తీపి మాటలు చెప్పి.. పీల్చి పిప్పి!

ప్రభుత్వం ఏదైనా.. రైతుల ఆదాయం పెంపుపై దృష్టి పెడుతుంది. సాగుకు ప్రోత్సాహకాలిచ్చి ఆదుకుంటుంది.

Published : 28 Feb 2024 03:56 IST

చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టిన జగన్‌
చెరకు రైతులను ఆదుకోని వైకాపా సర్కారు
రూ.2 వేల కోట్ల ఆస్తుల ధారాదత్తానికి సిద్ధం
రూ.400 కోట్లు కేటాయిస్తే రైతులు, కార్మికులకు మేలు
ఐదేళ్లలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం
ఈనాడు - అమరావతి

ప్రభుత్వం ఏదైనా.. రైతుల ఆదాయం పెంపుపై దృష్టి పెడుతుంది. సాగుకు ప్రోత్సాహకాలిచ్చి ఆదుకుంటుంది. అయితే జగన్‌ సర్కారు తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆయన సీఎం అయ్యాక.. రాష్ట్రంలోని చెరకు రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయింది. చెరకు సాగు ప్రశ్నార్థకమైంది. 2018-19వ సంవత్సరంలో 2.55 లక్షల ఎకరాల్లో చెరకు సాగు అయితే.. 2023-24వ సంవత్సరంలో సాగు 67 వేల ఎకరాలు మాత్రమే. గత ప్రభుత్వ హయాంతో పోల్చితే ఐదేళ్ల వైకాపా పాలనా కాలంలో 74% సాగు విస్తీర్ణం తగ్గింది. అయినా.. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ బాకా ఊదుతున్న సీఎం జగన్‌ను ఏం అనాలి?


రూ.400 కోట్లు ఇస్తే.. సహకార రంగ పరిధిలోని చక్కెర కర్మాగారాలను పని చేయించొచ్చు. రైతులకు ఆదాయమూ  కల్పించవచ్చు. అయితే దేశంలోనే ధనిక సీఎం అయిన జగన్‌కు ఇవేమీ పట్టవు కదా?! ఆదాయం వచ్చే మార్గాలే ఆయనకు ముఖ్యం కదా? అందుకే ఏకంగా రైతుల భవిష్యత్తునే అమ్మకానికి పెట్టారు. యంత్రాలు, భూములతో సహా మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ఆరు చక్కెర కర్మాగారాలను.. అప్పనంగా ప్రైవేటుకు  కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. జగన్‌ దృష్టిలో రైతును ఆదుకోవడమంటే..   అమ్మేయడమేనేమో?


‘‘ఒక్క అవకాశం ఇవ్వండి.. రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తా. రైతుల బతుకులు మారుస్తా’’ అంటూ ప్రతిపక్ష నేతగా జగన్‌ ఎన్నికలకు ముందు ఎన్నెన్నో తీపి కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారి భవిష్యత్తును నుజ్జునుజ్జు చేస్తున్నారు. తెరిపిస్తామన్న ఆరు కర్మాగారాల్లో ఒక్కటీ తెరవలేదు. పైగా.. వాటిని ఏకంగా అమ్మకానికి పెట్టింది ఘనత వహించిన జగన్‌ సర్కారు. అదీ చాలదన్నట్లు.. ఉత్తరాంధ్రలో నాలుగు సహకార చక్కెర పరిశ్రమలకు తాళం వేసింది. మరో కర్మాగారం పరిస్థితి నేడో, రేపో అన్నట్లుగా తయారైంది. మరోవైపు వైకాపా పాలనలో చెరకు సాగు గణనీయంగా తగ్గింది. వెరసి.. ఐదేళ్ల పాలనలో వైకాపా చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టింది! రాష్ట్రంలో చెరకు సాగుకు ఉరి వేసింది. రైతులను పీల్చిపిప్పి చేసింది.

పనిచేస్తోంది ఒక్కటే..

సహకార రంగ పరిధిలో మొత్తం 10 చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. వాటిలో తొమ్మిది మూతపడ్డాయి. ప్రస్తుతం గోవాడ పరిశ్రమ ఒక్కటే పనిచేస్తోంది. మూతపడిన వాటిలో ఆరు పరిశ్రమలను పునరుద్ధరించి, రైతులను ఆదుకుంటామని చిత్తూరు, కడప, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నిర్వహించిన ప్రజా సంకల్ప  యాత్రల్లో, ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌    ప్రగల్భాలు పలికారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించారు.


 రూ.400 కోట్లతో పూర్వవైభవం

మూతపడిన ఆరు పరిశ్రమలను పునరుద్ధరించడానికి ఒక్కో చక్కెర కర్మాగారానికి రూ.60 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు అవసరం. ఈ లెక్కన రూ.400 కోట్ల వరకు ఖర్చు పెడితే ఈ ఆరు కర్మాగారాలకు పూర్వవైభవం వస్తుందనేది నిపుణుల అభిప్రాయం. వీటివల్ల రైతులకు ఆదాయం రావడంతోపాటు కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. అయితే, ‘రైతు భరోసా’ ఇస్తున్నాం కదా? చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటిద్వారా రైతులు, కార్మికులకు లబ్ధి చేకూర్చడం ఎందుకు అనుకుందో ఏమో.. లిక్విడేషన్‌కు తెరతీసింది. కార్మికులు, అన్నదాతల ప్రయోజనాలకు గండికొడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న...     కర్మాగారాలను తక్కువ ధరలకే ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడానికి సిద్ధపడింది. 9,100 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ ఆరు కర్మాగారాల్లో 1,600 మందికి పైగా కార్మికులు ఉన్నారు. సుమారు 65 వేల మందికి పైగా రైతులు చెరకు పండించి వీటికి సరఫరా చేస్తున్నారు.


అమ్మకాలపై అన్నదాతల ఆగ్రహం

రు చక్కెర పరిశ్రమలకు జాతీయ రహదారుల పక్కనే సుమారు 720 ఎకరాల భూములు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉంటుంది. వాటిలోని యంత్రాలు, ఇతర సామగ్రిని కలిపితే ఆరు కర్మాగారాల మొత్తం ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకు పైగానే. వీటికి ఉన్న అప్పులు రూ.550 కోట్లకు మించదు. అయితే ప్రభుత్వం వీటికి లిక్విడేషన్‌ ప్రక్రియ చేపట్టడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చక్కెర కర్మాగారాల ఆస్తులను అమ్మితే సహించేది లేదంటూ.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారాలను పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు విక్రయించడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని సర్కారును ప్రశ్నిస్తున్నారు.


ఉత్తరాంధ్ర రైతుల నడ్డి విరిచేలా?

న్నికల సమయంలో ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా రైతులకు జగన్‌ ఎన్నో హామీలు ఇచ్చారు. వైకాపా పాలనలోనే చెరకు రైతులకు న్యాయం జరుగుతుందంటూ నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచారు జగన్‌. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక.. ఒక్క ఉత్తరాంధ్ర  జిల్లాల్లోనే నాలుగు పరిశ్రమలకు విరామం ప్రకటించారు. 2019-20వ సంవత్సరంలో అనకాపల్లి, విజయనగరం జిల్లా విజయరామ గజపతి కర్మాగారాలను, 2021-22లో ఏటికొప్పాక, పాయకరావుపేటలోని తాండవ పరిశ్రమలను మూసివేయించారు. ప్రస్తుతం చోడవరం(గోవాడ) చక్కెర కర్మాగారంలోనే ఉత్పత్తి జరుగుతోంది. దీంట్లోనూ గతంతో పోల్చితే క్రషింగ్‌ సామర్థ్యం భారీగా తగ్గిపోయింది. 2018-19వ సంవత్సరంలో సుమారు 5 లక్షల టన్నుల క్రషింగ్‌ జరిగితే. అది ఇప్పుడు 2 లక్షల టన్నులకు పడిపోయింది.


ప్రోత్సాహం కరవు.. అడిగితే లాఠీల ప్రయోగం

చెరకు రైతులను ఆదుకుంటామన్న జగన్‌.. కనీసం సాగుకు ప్రోత్సాహం కూడా అందించలేదు. బకాయిలను చెల్లించాలని కోరినందుకు ఉత్తరాంధ్రలో పోలీసులు అన్నదాతలపై లాఠీలు ప్రయోగించి వారి నడుంవిరిచారు. ఇలాంటి ప్రతికూల పరిణామాల కారణంగా చెరకు రైతులు క్రమంగా సాగు నుంచి వైదొలగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఐదేళ్ల కిందట 88 వేల ఎకరాల్లో చెరకు సాగు అయింది. ఈ ఏడాది 22 వేల ఎకరాలకే పరిమితమైంది. చెరకు సాగులో రెండో స్థానంలో ఉండే చిత్తూరు జిల్లాలోనూ 56 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు తగ్గింది. విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ ఐదేళ్ల క్రితంతో పోల్చితే ఈ ఏడాది సగానికిపైగా సాగు విస్తీర్ణం తగ్గింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని