‘ప్రవాసీ’.. వైకాపా పాలనలో పరదేశీ!

ఎడారిలోని ఇసుక తిన్నెల్లో కాసులు పండించుకోవాలని పొరుగు దేశానికి వెళ్లిన వలసజీవి సీఎం జగన్‌ చేతిలో వాడిపోయాడు.

Updated : 28 Feb 2024 08:51 IST

ప్రవాసాంధ్రుల భరోసా పట్టని జగన్‌
బీమా ప్రీమియం చెల్లింపునకు ససేమిరా
20 లక్షల మంది వలస జీవులపై ప్రభావం
వారి వాటా భరిస్తామంటూ... ఎన్నికల ముందు కొత్త నాటకం
ఈనాడు, అమరావతి

ఎడారిలోని ఇసుక తిన్నెల్లో కాసులు పండించుకోవాలని పొరుగు దేశానికి వెళ్లిన వలసజీవి సీఎం జగన్‌ చేతిలో వాడిపోయాడు. కొలువులు పట్టాలని ఉన్నత చదువుల కోసం విదేశాల బాటపట్టిన వారు జగన్‌ ఆడిన ఆటలో ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందు ‘బీమా’ అని ధీమా ఇచ్చిన జగన్‌.. గెలవగానే గేలి చేశారు.. తమ వాటా బీమా సొమ్ము చెల్లించకుండా తొండిచేశారు!   ప్రవాసాంధ్ర బీమా పథకానికి పాతరేశారు..  వలసజీవి బతుక్కు ‘భరోసా’ లేకుండా చేశారు!!

పాధి కరవై పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వలసపోయిన పేద ప్రజలు, జీవితంలో స్థిరపడాలన్న ఆశయంతో ఉన్నత చదువులు, ఉద్యోగాల వేటలో విదేశాలకు వెళ్లిన వారి సంక్షేమం కోసం గత తెదేపా ప్రభుత్వం ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద ప్రవాసాంధ్రులు చెల్లించే ప్రీమియంలో సగం వరకు ప్రభుత్వమే భరించేది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ప్రీమియం చెల్లింపు నుంచి తప్పుకొంది. ఆ మొత్తాన్ని దరఖాస్తుదారులే (ప్రవాసాంధ్రులు) భరించాలని స్పష్టం చేసింది. తెదేపా ప్రవేశపెట్టిన ఈ పథకం ఉనికే లేకుండా చేయాలని ప్రయత్నించింది. వారి ద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏముందనుకుందో.. ఇక్కడ ఉండకుండా ఓట్లు వేయని వారి గురించి పట్టించుకోవడం శుద్ధదండగ అనుకుందో తెలియదు గానీ.. ప్రవాసాంధ్రుల సంక్షేమాన్నే జగన్‌ సర్కారు పక్కన పెట్టేసింది.


ప్రయోజనాలు ఇలా..

  • వైకాపా హయాంలో ఈ పథకం కింద కార్మికులు, ఉద్యోగులు రూ.550, విద్యార్థులు రూ.180 ప్రీమియం చెల్లించాలి.
  • ప్రీమియం చెల్లించిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందిన రూ.10 లక్షల పరిహారం ఇస్తారు.
  • ప్రమాదం వల్ల అస్వస్థతకు గురైతే ఆసుపత్రి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లిస్తారు
  • అస్వస్థత కారణంగా పని, ఉద్యోగం చేయలేని, చదువు  కొనసాగించలేని వారు  స్వదేశానికి వచ్చేందుకు సాధారణ విమానఛార్జీ ఇస్తారు.
  • పని, ఉద్యోగ సమయంలో  కంపెనీలతో న్యాయపరమైన సమస్యలు తలెత్తితే.. పరిష్కరించుకునేందుకు రూ.45 వేలు అందజేస్తారు.
  • గర్భిణులకు ప్రసూతి ఖర్చుల కింద సాధారణమైతే రూ.35 వేలు, సిజేరియన్‌ అయితే రూ.50 వేలు ఇస్తారు.
  • ఒకసారి ప్రీమియం చెల్లించి పేరును నమోదు చేసుకుంటే ఉద్యోగులకు మూడేళ్లు, విద్యార్థులకు ఏడాదిపాటు ఈ పథకం వర్తిస్తుంది.

నాలుగేళ్లలో 33,596 మందికే..

ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన ఏడాది వ్యవధిలోనే తెదేపా ప్రభుత్వం 16,713 మంది ప్రవాసాంధ్రులను నమోదు చేయించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. గత నాలుగున్నరేళ్లలో కేవలం 33,596 మందినే ఈ పథకం కింద చేర్పించింది. గత తెదేపా ప్రభుత్వం ఒక్క ఏడాదిలో నమోదు చేయించిన సంఖ్య ప్రకారమైనా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం 83 వేల ప్రవాసాంధ్రులనైనా ‘భరోసా’ కింద చేర్పించాల్సి ఉండేది.


అధికారంలోకి వచ్చీరాగానే..

త తెదేపా ప్రభుత్వం 2018 మార్చిలో ప్రవేశపెట్టిన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం కింద కార్మికులు, ఉద్యోగులు రూ.442, విద్యార్థులు రూ.177ను ప్రీమియంగా చెల్లించాల్సి ఉండేది. అందులో కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ప్రీమియం రూ.292.50(జీఎస్టీతో కలిపి), విద్యార్థుల ప్రీమియం రూ.99(జీఎస్టీతో సహా) రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. మిగిలిన మొత్తాన్ని కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు చెల్లించేలా పథకాన్ని రూపొందించింది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే తన వాటాను నిర్దాక్షిణ్యంగా ఎత్తేసింది. అయితే, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్త నాటకానికి తెరతీసింది. కార్మికులు, ఉద్యోగుల ప్రీమియంలో సగం వాటాను, విద్యార్థుల పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సన్నాయి నొక్కులు నొక్కుతోంది.


ఎక్కువ వలసవెళ్లే వారిలో రెండో రాష్ట్రం

రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు దాదాపు 20 లక్షల మంది ఉంటారు. యూఏఈ, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌, సౌదీ, బహ్రెయిన్‌ తదితర గల్ఫ్‌ దేశాల్లో 8 లక్షల వరకు, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, మలేసియా తదితర దేశాల్లో 12 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఇతర దేశాలకు వెళుతున్న వారు కేరళ తర్వాత మన రాష్ట్రం నుంచే అత్యధికంగా ఉన్నారు. తాపీ మేస్త్రీ, ఇంటి పనులు, డ్రైవర్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ తదితర పనులు చేసుకునే వారు ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తుంటారు. వారిలో ఎక్కువ మంది పేదలే. ఇలాంటి వారికి ‘బీమా’ చాలా అవసరం. వారికి ప్రభుత్వం ‘ప్రవాసాంధ్ర భరోసా’ కింద తన వాటాను చెల్లించకుండా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది.


ఆర్థికసాయంలోనూ క్రూరత్వమే..

విదేశాల్లో ఏటా 15 నుంచి 20 మంది ప్రవాసాంధ్రులు వివిధ ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. సాధారణ మరణాలు 75-100 వరకు చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ అధికారిక గణాంకా లే. సమాచారం అందని మరణాలు మరో 20-25% ఉండే అవకాశముంది. బీమా కింద నమోదు కానివారు గత నాలుగున్నరేళ్లలో 489 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో కనీసం 10% మంది ప్రమాదవశాత్తు మరణించి ఉంటారని అంచనా. వీరిని బీమా పథకంలో చేర్చని కారణంగా బాధిత కుటుంబాలు రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయాయి. ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.50 వేల ఆర్థికసాయం మాత్రమే అందింది. ఈ సాయం ఇవ్వడంలోనూ ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. విదేశాలకు వెళ్లి కనీసం నాలుగేళ్లు దాటిన వారికే ఈ పరిహారాన్ని పంపిణీ చేసింది. ప్రవాసాంధ్రులకు ప్రత్యేక బీమా పథకాన్ని దూరం చేసిన వైకాపా సర్కారు కనీసం ఆర్థికసాయం అందించడంలోనూ క్రూరంగా వ్యవహరిస్తోంది.


గడువు తీరాక కంటితుడుపు ప్రకటన

‘ప్రవాసాంధ్ర భరోసా’ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) ద్వారా ఓ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పంద గడువు గత జనవరి నెలతో ముగిసింది. ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధి ఉన్న ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? ఏదైనా బ్యాంకుతోగానీ, సంస్థతోగానీ ఒప్పందం కుదుర్చుకుంటే.. ఆ గడువు ముగియక ముందో, గడువు ముగిసే చివరి రోజునో ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలి. లేనిపక్షంలో మరో బ్యాంకు/సంస్థతో తిరిగి ఒప్పందం చేసుకోవాలి. వైకాపా సర్కారు మాత్రం గడువు ముగిశాక తీరిగ్గా.. ‘బ్యాంకుతో త్వరలో ఒప్పందం చేసుకుంటాం’ అంటూ ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌తో ఓ కంటితుడుపు ప్రకటన ఇప్పించింది. అప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ కింద నమోదు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని