భజన నేర్వండి.. గ్రూప్‌-2 గెలవండి

సమయం, సందర్భం, విచక్షణ వంటివేమీ లేకుండా సొంత డబ్బా కొట్టుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌ ప్రభుత్వం చివరకు గ్రూప్‌-2 పరీక్షల్నీ వదల్లేదు.

Published : 28 Feb 2024 03:12 IST

పరీక్ష ప్రశ్నపత్రంలోనూ జగన్‌ భజనే

ఈనాడు, అమరావతి: సమయం, సందర్భం, విచక్షణ వంటివేమీ లేకుండా సొంత డబ్బా కొట్టుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌ ప్రభుత్వం చివరకు గ్రూప్‌-2 పరీక్షల్నీ వదల్లేదు. వైకాపా ప్రభుత్వాన్నీ, ముఖ్యమంత్రి జగన్‌ను విపరీతంగా కీర్తించేందుకు అలవాటుపడ్డ అధికారగణం గ్రూప్‌-2 పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నపత్రాన్నీ జగన్‌ భజనతో నింపేసింది. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షలో పలు ప్రశ్నల్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో ముడిపెట్టి అడిగింది. వైకాపా ప్రభుత్వం పథకాలన్నింటికీ వైఎస్సార్‌, జగన్‌ల పేర్లే పెట్టేసింది కాబట్టి.. ప్రశ్నపత్రంలో పదే పదే వారిద్దరి నామస్మరణ కనిపించడంతో అభ్యర్థులు తలలు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఏళ్ల తరబడి కష్టపడి చదివి పరీక్ష రాసేందుకు వెళ్లింది ఇలా ముఖ్యమంత్రి భజన చేయడానికా.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 అట్టర్‌ఫ్లాప్‌ పథకానికీ ప్రచారం

ఎన్నికల ముందు వైకాపాకు రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ ప్రభుత్వం రూ. 200 కోట్లకుపైగా ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు పెట్టింది. ఆ పోటీల వల్ల వీసమెత్తు ప్రయోజనం లేదు. అక్కడితో ఆగకుండా.. గ్రూప్‌-2 పరీక్షల్లోనూ ‘ఆడుదాం ఆంధ్రా’తో ముడిపెట్టి ప్రశ్నలు అడిగింది. చివరకు ప్రశ్నల్లో ఇచ్చే ఉదాహరణలకు కూడా వైయస్‌ఆర్‌ కడప.. వంటి పేర్లనే ఎంచుకోవడం అధికారుల ప్రభుభక్తికి అద్దంపట్టింది.

మితిమీరిన ప్రచార పిచ్చి..

జగన్‌ ప్రభుత్వ మితిమీరిన ప్రచార పిచ్చికి,  గ్రూప్‌-2 జనరల్‌ స్టడీస్‌లో అడిగిన 108వ ప్రశ్నే నిదర్శనం. ‘ఈ కిందివాటిలో తప్పుగా జతచేసిన వాటిని గుర్తించండి’ అంటూ.. వివిధ ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల వివరాల్ని ఇచ్చారు. జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న జీవక్రాంతి పథకం, వైఎస్సార్‌ నవోదయం స్కీంలు, ఆ పథకాల లబ్ధిదారులు, వారికి ఇస్తున్న మొత్తాన్ని ప్రస్తావించారు. ఇందులో పథకానికి, లబ్ధిదారులకు పొంతన లేకుండా ఇచ్చిన అంశాల్ని గ్రూప్‌-2 పరీక్ష రాస్తున్న అభ్యర్థులు గుర్తిస్తే మార్కులు ఇస్తారన్న మాట!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు