‘శవాల మీద నడిచి వెళ్లి భూమి స్వాధీనం చేసుకుంటా’

ఓ పేద కుటుంబానికి చెందిన భూమిపై వైకాపా నాయకుడి కన్ను పడింది. అధికార జులుంతో తమ భూమిని లాక్కుంటే ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో మార్గం లేదని బాధితులు వాపోయారు.

Published : 28 Feb 2024 04:28 IST

కృష్ణా జిల్లాలో పేద కుటుంబానికి వైకాపా నాయకుడి బెదిరింపులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ఓ పేద కుటుంబానికి చెందిన భూమిపై వైకాపా నాయకుడి కన్ను పడింది. అధికార జులుంతో తమ భూమిని లాక్కుంటే ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో మార్గం లేదని బాధితులు వాపోయారు. అయినా వెనక్కి తగ్గని సదరు నేత రెవెన్యూ వర్గాల సహకారంతో బరితెగించాడు. ఎంత మంది చచ్చినా వారి శవాల మీద నడిచి వెళ్లి భూమిని స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామానికి చెందిన శ్రీకాకుళపు బేబి సరోజినికి సర్వే నంబరు 160లో పెద్దల ద్వారా సంక్రమించిన 13 సెంట్ల భూమి ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక అదే సర్వే నెంబర్‌ సమీపంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఆ స్థలాన్ని కాజేయాలని స్థానిక అధికార పార్టీ నాయకుడు సరోజిని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడు. అది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ సిబ్బంది సహకారంతో హెచ్చరికలు జారీ చేయిస్తున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ రవికుమార్‌ స్పందిస్తూ.. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ భూమి ఏడబ్ల్యూడీగా (అనాధీనం) ఉంది. దీనికి సంబంధించి వారు ఏమైనా ఆధారాలు చూపిస్తే విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని