క్రికెట్‌పై రాజకీయాలు దురదృష్టకరం

‘జెంటిల్‌మెన్‌ గేమ్‌’గా గుర్తింపు పొందిన క్రికెట్‌పై రాజకీయాలు దురదృష్టకరమని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ (ఏసీఏ) పేర్కొంది.

Updated : 28 Feb 2024 07:05 IST

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ‘జెంటిల్‌మెన్‌ గేమ్‌’గా గుర్తింపు పొందిన క్రికెట్‌పై రాజకీయాలు దురదృష్టకరమని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ (ఏసీఏ) పేర్కొంది. ఈ మేరకు ఏసీఏ మీడియా మేనేజర్‌ డి.రాజగోపాల్‌ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘క్రికెటర్‌ హనుమ విహారి సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన విమర్శలను ఆసరాగా తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు.. అసోసియేషన్‌ నాయకత్వం, మేనేజ్‌మెంట్‌పై ఆరోపణలు చేయడం బాధాకరం. జట్టు సభ్యుల మద్దతున్నా కెప్టెన్‌గా తొలగించారని విహారి చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కొందరు సభ్యులు ఏసీఏకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వాటన్నింటిపై విచారించి బీసీసీఐకి నివేదిస్తాం. జనవరిలో బెంగాల్‌తో రంజీ మ్యాచ్‌ సందర్భంగా విహారి.. పృథ్వీరాజ్‌ను కాదని గాయపడిన మరో వికెట్ కీపర్‌ను ఆడించారు. తనను వ్యక్తిగతంగా అందరిముందు దూషించారంటూ పృథ్వీరాజ్‌ ఫిర్యాదు చేశారు. గతంలో విహారి వ్యవహారశైలి వల్ల జట్టులో వర్గ విభేదాలు వచ్చినట్టు ఏపీ జట్టు మేనేజర్‌ ఏసీఏకు ఫిర్యాదునిచ్చారు. ఆయన తీరుపై ఫిర్యాదుల నేపథ్యంలో జనవరిలో మొదటి రంజీ ట్రోఫీ తర్వాత ఏసీఏ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌.. కొత్త కెప్టెన్‌ను ప్రతిపాదిస్తూ ఏసీఏకు లేఖ రాశారు. దీనికి స్పందించిన విహారి.. సెలక్షన్‌ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ ప్రతిగా మెయిల్‌ పంపారు. ఈ వ్యవహారంలో ఏసీఏ జోక్యం చేసుకోలేదు..’ అని పేర్కొన్నారు.

భారత క్రికెటర్‌ కంటే.. వైకాపా కార్పొరేటరే ముఖ్యమా?: పవన్‌కల్యాణ్‌

భారత క్రికెటర్‌ అయిన హనుమ విహారి కంటే.. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌కు వైకాపా కార్పొరేటరే ముఖ్యమా? ఎంత అవమానకరం? రాష్ట్ర క్రికెట్‌ సంఘమే జట్టు కెప్టెన్‌ను దారుణంగా అవమానించినప్పుడు.. ‘ఆడుదాం ఆంధ్రా’ వంటి కార్యక్రమానికి రూ.కోట్లు ఖర్చు చేసి లాభమేంటి? క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే వ్యక్తిగా విహారికి జరిగిన అన్యాయానికి చింతిస్తున్నాం.

వైకాపా నేతలు ఇంకెంత దిగజారుతారో ఊహించలేం: షర్మిల

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ మరీ ఇంత అధ్వానమా? హనుమ విహారి విషయంలో తక్షణమే విచారణ చేయించాలి. అన్ని విధాలుగా రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసిన వైకాపా నేతలు ఇంకెంత దిగజారుతారో ఊహించలేం. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ రెండు నెలలు సినిమా స్టంట్లు చేయించారు.

ఏసీఏలో దోపిడీకి పాల్పడ్డారు: తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)లో వైకాపా నాయకులు దోపిడీకి పాల్పడ్డారు. రూ.160 కోట్లకు పైగా డిపాజిట్లు ఉండాల్సిన చోట.. రూ.20 కోట్లు మాత్రమే ఉన్నాయి. వైకాపా నేతల అరాచకాలకు క్రీడాకారులు బలైపోతున్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.120 కోట్లు దుర్వినియోగం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని