Anantapur: వాచీలు.. కుక్కర్లు.. చీరలు.. ఓటర్లకు వైకాపా నేతల ఎర!

ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైకాపా పాలకులు భయపడుతున్నారా..? అంటే.. వారి చేష్టలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

Published : 28 Feb 2024 08:29 IST

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: న్యూస్‌టుడే, అమరావతి, సీతానగరం: ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైకాపా పాలకులు భయపడుతున్నారా..? అంటే.. వారి చేష్టలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కొన్ని రోజులుగా వైకాపాకు చెందిన చిన్న, పెద్ద నేతలు చేతిలో చీర, కుక్కర్లు, వాచీలాంటి ఏదో ఓ ఉపకరణంతో గ్రామాలపై పడుతున్నారు. రాత్రిళ్లు ఇంటింటికీ తలుపుకొట్టి మరీ తాయిలాలు పంచుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అనుచరులు, వైకాపా నాయకులు చీకటి పడగానే ఆయా గ్రామాల్లో వాలంటీర్లను వెంటేసుకొని కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సతీమణి వాలంటీర్లతో సమావేశమై సూచనలిచ్చారు.

కుక్కర్‌ బాక్స్‌పై ‘ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సీఎం జగన్‌, నరసరావుపేట వైకాపా ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌’ అనే స్టిక్కరు వేసి మరీ ఓటేయాల్సిన గుర్తును గుర్తుచేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఈ నెల 3న సీతానగరం మండలం పణుకుపేటలో మహిళకు చీర, రూ.500 ఇచ్చారు. గ్రామస్థాయి నాయకులు అప్పట్నుంచి రోజూ కొన్ని గ్రామాలు ఎంచుకొని పంపకాలు చేస్తున్నారు. మంగళవారం తామరకండిలో చీరలు, నగదు ఇచ్చి ఫొటోలు దిగారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో కొందరికే నగదు బహుమతులు అందాయని మిగిలిన వారికి వాచీలు అందజేశారు. వీటిని పంచాయతీ కార్యాలయాల్లోనే వైకాపా సర్పంచులు బాహాటంగా అందజేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని