ఇది దోపిడీ సర్కారు

‘తెదేపా హయాంలో చంద్రబాబునాయుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపించారు. గిరిజనులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు.

Updated : 29 Feb 2024 06:10 IST

‘నిజం గెలవాలి’ యాత్రలో నారా భువనేశ్వరి ధ్వజం

ఈనాడు, న్యూస్‌టుడే- పాడేరు: ‘తెదేపా హయాంలో చంద్రబాబునాయుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపించారు. గిరిజనులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చారు. ప్రధాని మోదీ విశాఖకు వస్తే అరకు కాఫీ రుచి చూపించారు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఇసుమంతైనా ఉందా? పైగా గిరిజనుల సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఏపీని గంజాయి వనంగా మార్చి సిగ్గుతో తలదించుకునేలా చేశారు. దోపిడీ వైపు ఈ పాలకులు నిలిచారు’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి మండిపడ్డారు.

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, పాడేరు, జి.మాడుగుల మండలాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆమె కలిసి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలను అందజేశారు. పాడేరులోని గిరిజన మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. ‘చంద్రబాబు మన్యంలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వంలో నాయకులు గిరిజనులపై దాడులు చేస్తున్నారు. నేను బంగారుపాలెం అనే గ్రామానికి వెళ్లా. అక్కడ హంసవాణి అనే మహిళ నీటి పంపు కోసం ప్రశ్నించినందుకు వైకాపా నాయకులు ఆమె కళ్లు పీకేశారు. మరోచోట అమ్మాయిని గంజాయి మత్తులో దించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన తెదేపా నేత కన్ను పొడిచేశారు’ అని భువనేశ్వరి వాపోయారు.

అరకు కాఫీ నచ్చిందండీ..!

ఈ ప్రాంతమన్నా, గిరిజనులన్నా చంద్రబాబుకు ఎంతో అభిమానమని వారితో ముఖాముఖిలో భువనేశ్వరి పేర్కొన్నారు. ‘మీ పిల్లలు ఎదిగే సమయానికి నేనుంటానో లేదో కానీ ఈ తరం చల్లగా ఉండాలి. రాబోయే తరమూ బాగుండాలన్నదే నా ఆలోచన. రాష్ట్ర కుటుంబ పెద్దగా ఇది బాధ్యతగా భావిస్తున్నా..’ అంటూ చంద్రబాబు పంపిన సందేశాన్ని భువనేశ్వరి చదివి వినిపించారు. ఆమె అక్కడి కాఫీ రుచి చూశారు. ఆమె పర్యటన ఫొటోను చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేసి.. ‘మన గిరిజన సోదరులు పండించిన అరకు కాఫీ రుచి ఎలా ఉంది?’ అని అడిగారు. దీనిపై స్పందించిన భువనేశ్వరి.. కాఫీ నచ్చిందండని బదులిచ్చారు. ‘మన కిచెన్‌లో అరకు కాఫీ ప్యాకెట్లు ఉన్నప్పటికీ.. అరకు అందాలు, గిరిజనుల ప్రేమాభిమానాలతో ఇది మరింత రుచిగా మారింది’ అని భువనేశ్వరి పోస్టు చేశారు. అంతకుముందు గిరిజన మహిళలు పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లగా.. వచ్చేది మన ప్రభుత్వమేనని భరోసానిచ్చారు. థింసా నృత్యంతో గిరిజనులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని