కడప జైల్లో బేరం వెనక హస్తమెవరిది?

మాజీ మంత్రి వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని.. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి కలవడం, రాజీకొస్తే రూ.20కోట్లు ఇస్తానని ఆఫర్‌ చేయడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

Updated : 29 Feb 2024 12:14 IST

దస్తగిరి వద్దకు నిందితుడు శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి
వైద్యశిబిరానికి ఆయన్నే ఎందుకు ఎంచుకున్నారనేది అనుమానం

ఈనాడు, కడప: మాజీ మంత్రి వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని.. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి కలవడం, రాజీకొస్తే రూ.20కోట్లు ఇస్తానని ఆఫర్‌ చేయడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్యకేసులో అయిదో నిందితుడైన శివశంకర్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ పలుమార్లు పేర్కొంది. ఈ కేసు విచారణలో ఉండగానే ఆయన కుమారుడైన డాక్టర్‌ చైతన్యరెడ్డి అప్రూవర్‌ దస్తగిరి వద్దకు వెళ్లి రూ.20 కోట్లు ఇస్తానంటూ ఆఫర్‌ చేశారన్న ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. ఖైదీలకు వైద్యశిబిరం పేరుతో డాక్టర్‌ చైతన్యరెడ్డి తనతో సమావేశమై రూ.20 కోట్లు ఆఫర్‌ చేశారని దస్తగిరి బాహాటంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలో హత్యకు గురయ్యారు. హత్య కుట్రలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ హత్య కోసమే దస్తగిరికి రూ.కోటి అడ్వాన్స్‌ ఇచ్చారు. హత్య కోసం డబ్బులు డీల్‌ చేసిన వ్యక్తి శివశంకర్‌రెడ్డేనని సీబీఐ తేల్చింది. ఈ కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారి ముందస్తు బెయిల్‌పై ఉన్నారు.

వైద్యశిబిరం పేరిట దస్తగిరి వద్దకు చైతన్యరెడ్డి

హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కీలక సాక్షిగా ఉన్నారు. ఎర్రగంట్ల పోలీసులు గతేడాది అక్టోబరు 31న అట్రాసిటీ కేసులో అతడిని అరెస్టు చేసి కడప జైలుకు పంపారు. హైకోర్టు బెయిల్‌ ఇచ్చినా వేముల పోలీసులు దాడి కేసు నమోదుచేసి పీటీ వారంట్‌ కింద అరెస్టు చేశారు. కడప జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరుచేయడంతో ఈ నెల 23న కడప జైలు నుంచి విడుదలయ్యారు. దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైతన్యరెడ్డి జైల్లో ఖైదీలకు వైద్యశిబిరం పేరుతో బ్యారెక్‌లో ఉన్న దస్తగిరిని నవంబరు 18న కలిసినట్లు సమాచారం. తమకు అనుకూలంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలని.. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ కొట్టి అప్రూవర్‌గా మార్చినట్లు చెప్పాలని చైతన్యరెడ్డి ఒత్తిడి తెచ్చినట్లు దస్తగిరి మీడియాకు వెల్లడించారు. రూ.20 కోట్లు ఇస్తానంటూ తనకు ఆఫర్‌ చేసినట్లు వివరించారు. వివేకా హత్యకేసులో శివశంకర్‌రెడ్డి పాత్ర లేకపోతే ఆయన కుమారుడు ఇంత మొత్తం ఆఫర్‌ చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదంతా వెనకుండి ఎవరు నడిపిస్తున్నారనే విషయాలపై సీబీఐ విచారణ చేయాలని దస్తగిరి డిమాండు చేస్తున్నారు. చైతన్యరెడ్డి కడపలో 2022 మే 26న ఆసుపత్రి ప్రారంభించారు. ఆయన కంటే ఎంతోమంది ప్రముఖ వైద్యులున్నా.. చైతన్యరెడ్డినే ఎందుకు ఎంచుకున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జైల్లో జరిగిన వ్యవహారంపై సీబీఐని త్వరలో దస్తగిరి కలిసి వివరించనున్నట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని