అంతా తూచ్‌.. ఉద్యమం లేదు

అంతా తూచ్‌.. ఉద్యమం లేదట! వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు తన సొంత ప్రయోజనం కోసం ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టుపెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తుతున్నాయి.

Updated : 26 Feb 2024 07:00 IST

మినిట్స్‌లో హామీ ఇచ్చారట.. ‘చలో విజయవాడ’ను వాయిదా వేశారట
ఉద్యమాన్ని మధ్యలో వదిలేయడంపై మండిపడుతున్న ఉద్యోగులు
సామాజిక మాధ్యమాల్లో బండి శ్రీనివాసరావుపై విమర్శలు

ఈనాడు, అమరావతి: అంతా తూచ్‌.. ఉద్యమం లేదట! వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు తన సొంత ప్రయోజనం కోసం ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టుపెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తుతున్నాయి. ఏపీ ఐకాస తరఫున ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన సమయంలోనే ‘మాకు నమ్మకం లేదు దొర’ అంటూ ట్రోల్‌ చేశారు. మరోసారి ప్రభుత్వానికి ఉద్యోగులను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారంటూ విమర్శలు సంధించారు. ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. విచిత్రమేమిటంటే ఒక్క డిమాండ్‌పైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోయినా మినిట్స్‌లోపెట్టినందుకు ఈ నెల 27న జరగాల్సిన ‘చలో విజయవాడ’ను వాయిదా వేస్తున్నట్లు బండి శ్రీనివాసరావు ప్రకటించడంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ నిర్ణయాన్ని ఐక్య ఉపాధ్యాయ సంఘం(యూటీఎఫ్‌), ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) ఖండించాయి. ఏపీ ఐకాసలోని చాలా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.  తూతూమంత్రంగా ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించి వాయిదా వేశారని విమర్శిస్తున్నాయి. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడైన బండి ఈ నెలలో పదవీవిరమణ పొందనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం చర్చల్లో ఏ ఒక్క హామీ లభించకపోయినా ‘చలో విజయవాడ’ను రద్దు చేయడమంటే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లోని చైతన్యాన్ని నీరుగార్చడమేనని ఏపీటీఎఫ్‌ పేర్కొంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడి పోరాటం చేయాల్సిన ఏపీ ఐకాస ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా సాధించకుండానే వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నట్లు యూటీఎఫ్‌ ప్రకటించింది.

ముందుగా లీక్‌ చేసి..

‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉండదని ఏపీ ఐకాస కీలక నేత మంత్రివర్గ ఉప సంఘం చర్చలకు ముందే తనకు సన్నిహితంగా ఉండే నాయకులకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ కార్యక్రమం అనుమతి కోసం ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ను కలిసేందుకే ఆయన ఆసక్తి చూపలేదని, కనీసం లేఖనే ఇవ్వలేదని చెబుతున్నారు. మరోపక్క ఈ కార్యక్రమానికి సంబంధించి ఏపీ ఐకాస తరఫున పోస్టర్లు, కరపత్రాలను జిల్లాలకు పంపించాల్సి ఉండగా.. వాటిని సక్రమంగా సరఫరా చేయలేదు. దీన్ని వాయిదా వేసేందుకే ఆ నాయకుడు ముందు నుంచి ఇలాంటి వ్యవహారాలు చేసినట్లు విమర్శలున్నాయి. ప్రభుత్వ సలహాదారుతో శనివారం రాత్రి ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

రూ.250 కోట్లే చెల్లించినా

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.21 వేల కోట్లు ఉంటే కేవలం రూ.250 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఇప్పటి వరకు 12వ పీఆర్సీ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోగా..9మంది సభ్యులను ఇప్పుడు నియమించింది. ఈ కమిషన్‌ నివేదిక ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. మధ్యంతర భృతి ఇవ్వకుండా జులైలో పీఆర్సీ ఇస్తామని మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటినుంచో చెబుతోంది. సెప్టెంబరు 2004 కంటే ముందు నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్‌ అమలు చేస్తామని చర్చల్లో చెబుతూనే అమలు చేయడం లేదు. గతంలో పెన్షనర్లకు ఉన్న అదనపు క్వాంటం పెన్షన్‌ను పీఆర్సీ సమయంలో జగన్‌ సర్కారు తీసేసింది. ఇప్పుడు దాన్ని ఇస్తామని మాత్రమే చెప్పింది.

వీటిపై ప్రభుత్వం మినిట్స్‌ ఇవ్వడంతో ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఐకాస ప్రకటించింది. ఏ ఒక్క సమస్యకూ స్పష్టమైన హామీ లేకపోయినా మధ్యలోనే ఉద్యమాన్ని వదిలేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో మరణించిన ఎయిడెడ్‌, స్థానిక సంస్థలకు చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఎంతో కాలంగా ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ, డేటా సేకరిస్తున్నామని మాత్రమే మినిట్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. సాధారణ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలకు మరో 15రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికీ డేటా సేకరిస్తుంటే ఏం ప్రయోజనం అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.


ఉద్యోగులను వంచించడమే..

‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలూ పొందకుండా, ఐకాస పేర్కొన్న 20 డిమాండ్లలో ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండా ‘చలో విజయవాడ’ను వాయిదా వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఉద్యమాన్ని నిలిపివేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను వంచించడమే. కాలయాపన చేయడం తప్ప ఒక్క ప్రయోజనాన్ని కూడా ఉద్యోగులకు కల్పించలేదు.

చెన్నుపాటి మంజుల, భానుమూర్తి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్‌


అంతా బూటకమే..

జీపీఎఫ్‌, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ లాంటి బకాయిలు రూ.20 వేల కోట్లు చెల్లించే విషయంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మినిట్స్‌ జారీ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. మధ్యంతర భృతి ఇవ్వకుండా పీఆర్సీ ఇస్తామని చెప్పడం బూటకం. ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నందున ఉద్యమం చేయాల్సిన సమయంలో ఇలా అర్ధాంతరంగా ఉద్యమాన్ని వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోరాటాన్ని కొనసాగించాలి’

వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, యూటీఎఫ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని