నాట్కో కేన్సర్‌ కేంద్రంలో అదనంగా వంద పడకల బ్లాక్‌

గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో కేంద్రాన్ని ఇటీవల లెవెల్‌-1 కేన్సర్‌ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది.

Published : 28 Feb 2024 04:03 IST

నగరంపాలెం(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో కేంద్రాన్ని ఇటీవల లెవెల్‌-1 కేన్సర్‌ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం కేన్సర్‌ సెంటర్‌లో ఇప్పుడున్న వంద పడకలకు అదనంగా మరో వంద పడకలతో వసతులు ఏర్పాటు చేసేందుకు 1,500 గజాల స్థలాన్ని నాట్కో ట్రస్ట్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి మంగళగిరి ఏపీఐఐసీ టవర్స్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సమక్షంలో నాట్కో ఫార్మా సీఎండీ, నాట్కో ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ వి.సి.నన్నపనేని, డీఎంఈ డాక్టర్‌ నరసింహం అవగాహన ఒప్పంద పత్రాల్ని మంగళవారం మార్చుకున్నారు. కృష్ణబాబు మాట్లాడుతూ కేన్సర్‌ చికిత్స, నిర్ధారణకు అవసరమైన పెట్‌ స్కాన్‌ యంత్రం కొనుగోలుకు టెండర్లు పిలిచామన్నారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన నర్సులు మాత్రమే పనిచేసేలా 30 ప్రత్యేక పోస్టులతో పాటు మొత్తం 120 పోస్టుల్ని మంజూరు చేశామని తెలిపారు. కేన్సర్‌ కేంద్రంలో ఈ త్రైమాసికానికి గాను రోగులకు ఉచితంగా అందజేసేందుకు రూ.60 లక్షల విలువైన మందుల్ని కృష్ణబాబుకు వి.సి.నన్నపనేని అందజేశారు. నాట్కో ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ నన్నపనేని సదాశివరావు, కేన్సర్‌ కేంద్రం సమన్వయకర్త యడ్లపాటి అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని