‘ఈనాడు’ కార్యాలయంపై దాడి.. స్పందించిన ప్రెస్‌ కౌన్సిల్‌

కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై ఈ నెల 20న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు చేసిన దాడిపై ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది.

Updated : 29 Feb 2024 07:59 IST

నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం

ఈనాడు, దిల్లీ: కర్నూలులోని ‘ఈనాడు’ కార్యాలయంపై ఈ నెల 20న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు చేసిన దాడిపై ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్‌ ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్లు ప్రెస్‌ కౌన్సిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.  

ఆ రోజు ఏం జరిగిందంటే..

వందల మంది చూస్తుండగానే అధికార వైకాపా శ్రేణులు ‘ఈనాడు’ కార్యాలయంపైకి దూసుకువచ్చారు. రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులు నిలువరిస్తున్నా లెక్క చేయకుండా గంటపాటు వీరంగం సృష్టించారు. వారి ఆగడాలను చూసి భీతిల్లిపోయిన స్థానికులు దుకాణాలు మూసివేసుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ‘ఆయన వైకాపా సీనియర్‌ మేత’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనికి నిరసనగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు సుమారు 250 మంది ‘ఈనాడు’ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గట్టిగా కేకలేస్తూ గందరగోళం సృష్టించారు. మొదటి   అంతస్తులోని కార్యాలయం తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న రాళ్లను విసిరారు. బయట ఉన్న పూలకుండీలను పగలగొట్టారు. కార్యాలయ బోర్డును, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని