మేతన్నకు.. కనిపించడా నేతన్న!

చేనేతలను ప్రోత్సహించేందుకు తెదేపా ప్రభుత్వం ‘ఆదరణ’ పథకం కింద జాకార్డు మిషన్లు, ఇతర పరికరాలను 90 శాతం రాయితీపై అందించింది. వారి జీవితాలకు బాసటగా నిలిచింది. జగన్‌ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపేశారు.

Published : 29 Feb 2024 05:17 IST


ఆదరణ కరవు!

చేనేతలను ప్రోత్సహించేందుకు తెదేపా ప్రభుత్వం ‘ఆదరణ’ పథకం కింద జాకార్డు మిషన్లు, ఇతర పరికరాలను 90 శాతం రాయితీపై అందించింది. వారి జీవితాలకు బాసటగా నిలిచింది. జగన్‌ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపేశారు.


చెమటోడ్చి మగ్గం నేసే నేతన్న అంటే.. అధికార పీఠమెక్కిన జగనన్నకు చులకన!
ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలిచ్చి.. తీరా గెలిచాక.. ముఖం చాటేశారు.. రాయితీ ఊసే లేకుండా చేశారు..
అర్థం పర్థంలేని నిబంధనలతో పింఛను ఎగ్గొట్టేస్తున్నారు..
నేత కూలీలకైతే ఏ పథకమూ వర్తించదనేస్తున్నారు
మొత్తంగా చిత్తశుద్ధి లేని వైకాపా సర్కారు ఏలుబడిలో.. చేనేత కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు!

ముఖ్యమంత్రి జగన్‌ ఏలుబడిలో చేనేతలు కుదేలయ్యారు. బీసీలు వెన్నెముక కులాలంటూ పదే పదే ఊదరగొట్టే ఆయన, అదే వర్గానికి చెందిన నేత కార్మికులను మాత్రం అష్టకష్టాల పాలు చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు చేనేతలకు హామీల వర్షం కురిపించారు. అధికార పీఠమెక్కగానే, వారికి ఆదరువే లేకుండా చేశారు. చేనేత సంఘాల సభ్యులు మొదలు, మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర కూలీ మగ్గాలు నేసే వారి వరకు అందరికీ అష్టకష్టాలే.   రాష్ట్రవ్యాప్తంగా చేనేత, అనుబంధ రంగాలకు చెందిన దాదాపు 3.50 లక్షల మంది కార్మికులు వృత్తి రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వినేందుకుగానీ, వాటిని పరిష్కరించేందుకుగానీ ముందడుగు వేసిన సందర్భమే లేదు.


ముడిసరకు రాయితీకి చెల్లుచీటి..

ఒక చేనేత కార్మికుడు మగ్గంపై నేసేందుకు నెలకు గరిష్ఠంగా ఆరు కిలోల ముడిసరకు వినియోగించవచ్చు. ఆ ప్రాతిపదికన గత తెదేపా ప్రభుత్వం 2014-18 వరకు ఒక్కో కార్మికునికి నెలకు ఆరు కిలోలకుగాను కిలోపై రూ.200 చొప్పున రాయితీగా చెల్లించింది. ఆ ప్రకారం ఏడాదికి రూ.14,400 అందించింది. చేనేత కార్మికుల గుర్తింపునకు పట్టు, నూలు రాయితీ పుస్తకాలు అందించి వారికి రాయితీని వర్తింప చేసింది. ముడి సరుకుపై పెరిగిన ధరలకు అనుగుణంగా చేనేతకు మరింత చేయూత ఇవ్వాలనే ఆలోచనతో 2018-19లో నెలకు ఇచ్చే రాయితీ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచింది. అంటే ఏడాదికిగాను మగ్గం నేసే కార్మికునికి రూ.24 వేలు అందినట్టే. ప్రతిపక్షనేతగా జగన్‌ 2017లో ముడి సరకు రాయితీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు కూడా! వారి ఓట్లు దండుకుని గెలిచిన తర్వాత మాత్రం తీసేశామని చెప్పకుండానే రాయితీ లేకుండా చేశారు.


పట్టించుకున్న పాపాన పోలేదు...

నూలుపై 5 శాతం, రంగులూ, రసాయనాలపై 18 శాతం జీఎస్టీ ఉంది. ముడిసరకు ధర ప్రస్తుతం కిలో రూ.5,500 ఉంది. ఇదేకాకుండా డిజైన్‌ పంచింగ్‌ కార్డ్స్‌, రంగుల అద్దకానికి వినియోగించే పిండిపైనా జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో ఉత్పత్తి ఖర్చు అమాంతం పెరిగింది. ఆ మేరకు చీరల ధరల్ని పెంచితే కొనుగోలుదారులు ముందుకురారనే ఆలోచనతో పెంచడం లేదు. కొంతమంది ఉత్పత్తి ధరకే చీరలను అమ్మేశారు కూడా. ధర్మవరం, మదనపల్లె, ఉప్పాడ, మంగళగిరి, ఎమ్మిగనూరు, చీరాల, కొడమూరులోని పట్టు చీరలు నేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డా పట్టించుకోలేదు.

100 మగ్గాలుండే మాస్టర్‌ వీవర్స్‌కు రూ.24 వేల సాయం అందిస్తారట. కానీ ఆయన దగ్గర కూలీకి పనిచేసే కార్మికునికి మాత్రం సాయం వర్తించదట. అదేమంటే మ్యానిఫెస్టోలో సొంత మగ్గం ఉన్న వారికే సాయం అందిస్తామని చెప్పారట. దీన్ని సాకుగా చూపి వేల మంది అసలైన పేద చేనేత కార్మికులకు ఆర్థికసాయం అందించకుండా ఎగ్గొడుతున్నారు.


లెక్క తేల్చడం లేదు..

జగన్‌ 50 ఇళ్లకో వాలంటీర్‌ను పెట్టి కుటుంబాల సమస్త సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాంటిది మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర ఎంత మంది కూలికి పనిచేస్తున్నారో గుర్తించడం కష్టమా? నేత పనుల్లో అల్లు పోయడం, రంగులు అద్దడం, వార్పింగ్‌, జరీపోయడం, అచ్చు అతకడం, కండెలు చుట్టడం, డిజైనింగ్‌ పనులను అనుబంధ రంగాల వారు చేస్తారు. మంగళగిరి కార్పొరేషన్‌ పరిధిలో 2,500 మంది చేనేత కార్మికులున్నారు. వీరిలో సొంత మగ్గాలున్న 488 మందికి 5వ విడతలో నేతన్ననేస్తం సాయం అందించారు. వీరు కాకుండా మాస్టర్‌ వీవర్స్‌ మగ్గాల షెడ్లలో, సొసైటీల్లో నేసే 700 మందికి, ఇళ్లల్లో అద్దె మగ్గాలపై నేసే మిగతా వారికి పథకం వర్తించని పరిస్థితి. ఇక్కడ ఉప వృత్తుల మీద 5 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో గద్వాల్‌ పట్టు చీరలు నేసే కార్మికులు 8,200 మంది ఉంటే నేతన్న నేస్తం సాయం అందించింది 1,800 మందికే. మిగతా 6,400 మంది మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర కూలీ కింద మగ్గాలు నేసేవారే. వీరికి ప్రభుత్వం నుంచి నేతన్ననేస్తం కింద ఎలాంటి ఆదరువూ లేదు. ఇక్కడ అనుబంధ రంగాల వారు ఎనిమిది వేల మంది వరకు ఉంటారని అంచనా. మదనపల్లె పరిధిలో 2,904 మందికి నేతన్ననేస్తం కింద ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక్కడ అద్దె మగ్గాలు నేసే 1,500 మంది, అనుబంధ రంగాలకు చెందిన మరో 3 వేల మందికి మొండిచేయే.


చేనేత పింఛన్లకూ ఎసరు

ఏళ్లుగా అందుతున్న పింఛన్లకూ జగన్‌ ఎసరు పెట్టారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛను పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సామాజిక భద్రత పింఛన్లకు 6 దశల నిబంధనలు అమలు చేసింది. ఇవి చాలవన్నట్టు తాజాగా చేనేత పింఛన్ల మంజూరుకు అదనంగా రెండేళ్లపాటు జీఎస్టీ చెల్లింపులు, మాస్టర్‌ వీవర్స్‌ ఖాతా నుంచి కూలీ మగ్గాలు నేసే కార్మికుల ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారా వేతనాల చెల్లింపులు ఉండాలనే నిబంధనలు తెచ్చింది.


కరోనా సమయంలోనూ కరుణించలేదు...

ప్రతి చేనేత కుటుంబానికి రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం అందిస్తామని ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో 2017 అక్టోబరులో ప్రతిపక్షనేతగా జగన్‌ మాటిచ్చారు. కార్మికులకు ఇళ్లూ, మగ్గాలకు షెడ్లూ నిర్మిస్తామన్నారు. అయిదేళ్లుగా వడ్డీ లేని రుణం ఊసే ఎత్తలేదు. కరోనాతో వ్యాపారం కుదేలైన సందర్భంలో రుణాలిచ్చి ఆదుకోవాల్సి ఉండగా.. ఆ ఆలోచన కూడా చేయలేదు.


లెక్కలోకే తీసుకోవడం లేదు..

ధర్మవరంలో చేనేతలపై అధారపడి జీవిస్తున్న వారు 33 వేల మంది. కానీ గతేడాది జులైలో అక్కడ నేతన్ననేస్తం సాయం కేవలం 10 వేల మందికే అందింది. మిగతా 23 వేల మందిలో 15 వేల మంది కూలీకి మగ్గాలు నేస్తున్నారని, మిగిలిన 8 వేల మంది చేనేత ఉపవృత్తులు చేసుకుంటున్నారని వారిని అసలు లెక్కలోకే తీసుకోలేదు.


ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని