ఈ అరాచకం అనంతం!

ఏళ్లు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామందికి పునరావాసం, పరిహారం చెల్లించకుండా జగన్‌ ప్రభుత్వం వారి బతుకులతో చెలగాటమాడుతోంది.

Updated : 28 Feb 2024 06:52 IST

ఓడిస్తారనే భయంతో ఓట్లను మార్చేశారు
పోలవరం నిర్వాసితుల ఓట్లు అడ్డగోలుగా బదిలీ
నేరపూరిత కుట్రకు తెరలేపిన అధికార పార్టీ ‘అరాచక శక్తి’
రంపచోడవరం నుంచి జగ్గంపేట నియోజకవర్గంలోకి 2,400 ఓట్లు
పాత్రధారులుగా మారిన అధికారులు
పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా ఎలా మార్చేస్తారంటూ బాధితుల ప్రశ్న రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని ‘ఈనాడు-ఈటీవీ’తో నిర్వాసితుల ఆవేదన
ఈనాడు-రాజమహేంద్రవరం, అమరావతి
న్యూస్‌టుడే-దేవీపట్నం, గోకవరం

ఏళ్లు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలామందికి పునరావాసం, పరిహారం చెల్లించకుండా జగన్‌ ప్రభుత్వం వారి బతుకులతో చెలగాటమాడుతోంది. రాష్ట్రం కోసం ఇళ్లూ, వాకిళ్లు, ఆస్తులు, భూములు త్యాగం చేసినా వారిని ఆదుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆ నిర్వాసితులంతా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి తమ ఆగ్రహాన్ని చూపిస్తారని భయపడ్డ అధికార పార్టీ కీలక నాయకుడు నేరపూరిత కుట్రకు తెరలేపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం, తొయ్యేరు గ్రామాలకు చెందిన 2,400 మందికి పైగా గిరిజనేతర నిర్వాసితుల ఓట్లను కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్పించేశారు. ఓటర్లకు తెలియకుండా, వారికి కనీస సమాచారం లేకుండా ఈ అక్రమానికి తెగబడ్డారు. రంపచోడవరంలో ‘అరాచక శక్తి’గా వ్యవహరిస్తున్న వైకాపా ప్రజాప్రతినిధి ఈ దందాకు సూత్రధారి కాగా ఆయన ఆదేశాలకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు పాత్రధారులయ్యారు. వేలమంది ఓట్లు ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తుంటే క్షేత్రస్థాయి అధికారులు తమకేమీ తెలీదంటూ తప్పించుకుంటున్నారు.

ఆ రెండు గ్రామాల్లోనే అత్యధికంగా..

దేవీపట్నం మండలం పరిధిలో పోలవరం ముంపు గ్రామాలైన కొండమొదలు నుంచి గంగంపాలెం వరకూ మొత్తం 18 ఊళ్లలోని గిరిజనేతరులైన 1,067 కుటుంబాలకు గోకవరం మండలం (జగ్గంపేట నియోజకవర్గం) కృష్ణునిపాలెంలో పునరావాసం కల్పించారు. వీరిలో చాలామందికి ఇప్పటికీ పరిహారం అందలేదు. వారిలో 17 గ్రామాలకు చెందిన ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గ జాబితాలోనే కొనసాగిస్తున్న అధికారులు.. తొయ్యేరు గ్రామ ఓటర్లను మాత్రం జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరం మండలంలోకి మార్చేశారు. దేవీపట్నానికి చెందిన నిర్వాసితులకు ఇప్పటివరకూ ఎక్కడా పునరావాసమే కల్పించలేదు. దీంతో వారంతా రెండేళ్లుగా వివిధ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. వీరందరి ఓట్లు సైతం.. వారికెలాంటి సంబంధమూ లేని కృష్ణునిపాలెం జాబితాలో చేర్చేశారు. దేవీపట్నంలో గతంలో వారు నివసించిన ఇంటి నంబర్లనే చిరునామాల్లో పేర్కొని జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్చేశారు. ఈ ఓట్ల బదలాయింపు వెనక రాజకీయ కుట్ర ఉందని బాధితులు చెబుతున్నారు. దేవీపట్నం మండలంలో అత్యధిక ఓట్లు దేవీపట్నం, తొయ్యేరులలోనే ఉన్నాయి. ఆ ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో లేకుండా చేసేస్తే తమకు రాజకీయంగా ఇబ్బంది ఉండదనే దురుద్దేశంతోనే అధికార పార్టీ ‘అరాచక శక్తి’ ఈ కుట్రకు పాల్పడ్డారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలియకుండా ఓట్లు మార్చేయడం మోసం కాదా?

నిర్వాసితులకు పునరావాసం, పరిహారం (ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీల్లో) పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే వారు ఆ ప్రాంతానికిచెందినవారనేననినిరూపించే ఆధారాలు ఉండాలి. అన్నిరకాల ఆధారాలున్నా సరే ఇప్పటికే కొంతమందిని ప్యాకేజీకి అనర్హులుగా తేల్చేశారు. ఇలాంటి నేపథ్యంలో పునరావాసం, పరిహారం ఇంకా చెల్లించకుండానే.. ఓట్లను వేరే జిల్లా పరిధిలోని నియోజకవర్గంలోకి మార్చేయడం పట్ల వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారంలో చొరవ చూపని అధికారులు, నాయకులు తమకు తెలియకుండా ఓట్లు మార్చేయడం మోసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈనాడు-ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’తో వారు తమ ఆవేదనను పంచుకున్నారు.

ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవట్లేదు?

  • తొయ్యేరు గ్రామస్థులు 2020 నుంచి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కృష్ణునిపాలెం పునరావాస కాలనీలో నివసిస్తున్నందునే వారి ఓట్లు అక్కడికి మార్చామని, పోలవరం పరిహారానికి ఓట్ల మార్పిడికి సంబంధం లేదని రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌, ఆ నియోజకవర్గ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (ఈఆర్‌వో) ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ ‘ఈనాడు’తో చెప్పారు. సరే ఆ ప్రాతిపదికతోనే ఓట్లు బదలాయించారనుకుంటే.. తొయ్యేరుతో పాటు మరో 17 గ్రామాలకు చెందిన కొందరు నిర్వాసితులు సైతం కృష్ణునిపాలెం పునరావాస కాలనీలోనే నివసిస్తున్నారు. మరి వారి ఓట్లు మాత్రం రంపచోడవరం నియోజకవర్గంలో ఎలా కొనసాగిస్తున్నారు? వాటిని ఎందుకు జగ్గంపేట నియోజకవర్గానికి మార్చలేదు? ఈ ప్రశ్న అడిగితే.. ఈఆర్‌వో నుంచి అసలు సమాధానమే ఇవ్వలేదు.

  • దేవీపట్నం గ్రామ నిర్వాసితులకు ఇప్పటివరకూ ఇంకెక్కడా పునరావాసం కల్పించలేదు. వారు వివిధ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. అలాంటప్పుడు వారు కృష్ణునిపాలెంలో నివసిస్తున్నట్లు ఓటర్ల జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నిస్తే ఈఆర్‌వో ప్రశాంత్‌కుమార్‌ సమాధానమివ్వలేదు. దేవీపట్నంలో వారు నివసించిన ఇళ్లకు సంబంధించిన డోర్‌ నంబర్లను చిరునామాలుగా పేర్కొని.. కృష్ణునిపాలెంలో ఓట్లు చేర్చటం అక్రమం కాదా? అని అడిగినా స్పందించలేదు.
  • నిర్వాసితుల ఓట్లతో ఇలా బంతాట ఆడుతూ.. అక్రమానికి తెగబడితే.. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే కలెక్టరు ఎందుకు స్పందించట్లేదు? నియోజకవర్గ ఈఆర్‌వోగా ఉన్న సబ్‌ కలెక్టర్‌ ఎందుకు బాధ్యత వహించట్లేదు? కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు విచారణ జరపట్లేదు? ఇవన్నీ ప్రశ్నలే!

పాత డోర్‌ నంబర్లతో..

కృష్ణునిపాలెం పునరావాస కాలనీలో ఇప్పటివరకూ డోర్‌ నంబర్లే ఖరారు చేయలేదు. కానీ తొయ్యేరులో గతంలో మేం నివసించిన ఇళ్లకు సంబంధించిన డోర్‌ నంబర్లు వేసేసి మా ఓట్లు మాకు తెలియకుండా జగ్గంపేట నియోజకవర్గానికి బదిలీ చేసేశారు. మా గ్రామంలో 30 మంది నిర్వాసితులకు యువ ప్యాకేజీ, 100 మందికి ఇళ్లు రావాల్సి ఉంది. 70 మందికి ఇంకా పరిహారం అందలేదు. పునరావాస కాలనీల్లోని సమస్యలు గురించి పట్టించుకోని అధికారులు మా ఓట్లు మాత్రం మార్చేశారు.

శివరామకృష్ణనాయుడు, తొయ్యేరు


రాజకీయ కుట్రతోనే మా ఓట్లు మార్చేశారు

-బుర్రి ఆనందరావు, దేవీపట్నం

దేవీపట్నం గ్రామానికి చెందిన 110 నిర్వాసితుల కుటుంబాలకు ఇప్పటికీ ఇళ్లు ఇవ్వలేదు. రాజకీయ కుట్రలో భాగంగా మా అందరి ఓట్లను రంపచోడవరం నియోజకవర్గం నుంచి జగ్గంపేట నియోజకవర్గానికి మార్చేశారు. మాకు పునరావాసం, పరిహారం ప్యాకేజీలు దక్కనీయకుండా చేయాలనే దురుద్దేశంతో ఇలా చేశారు.


కృష్ణునిపాలెంలో ఇల్లు లేకున్నా ఓటిచ్చారు..

-గేదెల చినసుబ్బారావు, దేవీపట్నం

పోలవరం నిర్వాసితుడినైన నాకు ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. మా సోదరుడికి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అందలేదు. దేవీపట్నంలో 1-140 డోర్‌ నంబర్‌తో మా ఇల్లు ఉంది. నాకు కృష్ణునిపాలెంలో అసలు ఇల్లే లేకపోయినా సరే మా పాత డోర్‌ నంబర్‌తో అక్కడికి నా ఓటు మాత్రం బదిలీ చేసేశారు. నేను రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో అద్దెకు ఉంటున్నాను. మా ఇళ్ల నిర్మాణాలపై దృష్టిపెట్టని అధికారులు.. ఎవరి ప్రొద్బలంతో మా ఓట్లు మార్చరో తేలాలి.


ఓట్ల బదిలీ చేయటం నేరం

- కుంజం రాజామణి, సర్పంచి, దేవీపట్నం

మా పంచాయతీ పరిధిలోని తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల్లోని నిర్వాసితుల ఓట్లను మరో జిల్లాలోని నియోజకవర్గంలోకి మార్చడం అన్యాయం. దేవీపట్నం నిర్వాసితులకు ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు చేయకుండా, ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా కృష్ణునిపాలెంలో ఉన్నట్లు ఓట్లు ఎలా బదలాయిస్తారు? అపరిష్కృతంగా ఉన్న పునరావాస సమస్యలు పరిష్కరించకుండా గ్రామసభలు పెట్టకుండా ఓట్లు బదిలీ చేయడం నేరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని