గ్రూప్‌-2 మెయిన్స్‌కు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి

గ్రూపు-2 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా ఇచ్చినందున ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయానికి అభ్యర్థనలు అందుతున్నాయి.

Published : 28 Feb 2024 04:14 IST

ఏపీపీఎస్సీ అధికారులను కలిసిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ఈనాడు, అమరావతి: గ్రూపు-2 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా ఇచ్చినందున ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయానికి అభ్యర్థనలు అందుతున్నాయి. నోటిఫికేషన్‌ జారీ అయ్యాక పరీక్షకు వ్యవధి తక్కువగా ఉందని, అన్ని సబ్జెక్టుల్లో ప్రిపేర్‌ అయ్యేందుకు సమయం సరిపోలేదని అభ్యర్థులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. ఏపీపీఎస్సీ 150 మార్కులకు ప్రిలిమ్స్‌ నిర్వహించింది. ఇందులో భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, భారత సమాజం, సమకాలీన వ్యవహారాలు, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల్లో 30 చొప్పున కలిపి 150 ప్రశ్నలను 150 మార్కులకు ఇచ్చారు. ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ప్రధాన పరీక్ష (మెయిన్స్‌)కు ఎంపిక చేస్తున్నారు. అయితే, ఎప్పుడూ లేనట్లు ఈసారి ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నందున.. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయాలని పోటీ పరీక్షల శిక్షణ నిపుణుడు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌, సభ్యులు పి.సుధీర్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందించారు. ‘ప్రిలిమ్స్‌లో ‘భారత సమాజం’ కింద ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. సుదీర్ఘ కాలం తర్వాత గ్రూపు-2 నోటిఫికేషన్‌ ఇవ్వగా, సన్నద్ధతకు అభ్యర్థులకు సమయం సరిపోలేదు. గ్రామీణ విద్యార్థులకు మరింత నష్టం జరుగుతుంది. మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తే ఎవరికీ నష్టం జరగదు. దీనిపై సానుకూలంగా చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.  

 సివిల్స్‌ స్థాయిలో ఉంది: డీవైఎఫ్‌ఐ

గ్రూపు-2 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమ్స్‌ స్థాయిలో ఉందని డీవైఎఫ్‌ఐ పేర్కొంది. ‘ఐదేళ్లుగా సిద్ధమైన అభ్యర్థులు కూడా ప్రశ్నల స్థాయిని అందుకోలేకపోయారు. గ్రూపు-2 ప్రిలిమ్స్‌లో ఒక సబ్జెక్టు అయిన సోషియాలజీ తెలుగు అకాడమీ పుస్తకం ప్రిలిమ్స్‌ పరీక్షలకు 45 రోజుల ముందు రిలీజ్‌ అయింది. చదివేందుకు సమయం చాలలేదు. ప్రధాన పరీక్షకు అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపికచేసి ఎక్కువ మందికి అవకాశం కల్పించాల’ని డీవైఎఫ్‌ఐ అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి రామన్న ఏపీపీఎస్సీ అధికారులకు వినతి పత్రం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని