ఒకటో తేదీకి గోదావరి బోర్డు సమావేశం వాయిదా

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం చర్చ జరగకుండానే వాయిదా పడింది. మంగళవారం హైదరాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్‌ ఎంకే సిన్హా అధ్యక్షతన 15వ బోర్డు సమావేశం జరగాల్సి ఉంది.

Published : 28 Feb 2024 04:13 IST

ఎజెండాలో పలు కీలక అంశాలు

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం చర్చ జరగకుండానే వాయిదా పడింది. మంగళవారం హైదరాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్‌ ఎంకే సిన్హా అధ్యక్షతన 15వ బోర్డు సమావేశం జరగాల్సి ఉంది. సభ్యులైన తెలంగాణ హాజరు కాగా, ఏపీ హాజరు కాలేమని ముందుగానే బోర్డుకు సమాచారం ఇచ్చింది. దీంతో మార్చి ఒకటో తేదీన తిరిగి సమావేశాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి భీం ప్రసాద్‌, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ శంకర్‌ నాయక్‌, ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్‌ హాజరయ్యారు. బోర్డు సమావేశం ఎజెండాలో పలు కీలక అంశాలు ఉన్నాయి. సమ్మక్కసాగర్‌, సీతమ్మసాగర్‌లకు త్వరితగతిన అనుమతులు వచ్చేలా బోర్డు సహకారం అందించాలని తెలంగాణ కోరుతోంది. అనుమతులు లేకుండా తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం అదనపు టీఎంసీ, మిషన్‌ భగీరథ, గౌరవెల్లి జలాశయం విస్తరణ, సీతమ్మసాగర్‌, సమ్మక్కసాగర్‌ బ్యారేజీల పనులపై చర్చించాలని, గోదావరిలో నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదిక తప్పులతడకగా ఉందని, గోదావరి జలాలపై ట్రైబ్యునల్‌ వేసేలా చూడాలని ఏపీ కోరుతోంది. ఈ అంశాలపై చర్చ జరగాల్సి ఉంది. బోర్డులో అదనపు సిబ్బంది నియామకం, బడ్జెట్‌ కేటాయింపులు, టెలీమెట్రీ పరికరాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని