45 రోజుల తర్వాత మీరూ ప్రభుత్వ ఉద్యోగులే

‘నాలుగేళ్లుగా మీ సేవలు అమూల్యం. మరో 45 రోజులు కష్టపడి పనిచేసి మళ్లీ జగన్‌ను సీఎం చేయాలి. అప్పుడు మీరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు..’ వాలంటీర్లకు వందనం పేరుతో నిర్వహిస్తున్న సభల్లో వైకాపా ప్రజాప్రతినిధుల హామీల వరద ఇది.

Published : 29 Feb 2024 03:24 IST

‘వాలంటీర్లకు వందనం’ సభలో వైకాపా ప్రజాప్రతినిధుల హామీల వరద

గుంటూరు (గోరంట్ల), న్యూస్‌టుడే: ‘నాలుగేళ్లుగా మీ సేవలు అమూల్యం. మరో 45 రోజులు కష్టపడి పనిచేసి మళ్లీ జగన్‌ను సీఎం చేయాలి. అప్పుడు మీరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు..’ వాలంటీర్లకు వందనం పేరుతో నిర్వహిస్తున్న సభల్లో వైకాపా ప్రజాప్రతినిధుల హామీల వరద ఇది. మంత్రి విడదల రజిని పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వాలంటీర్ల సభలో నగర మేయర్‌ మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు ఇలా వాగ్దానాలను కురిపించారు. గుంటూరు వైద్య కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన సభలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధి వాలంటీర్లకు పురస్కారాలను అందజేశారు. ఈ పరిధిలో మొత్తం 1,597 మంది వాలంటీర్లుండగా.. అయిదుగురికి సేవావజ్ర, 18 మందికి సేవారత్న, 1,574 మంది సేవామిత్ర పురస్కారాలిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అందరికీ పురస్కారాలిచ్చారనే చర్చ సమావేశంలో సాగింది. మంత్రి ప్రసంగిస్తుండగా కొందరు వాలంటీర్లు బయటకు వెళ్లిపోయారు. సభలో వైకాపా ప్రచార పాటలు వినిపించారు. సభ ప్రభుత్వం నిర్వహిస్తున్నా వేదికలపై పార్టీ నేతలు ఆసీనులవడం విమర్శలకు తావిచ్చింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సభలోనూ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని