జగనన్న కాలనీలో జోరుగా స్థిరాస్తి వ్యాపారం

పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు జగనన్న కాలనీల పేరుతో అందజేసిన ఇళ్ల స్థలాలను అధికార వైకాపా నాయకులు, కార్యకర్తలు తక్కువ ధరకే సొంతం చేసుకుంటున్నారు.

Published : 28 Feb 2024 03:50 IST

బినామీ పేర్లతో వైకాపా నాయకులకు ప్లాట్లు
దుకాణాలు నిర్మించి అద్దెకు...

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు జగనన్న కాలనీల పేరుతో అందజేసిన ఇళ్ల స్థలాలను అధికార వైకాపా నాయకులు, కార్యకర్తలు తక్కువ ధరకే సొంతం చేసుకుంటున్నారు. కొందరు బినామీ పేర్లతో 2, 3 ప్లాట్లను కొనుగోలు చేయగా.. మరికొందరు తమ అనుయాయులకు, బంధువులకు ఇప్పించుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలో టిడ్కో సముదాయం, రాజానగర్‌, నల్లబండవీధి, మోడంపల్లె ప్రాంతాల్లో జగనన్న లేఅవుట్లు వేసి 1,461 మంది లబ్ధిదారులకు నివేశ స్థలాల పట్టాలు అందజేశారు. ఇందులోని టిడ్కో సముదాయ ప్రాంతం, రాజానగర్‌లలోని జగనన్న కాలనీల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా లబ్థిదారులు దళారుల మాయమాటలు నమ్మి ప్లాట్లను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు విక్రయించేశారు. గిద్దలూరు-నంద్యాల రహదారిలోని టిడ్కో సముదాయం వద్ద ఉన్న జగనన్న కాలనీలో ప్రస్తుతం బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు ఉన్న ప్లాట్లు రూ.10 లక్షల వరకు పలుకుతున్నాయి. దీంతో అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టిన వారు వడ్డీలు చెల్లించలేక వాటిని అమ్మేసుకున్నారు. కొందరు పెద్దలు రాజానగర్‌ జగనన్న కాలనీలో ఇంటి స్థలాన్ని రూ.3 లక్షలకు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మిస్తున్నారు. వాటిని రూ.10 లక్షల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

టిడ్కో సముదాయంలోని జగనన్న కాలనీలో ఓ వైకాపా నాయకుడి కుమార్తెకు నివేశ స్థలం ఇవ్వగా అందులో ఆమె దుకాణాలను నిర్మించి రూ.2 వేల వంతున అద్దె తీసుకుంటున్నారు. అర్బన్‌ కాలనీలో నివాసముండే ఓ వైకాపా కార్యకర్త ఏకంగా 3 ప్లాట్లకు పైగా కొనుగోలు చేశాడు. జగనన్న కాలనీలో ప్రధాన రహదారి వెంట ఉండే ఈ ప్లాట్‌లో దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చాడు. మరి కొంతమంది వైకాపా నాయకులు బినామీ పేర్లతో ప్లాట్లు పొంది తమ అధీనంలో ఉంచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని