అక్రమాలు జరగకపోతే.. ఎన్జీటీ రూ.1,800 కోట్ల జరిమానా ఎందుకు విధిస్తుంది?

రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలపై హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. అక్రమాలు జరగకపోతే రాష్ట్రప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) రూ.1800 కోట్ల జరిమానా ఎందుకు విధిస్తుందని ప్రశ్నించింది.

Published : 29 Feb 2024 05:18 IST

గనుల తవ్వకాలపై హైకోర్టు సీరియస్‌
2.86 ఎకరాల్లో అనుమతి తీసుకొని 60 ఎకరాల్లో తవ్వకాలా!
అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేశారో నివేదిక ఇవ్వండి
తప్పుడు వివరాలిస్తే న్యాయాధికారులను పంపి వాస్తవాల నిగ్గు తేలుస్తామని హెచ్చరిక

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలపై హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. అక్రమాలు జరగకపోతే రాష్ట్రప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) రూ.1800 కోట్ల జరిమానా ఎందుకు విధిస్తుందని ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలపై తరచూ వ్యాజ్యాలు దాఖలవుతున్నా.. గనులశాఖలో అంతా సవ్యంగా జరుగుతోందన్న ఆశాభావంతో మీరు ఉంటారని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కె.నవీన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలో డీకే పట్టా 2.86 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు తీసుకొని 60 ఎకరాల్లో తవ్వడంపై విస్మయం వ్యక్తంచేసింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని గనులశాఖ, రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించింది. తప్పుడు నివేదిక ఇస్తే తమ న్యాయాధికారులను పంపి వాస్తవాలను నిగ్గు తేలుస్తామని హెచ్చరించింది. అవసరమైతే గనులశాఖ కార్యదర్శిని కోర్టుకు పిలిపించి ఉల్లంఘనలపై వివరణ కోరతామని తేల్చిచెప్పింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
- గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై ఎం.ప్రభుదాసు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. బుధవారం విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనం స్పందిస్తూ.. గనుల అక్రమ తవ్వకాలను ఎన్జీటీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లుందని పేర్కొంది. జీపీ నవీన్‌ స్పందిస్తూ ఇది ఇసుక తవ్వకాల కేసు కాదని, గ్రావెల్‌ వ్యవహారమని బదులిచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఏదైనా గనుల అక్రమ తవ్వకాలే కదా అని వ్యాఖ్యానించింది.

ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరిస్తున్నారు

పిటిషనర్‌ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో పలుచోట్ల విచక్షణారహితంగా గనుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఎసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతివ్వడానికి వీల్లేదు. అక్కడి ఎసైన్డ్‌ భూములు పేద ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందినవి. వారిని భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుని బెదిరిస్తున్నారు. 60 ఎకరాల చుట్టూ కంచె వేసి గ్రావెల్‌ తవ్వుతున్నారు’ అని తెలిపారు.


అంగారక గ్రహంపై సర్వే చేయడం లేదుగా..

ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. అక్కడి తవ్వకాలపై సర్వే బృందాన్ని పంపి నిగ్గుతేల్చాలని, అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మూడు వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది నవీన్‌ కోరారు. ధర్మాసనం స్పందిస్తూ సర్వే చేసేందుకు మీరేమీ అంగారకగ్రహంపైకి వెళ్లడం లేదు కదా? అని వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని తేల్చిచెప్పింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని