సెకి ఛైర్మన్‌ గుప్తా ఎందుకు వస్తున్నట్లు?

భారత సౌర విద్యుత్‌ సంస్థ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-సెకి) ఛైర్మన్‌ ఆర్‌.పి.గుప్తా మార్చి 1న హడావుడిగా రావడంలో ఆంతర్యమేంటని విద్యుత్‌ ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Updated : 28 Feb 2024 06:03 IST

మార్చి 1న విద్యుత్‌ సౌధలో ఇంధనశాఖ అధికారులతో సమావేశం

ఈనాడు, అమరావతి: భారత సౌర విద్యుత్‌ సంస్థ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-సెకి) ఛైర్మన్‌ ఆర్‌.పి.గుప్తా మార్చి 1న హడావుడిగా రావడంలో ఆంతర్యమేంటని విద్యుత్‌ ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శుక్రవారం విద్యుత్‌సౌధలో ఇంధన శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. సెకి నుంచి ఏటా 17 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ తీసుకునేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందంపై డిస్కంలు, రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేయడానికి అనుమతించాలని కొద్ది రోజుల కిందట డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)లో పిటిషన్‌ వేశాయి. దీనిపై ఈ నెల 21న ఏపీఈఆర్‌సీ విచారణ చేపట్టింది. సెకి నుంచి తీసుకునే విద్యుత్‌పై పూర్తి అధికారం ప్రభుత్వానికే ఉన్నందున విద్యుత్‌ చట్టం పరిధిలోకి వస్తుందా? సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో దాఖలైన పిటిషన్‌పై విచారణ తర్వాత అనుమతించిన టారిఫ్‌నే కొనసాగించవచ్చా అని సందేహాలను వ్యక్తం చేసి,  తదుపరి విచారణను ఏప్రిల్‌ 10కి వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశం లేదు. ఒప్పందం మేరకు ఈ ఏడాది సెప్టెంబరులో సెకి విద్యుత్‌ సరఫరా ప్రారంభం కానుంది. దీనికి 6 నెలల ముందుగానే ఆ సంస్థ ఛైర్మన్‌ హడావుడిగా ఎందుకొస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని