8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు.

Updated : 27 Feb 2024 06:57 IST

వైకాపా, తెదేపాల నుంచి చెరో నలుగురు
పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై స్పీకర్‌ తమ్మినేని నిర్ణయం
ఆ స్థానాలు ఖాళీ అయినట్లు ఈసీకి సమాచారం
అనర్హతపై నేడు గెజిట్‌ విడుదల

ఈనాడు, అమరావతి: పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలూ ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి(ఈసీ) వెంటనే సమాచారాన్ని పంపారు. మంగళవారం ఈ మేరకు గెజిట్‌ వెలువడనుంది. వారం పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ రాబోతున్న తరుణంలో వైకాపా రెబల్‌ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి... తెదేపా అభ్యర్థులుగా గెలిచి వైకాపా పంచన చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్‌, వాసుపల్లి గణేష్‌లపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే ప్రథమం.

వైకాపా రెబల్‌ ఎమ్మెల్యేలు నలుగురిపై శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే తెదేపా తరఫున శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత వైకాపా పంచన చేరిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని తెదేపా విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పీకర్‌ జనవరి 29న తొలిసారి ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పిలిచారు. వైకాపా రెబల్‌ ఎమ్మెల్యేలు నలుగురూ స్పీకర్‌ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేస్తూ చీఫ్‌విప్‌ సమర్పించిన ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలను తమకు ఇవ్వాలని, వాటిని పరిశీలించి మళ్లీ వస్తామని స్పీకర్‌కు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్‌ కార్యాలయానికి.. ఎమ్మెల్యేలకూ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. మరోవైపు తెదేపా రెబల్‌ ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్‌ మాత్రమే జనవరి 29న జరిగిన విచారణలో స్పీకర్‌ ముందు హాజరయ్యారు. మిగిలిన ముగ్గురూ స్పీకర్‌ను కలవలేదు. తర్వాత కూడా ఎమ్మెల్యేలకు వ్యక్తిగత విచారణ కోసం స్పీకర్‌ సమయం ఇచ్చినప్పటికీ వారు హాజరు కాలేదు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన స్పీకర్‌ తమ్మినేని ఎనిమిది మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని