సుప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు రాజారెడ్డి-రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు

కూచిపూడి రంగంలో విశేష సేవలందిస్తున్న సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి-రాధారెడ్డి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది.

Updated : 29 Feb 2024 06:41 IST

 ప్రకటించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ

కూచిపూడి, రవీంద్రభారతి-న్యూస్‌టుడే; దిల్లీ: కూచిపూడి రంగంలో విశేష సేవలందిస్తున్న సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి-రాధారెడ్డి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిని సంయుక్తంగా ప్రతిష్ఠాత్మక ‘అకాడమీ రత్న’ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరితో పాటు మరో అయిదుగురు ప్రముఖులు- రచయిత/జానపద అధ్యయనకారుడు వినాయక్‌ ఖెడేకర్‌, వైణికుడు ఆర్‌.విశ్వేశ్వరన్‌, కథక్‌ నృత్యకారిణి సునయన హజారీలాల్‌, రంగస్థల దర్శకుడు దులాల్‌ రాయ్‌, నాటక రచయిత డి.పి.సిన్హా 2022, 2023 సంవత్సరాలకుగాను ‘అకాడమీ రత్న’ అవార్డు దక్కించుకున్నారు. దిల్లీలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగిన జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో వీరందరినీ ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు అకాడమీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘అకాడమీ రత్న’ను ‘అకాడమీ ఫెలో’ అవార్డుగానూ పిలుస్తారు. మరోవైపు- ప్రముఖ నటులు అశోక్‌ సరాఫ్‌, రాజీవ్‌ వర్మ, గాయని బాంబే జయశ్రీ సహా మొత్తం 92 మంది కళాకారులకు 2022, 2023 సంవత్సరాలకుగాను ‘అకాడమీ అవార్డు’లను సంగీత నాటక అకాడమీ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల సేతురామ్‌, మద్దాళి ఉషాగాయత్రి, ప్రముఖ గాయకుడు ఎల్‌.వి.గంగాధర శాస్త్రి, మందా సుధారాణి (కర్ణాటక సంగీతం), వినుకొండ సుబ్రహ్మణ్యం (డోలు వాయిద్యం) తదితరులు ఉన్నారు. ‘అకాడమీ రత్న’ విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా రూ.3 లక్షల నగదు బహుమతితో పాటు తామ్రపత్రం, అంగవస్త్రం అందజేస్తారు. అకాడమీ అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, అంగవస్త్రం బహూకరిస్తారు. కూచిపూడి న్యాట్యాచార్యుడు ఎం.సురేంద్రనాథ్‌, డప్పు కళాకారుడు అంగడి భాస్కర్‌ సహా మొత్తం 80 మంది యువ కళాకారులను ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారాలకు అకాడమీ ఎంపిక చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని