వైకాపా నేతల వికృత క్రీడలో హనుమ విహారి ఔట్‌!

వైకాపా నాయకులా... మజాకా! వాళ్లు తలుచుకుంటే పారిశ్రామికవేత్తలేం ఖర్మ.. క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందే! దేశం తరఫున పలు టెస్ట్‌మ్యాచ్‌లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్‌ హనుమ విహారి వైకాపా నాయకుల దెబ్బకు..

Updated : 27 Feb 2024 09:34 IST

రంజీ జట్టు కెప్టెన్సీ నుంచి విహారిని పీకేశారు
జట్టులో 17వ ఆటగాడైన వైకాపా కార్పొరేటర్‌ కుమారుణ్ని మందలించాడనే ఆగ్రహంతోనే
తీవ్ర అవమానభారంతో నిష్క్రమించిన క్రికెటర్‌
జీవితంలో ఆంధ్రా జట్టుకు ఆడబోనని ప్రకటన

ఈనాడు, అమరావతి: వైకాపా నాయకులా... మజాకా! వాళ్లు తలుచుకుంటే పారిశ్రామికవేత్తలేం ఖర్మ.. క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందే! దేశం తరఫున పలు టెస్ట్‌మ్యాచ్‌లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్‌ హనుమ విహారి వైకాపా నాయకుల దెబ్బకు.. జీవితంలో ఇంకెప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ తరఫున రంజీమ్యాచ్‌లు ఆడనంటూ తీవ్ర ఆవేదనతో దండం పెట్టి వెళ్లిపోయారు. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌కు ఆ దుస్థితి కల్పించింది.. ఏ ముఖ్యమంత్రో, మంత్రో, వైకాపా అగ్రనేతలో అనుకుంటున్నారా? వారి అండదండలు పుష్కలంగా ఉన్న తిరుపతిలోని ఒక సాధారణ కార్పొరేటర్‌. ఆ నాయకుడి దెబ్బకు హనుమ విహారి వంటి క్రికెటర్‌ ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు, ఇప్పుడు తీవ్ర అవమానభారంతో ఏకంగా జట్టునే వదిలి వెళ్లిపోయారు. వైకాపా నాయకులతో పెట్టుకుంటే ఎంతటి స్టార్‌ ఆటగాళ్లకైనా అదే గతి! మొన్నటికి మొన్న ప్రముఖ క్రికెటర్‌ అంబటి రాయుడికి వైకాపా నేతల చేతిలో చేదు అనుభవం ఎదురైంది. ఆ దెబ్బకు రాయుడు మళ్లీ కోలుకోలేదు. ఇప్పుడు విహారి వంతు!

ఇంతకీ హనుమ విహారి చేసిన తప్పేంటో తెలుసా? ఆంధ్రా రంజీ జట్టులో 17వ సభ్యుడిగా ఉన్న... ఆ వైకాపా కార్పొరేటర్‌ కుమారుణ్ని ఒక కెప్టెన్‌గా మందలించడం. విహారి ఏడేళ్లుగా ఆంధ్రా రంజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో బెంగాల్‌తో ఆంధ్రా జట్టు మొదటి మ్యాచ్‌ ఆడింది. ఆ సందర్భంగా 17వ ఆటగాడిగా ఉన్న కె.ఎన్‌.పృథ్వీరాజ్‌ను ఏ కారణం చేతనో కెప్టెన్‌ విహారి మందలించారు. అంతే పృథ్వీరాజ్‌ తండ్రి నర్సింహాచారికి చిర్రెత్తుకొచ్చింది. ఆంధ్రా క్రికెట్‌ ఆసోసియేషన్‌ (ఏసీఏ) మొత్తం వైకాపా నాయకుల గుప్పిట్లోనే ఉండటంతో వారికి ఫిర్యాదు చేశారు. వారు ఆఘమేఘాల మీద స్పందించారు. మావాడి పుత్రరత్నాన్నే తిడతావా? అంటూ మొదటి మ్యాచ్‌ తర్వాత విహారిని కెప్టెన్సీ నుంచి పీకేసి.. రికీభుయ్‌కు సారథ్యం అప్పగించారు. ఇన్నాళ్లూ అవమాన భారాన్ని పంటిబిగువున భరిస్తూ మ్యాచ్‌లు ఆడిన విహారి... మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో జట్టు ఓడిపోయాక తన మనసులోని ఆవేదనను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా శనివారం బయటపెట్టారు. రాజకీయ జోక్యం వల్ల కెప్టెన్సీ కోల్పోయానని, తీవ్ర అవమానానికి గురయ్యానని ఆయన పెట్టిన పోస్టు... జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం సృష్టించింది.

ఆత్మగౌరవం దెబ్బతిన్నచోట ఉండలేను

‘బెంగాల్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌కు నేనే కెప్టెన్‌ని. ఆ మ్యాచ్‌ సందర్భంగా 17వ ఆటగాణ్ని కోప్పడ్డాను. అతను ఆ విషయం తండ్రికి చెప్పాడు. రాజకీయ నాయకుడైన ఆయన నాపై చర్య తీసుకోవాలని ఏసీఏని కోరారు. ఆ మ్యాచ్‌లో బెంగాల్‌ 410 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా.. మేం పోరాడి గెలిచాం. గత సీజన్‌లో ఫైనల్‌కు చేరిన బెంగాల్‌ను మేం మొదటి మ్యాచ్‌లోనే ఓడించినా నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సిందిగా ఏసీఏ ఆదేశించింది. నా తప్పేమీ లేకపోయినా నన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారు. ఆ క్రికెటర్‌ను నేను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. కానీ ఆంధ్ర రంజీ జట్టుకు ఏడేళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తూ... ఐదు సీజన్లలో జట్టును నాకౌట్‌ దశకు చేర్చిన, దేశం తరపున 16 టెస్ట్‌లు ఆడిన క్రీడాకారుడికంటే జట్టులోని ఒక సభ్యుడే ఎక్కువయ్యారు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో విహారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కెప్టెన్సీ నుంచి తీసేయడాన్ని చాలా ఇబ్బందికరంగా, అవమానకరంగా భావించానని... కానీ ఆటపైనా, జట్టుపైనా ఉన్న గౌరవంతో ఇన్నాళ్లూ కొనసాగానని తెలిపారు.

‘విషాదం ఏంటంటే.. ఏసీఏ తాను చెప్పిందే ఆటగాళ్లు వినాలనుకుంటోంది. తమ వల్లే ఆటగాళ్లు మనుగడ సాగిస్తున్నారనుకుంటోంది. తీవ్ర అవమానానికి గురైనా ఇన్నాళ్లూ బయటకు వ్యక్తం చేయలేదు. నా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లాక.. ఇక ఆంధ్రా జట్టు తరఫున ఆడకూడదని నిర్ణయించుకున్నాను. ఈ జట్టంటే నాకెంతో ప్రేమ. ఒక్కో సీజన్‌ గడిచేకొద్దీ టీం మరింతగా ఎదుగుతోంది. కానీ అలా ఎదగడం ఏసీఏకి ఇష్టం లేదు’ అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మ్యాచ్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి ఏసీఏ బలవంతంగా తొలగించినా వ్యక్తిగత కారణాలతోనే కెప్టెన్సీ నుంచి వైదొలగినట్టు అప్పట్లో పేర్కొన్న విహారి, ఈ సీజన్‌లో ఆంధ్రా జట్టు కథ ముగియడంతో ఇప్పుడు అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ సీజన్‌లో విహారి 13 ఇన్నింగ్స్‌ల్లో 522 పరుగులు చేశారు. జట్టులో రికీభుయ్‌ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడు ఆయనే. ఆంధ్రా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ అడిన అతికొద్ది మంది క్రీడాకారుల్లో విహారి ఒకరు. భారత్‌ తరఫున ఆయన 16 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి, 839 పరుగులు చేశారు. వెస్టిండీస్‌పై సెంచరీ కొట్టారు.

విహారినే కెప్టెన్‌గా కొనసాగించాలంటూ జట్టు సభ్యుల లేఖ

హనుమ విహారిని కెప్టెన్‌గా తొలగించిన తర్వాత.. కె.ఎన్‌.పృథ్వీరాజ్‌ మినహా జట్టులోని మిగతా 15 మంది సభ్యులూ ఏసీఏ పెద్దలకు ఒక లేఖ రాశారు. విహారి తప్పేమీ లేదని, ఆయననే కెప్టెన్‌గా కొనసాగించాలని కోరారు. వారిలో విహారి తర్వాత కెప్టెన్‌గా నియమితుడైన రికీభుయ్‌ కూడా ఉండటం విశేషం. ‘విహారి అభ్యంతరకర పదజాలంతో దూషించినట్టు, దురుసుగా తనపైకి దూసుకొచ్చినట్టు మా సహచర సభ్యుడొకరు ఫిర్యాదు చేశారు. విహారి దురుసుగా దూసుకొచ్చాడన్నది నిజం కాదు. సహచర సభ్యుల నుంచి మెరుగైన ఆటను రాబట్టే క్రమంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో అలాంటి భాషను వాడటం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ దురదృష్టవశాత్తు మా జట్టు సభ్యుడు దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందనడానికి మా 15 మంది ఆటగాళ్లతోపాటు, సహాయ సిబ్బంది కూడా సాక్షులుగా ఉన్నారు.

విహారితో మాకెలాంటి సమస్యలూ లేవు. ఆయన ఎప్పుడూ మా నుంచి ఉత్తమమైన ఆటను రాబట్టేందుకు కృషి చేస్తారు. విహారి నాయకత్వంలో జట్టు సాధించిన విజయాలే దానికి నిదర్శనం. ఈ రంజీ పోటీలు మా కెరీర్‌కు ఎంతో ముఖ్యమైనవి. పైగా బెంగాల్‌పై తొలి మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించాం. మా కెప్టెన్‌గా విహారినే కొనసాగించాలని కోరుతున్నాం’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన ఆటగాడు తప్ప మిగతా వారంతా విహారి పక్షానే నిలిచినా, ఏసీఏ మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయనను కెప్టెన్సీ నుంచి తొలగించడం వైకాపా నాయకుల దాష్టీకానికి పరాకాష్ఠ.

విచారణ విహారి మీదే: ఓవైపు విహారికి జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ, అతడికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండగా.. ఏసీఏ మాత్రం ఈ వ్యవహారంపై బాధితుడైన అతడి మీదే విచారణకు సిద్ధమవడం గమనార్హం. ‘‘విహారి అసభ్య భాష, ప్రవర్తనపై జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది, ఏసీఏ పాలకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై ఏసీఏ పూర్తి స్థాయి విచారణ చేపడుతుంది’’ అని ఏసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. విహారి ఆరోపణలపై ఏసీఏ మీడియా మేనేజర్‌ రాజగోపాల్‌ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. ‘‘ఏసీఏ ఆటగాళ్లందర్నీ ఒకేలా చూస్తుంది. సీనియారిటీ ఆధారంగా ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వదు. బెంగాల్‌తో మ్యాచ్‌ సందర్భంగా జట్టు సభ్యుడు ఒకర్ని విహారి అసభ్య పదజాలంతో దూషించినట్టు మా దృష్టికి వచ్చింది. విహారి జాతీయ క్రికెట్‌ జట్టుకు పరిశీలనలో ఉన్న ఆటగాడు కావడంతో... రంజీ సీజన్‌ మొత్తం ఆయన అందుబాటులో ఉండటం కష్టమవుతోంది. ఆయనకు బదులు మరొకర్ని కెప్టెన్‌గా నియమించాలని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ నుంచి మాకు ఈమెయిల్‌ వచ్చింది. అందుకే ఆయనను కెప్టెన్‌గా తొలగించాం’’ అని ఏసీఏ పేర్కొంది.


వైకాపా నాయకుల కబంధ హస్తాల్లో ఏసీఏ

కేవలం అయిదేళ్ల పాలనలో రాష్ట్రం కొన్ని దశాబ్దాలపాటు కోలుకోలేనంతగా విధ్వంసాన్ని మిగిల్చిన వైకాపా నాయకులు చివరకు ‘జంటిల్‌మెన్‌ గేమ్‌’గా ప్రసిద్ధికెక్కిన క్రికెట్‌నూ వదల్లేదు. ఏసీఏని తమ కబంధ హస్తాల్లో బంధించేశారు. దాన్ని కుటుంబ కంపెనీగా మార్చేశారు. ఏసీఏకు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా.. అల్లుడి అన్న, దిల్లీ మద్యం కేసులో నిందితుడు శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షుడిగా, విశాఖకు చెందిన వస్త్రవ్యాపారి, సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు గోపీనాథ్‌రెడ్డి కార్యదర్శిగా ఉన్నారు. తన వస్త్ర వ్యాపార సంస్థకు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తినే గోపీనాథ్‌రెడ్డి ఏసీఏ కోశాధికారిగా నియమించారు. మొత్తం ఏసీఏని గుప్పిట్లో పెట్టుకుని గోపీనాథ్‌రెడ్డి.. అనేక అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

కోర్టుల్లో పలు కేసులు నడుస్తున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్ర రంజీ జట్టులోనైనా 15 మంది సభ్యులే ఉంటారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రా రంజీ జట్టులోనే 17 మంది ఉండేలా వైకాపా ప్రభుత్వం వచ్చాకే ఏసీఏ మార్పులు తెచ్చింది. వారిలో 15 మందిని మాత్రమే సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుందని, మిగతా ఇద్దర్నీ సెక్రటరీ కోటాలో నియమిస్తారని సమాచారం. విహారిపై ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్‌ అలా సెక్రటరీ కోటాలో జట్టులోకి వచ్చినవాడే. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి సెక్రటరీగా ఉన్న చిత్తూరు జిల్లా బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున.. ఆంధ్రా రంజీ జట్టుకు పృథ్వీరాజ్‌ ఎంపికయ్యాడు. అతని తండ్రి నర్సింహాచారికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వంటి వైకాపా కీలకనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని