Visakhapatnam: రుషికొండ ప్రాజెక్టు.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు!

రుషికొండ రిసార్ట్‌ ఆధునికీకరణ ప్రాజెక్టును గురువారం ప్రారంభించేందుకు జగన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నా, పూర్తి చేయాల్సిన పనులు ఇంకా మిగిలినా, ప్రారంభ ముహూర్తం ఖరారుచేసింది.

Updated : 28 Feb 2024 07:42 IST

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగా అందుబాటులోకి తెచ్చేలా ఆరాటం

ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: రుషికొండ రిసార్ట్‌ ఆధునికీకరణ ప్రాజెక్టును గురువారం ప్రారంభించేందుకు జగన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నా, పూర్తి చేయాల్సిన పనులు ఇంకా మిగిలినా, ప్రారంభ ముహూర్తం ఖరారుచేసింది. విశాఖలో రుషికొండపై రూ.450 కోట్లతో నిర్మిస్తున్న భవనాన్ని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం కోసం వినియోగించనున్నారని ప్రచారం జరుగుతోంది.

హైకోర్టు తుదితీర్పు వెలువడక ముందే..

సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై నిర్మాణాలు చేశారని హైకోర్టులో పలువురు వేసిన కేసులపై తుది తీర్పు వెలువడక ముందే ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణాలకు రూ.240 కోట్లు ఖర్చుచేశారు. రహదారులు, నీటి సరఫరాల పనులను రూ.46 కోట్లతో చేపట్టారు. రూ.8.58 కోట్లతో ప్రహరీ, రూ.4.20 కోట్లతో గార్డెనింగ్‌ పనులు చేశారు. ఏపీ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ద్వారా పదెకరాల్లో సాఫ్ట్‌ ల్యాండ్‌స్కేపింగ్‌, హార్డ్‌స్కేపింగ్‌ కోసం రూ.4 కోట్లు ఖర్చుచేశారు. రుషికొండ బీచ్‌లోని హెలిప్యాడ్‌ నుంచి నేరుగా భవనం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఫర్నిచర్‌, ఇతరత్రా పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రారంభించి ఏం చేయబోతున్నారు?

రుషికొండ ప్రాజెక్టును ప్రారంభించాక ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎలాంటి అవసరాలకు వినియోగిస్తుందనేది చర్చనీయాంశమవుతోంది. ఒక ప్రఖ్యాత హోటల్‌ గ్రూపునకు లీజుకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని గతంలో ప్రచారం జరిగింది. అదే చేస్తారా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై అధికారులు కూడా నోరు మెదపడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని