరించి.. చెన్నైలో పరీక్షలు చేయించారు. వాటిల్లో పైరోగలాల్‌, ఐసోపులెరిక్‌ యాసిడ్‌, డై ఇథైల్‌ థాలేట్‌ వంటి విష రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఆ పరీక్ష ఫలితాలను 2022 జూన్‌ నెలలో బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముతున్న మద్యంలో బెంజోక్వినోన్‌, స్కోపారోన్‌, పైరోగలాల్‌, వొల్కొనిన్‌, కాప్రోనల్యాక్టమ్‌ తదితర రసాయనాలు ఉన్నట్లు 2022 మార్చి నెలలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేయించిన పరీక్షల్లో తేలింది. ఈ వివరాలతో ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారాయన. ఈ రసాయనాలు కలిసిన మద్యం ‘స్లో పాయిజన్‌’తో సమానమని అందులో పేర్కొన్నారు.


నీళ్లూ హానికరమేనంటూ ప్రభుత్వ వాదన

ప్రధానమంత్రికి ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా వాదించింది. నీళ్లూ మనిషికి హానికరమేననీ, కొబ్బరి నీళ్లు సైతం వినియోగానికి పనికిరావంటూ వ్యంగ్యంగా స్పందించింది. అప్పటి ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గుంటూరులోని ప్రాంతీయ ఎక్సైజ్‌ ప్రయోగశాల కెమికల్‌ ఎగ్జామినర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. అత్యధిక రెజల్యూషన్‌ కలిగిన మాస్‌ స్పెక్టోమెట్రీపై ఆర్బీట్రాప్‌ పద్ధతి ద్వారా విశ్లేషిస్తే నీళ్లు కూడా మనుషులకు హానికరమేననీ, అందులోనూ చిన్న చిన్న మలినాలు కనిపిస్తాయని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని