ఝార్ఖండూ మనల్ని దాటేసింది!

రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నాయి. పారిశ్రామిక, పర్యాటక, ఆక్వా తదితర రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయి. కానీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఆకర్షించడంలో మాత్రం రాష్ట్రం వెనకబడింది.

Updated : 29 Feb 2024 06:44 IST

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలోనూ వెనకబడిన ఆంధ్ర
రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ కన్నా వెనకంజ
జాబితాలో తొలి పది స్థానాల్లో కనిపించని ఆంధ్రప్రదేశ్‌
యువతకు శాపంగా మారిన జగన్‌ సర్కారు నిర్లక్ష్యం
ఈనాడు, అమరావతి

గతంలో..

ఏ జాబితాలోనైనా టాప్‌ 5లో కనిపించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌..

మరిప్పుడో..

రెండంకెల స్థానాల్లో వెతుక్కోవాల్సిందే..
అపార అవకాశాలుండీ.. విలువైన వనరులుండీ.. పుష్కలమైన మావన వనరులూ ఉండీ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రావని వెనకబడిపోయింది!
ఝార్ఖండ్‌లాంటి రాష్ట్రాలకూ వెళుతున్న పారిశ్రామికవేత్తలు.. మన రాష్ట్రం వైపు మాత్రం చూడటం లేదు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉన్నట్లు... కమీషన్లు, వాటాల జగన్‌ సర్కారును చూసి పారిపోతున్నారు.. ఉన్నవాటినే ఇక్కడి ప్రభుత్వం తరుముతుంటే.. ఇక కొత్తవేం వస్తాయి? ఉద్యోగ, ఉపాధి అవకాశాలెలా వస్తాయి?

రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నాయి. పారిశ్రామిక, పర్యాటక, ఆక్వా తదితర రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయి. కానీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఆకర్షించడంలో మాత్రం రాష్ట్రం వెనకబడింది. ఏ చిన్న అవకాశం ఉన్నా.. పెట్టుబడులు పెడతామంటూ పోటీలు పడే పారిశ్రామికవేత్తలు, మన దగ్గరకు మాత్రం ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు జగన్‌ సర్కారు అనేదే అంతా చెప్పే సమాధానం! ఆయన నేతృత్వంలోని వైకాపా సర్కారు అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాలు, మౌలిక సదుపాయాల విస్మరణ, కమీషన్ల కక్కుర్తి ఫలితంగా ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఐదేళ్లలో కొత్త పరిశ్రమలను ఆహ్వానించకపోగా.. ఉన్నవాటిపై కక్షపూరితంగా వ్యవహరించారు. సహజ వనరులను కొల్లగొట్టి.. పరిశ్రమలను వెళ్లగొట్టి ఆంధ్రప్రదేశ్‌ను అపఖ్యాతి పాలు చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనూ ఆకర్షించలేక అయిదేళ్లను హారతి  కర్పూరం చేశారు. కనీసం గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని అమరావతిపై ఈ ప్రభుత్వం దృష్టిసారించినా.. మనకూ ఒక మహానగరం సాకారమయ్యేది. అదీ చేయకపోవడంతో, అపార అవకాశాలున్న మన రాష్ట్రాన్ని కాదని మరీ పెట్టుబడులన్నీ తరలిపోయాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరవయ్యాయి. ఫలితంగా ఉన్నత చదువులతోపాటు కొలువులకూ యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఒకప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్‌.. ఇప్పుడు టాప్‌-10 జాబితాలో స్థానం కోల్పోయింది. ఈ విషయంలో ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌...  తదితర రాష్ట్రాలు సైతం ముందు వరసలో ఉన్నాయి. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా మెరుగైన స్థానంలోనే ఉంది.

ఎంతో వెనకబాటు..

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు రూ.65,502 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మహారాష్ట్ర.. జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దిల్లీ రూ.25,582 కోట్లు, కర్ణాటక రూ.23,460 కోట్లు, గుజరాత్‌ రూ.18,884 కోట్ల విదేశీ పెట్టుబడులతో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయిదారు స్థానాల్లో తమిళనాడు (రూ.11,115 కోట్లు), తెలంగాణ (రూ.9,679 కోట్లు) ఉన్నాయి. కేవలం రూ.630 కోట్ల విదేశీ పెట్టుబడులను సంపాదించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం 11వ స్థానంలో నిలిచింది.
  • జగన్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి 2023 సెప్టెంబరు నెలాఖరు వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) గణాంకాలను పరిశీలిస్తే.. మనం ఎంత వెనకబడ్డామో స్పష్టమవుతుంది. మహారాష్ట్ర రూ.4,72,829 కోట్ల విదేశీ పెట్టుబడులను సాధించి ఈ జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో కర్ణాటక (రూ.3,58,517 కోట్లు), తృతీయ స్థానంలో గుజరాత్‌ (రూ.2,57,908 కోట్లు) ఉన్నాయి. రూ.45,445 కోట్ల పెట్టుబడులతో తెలంగాణ 7వ స్థానంలో ఉంటే.. రూ.6,679 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో నిలిచింది.

ఈ అంశాలే కీలకం

పారిశ్రామికవేత్తలను ఆకర్షించి పెట్టుబడులను తీసుకురావాలంటే ఏ రాష్ట్రానికైనా రాజధాని నగరం ఎంతో ముఖ్యం. మన పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు పెట్టుబడులు తరలివచ్చేందుకు ఇవే కారణం. ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ రంగాలు, నిర్మాణ రంగం, రసాయనాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఈ రంగాలపై దృష్టి సారించిన రాష్ట్రాలకు విదేశాల నుంచి పెట్టుబడులు సమకూరుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక పారిశ్రామిక విధానాలను రూపొందించడం, సంస్థలకు ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించడం, అన్నింటికీ మించి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటం ఆయా రాష్ట్రాలకు కలిసొస్తుంది. ఈ అంశాలపై మన ప్రభుత్వం అసలు దృష్టి సారించకపోవడంతోపాటు అసలు రాజధానే లేకుండా చేసింది. దాంతో పారిశ్రామికవేత్తలు ఎక్కడికి వెళ్లాలో.. ఎవరిని కలవాలో తెలియని పరిస్థితిని కల్పించారు జగన్‌.


పారిశ్రామిక వాడలకే దిక్కులేదు!

గత అయిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్క పారిశ్రామికవాడనూ అభివృద్ధి చేయలేదు. ఏ ఒక్క రంగాన్నీ తీర్చిదిద్దే ప్రయత్నం చేయలేదు. విశాఖలో ఐటీ, విజయవాడలో ఆటోమొబైల్‌, తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పరిశ్రమలు వస్తే రానీ లేకపోతే లేదన్నట్లుగా ప్రజాప్రతినిధుల వైఖరి ఉండటం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. పైగా తమ మాట వినని, ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులను గురిచేసి, వారి వ్యాపారాలను తరిమికొట్టారు. అందుకు అమరరాజా సంస్థే ఉదాహరణ. కేవలం గనులు, ఇసుక వంటి సహజ సంపదను కొల్లగొట్టే సంస్థలకు మాత్రమే రెడ్‌కార్పెట్‌ పరిచి.. ఇతర రంగాలను నిర్లక్ష్యం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని