పేదలకు సొంతిళ్లు ‘జగన్‌ నమ్మక ద్రోహం’

ఇళ్లన్నారు.. ఊళ్లన్నారు.. అయిదేళ్లలో పాతిక లక్షల గూళ్లు కట్టిస్తానన్నారు... అయిదేళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే... ఆయన కోటలు కట్టుకున్నారు కానీ, పేదలకు చిటికెల పందిరే తప్ప ఇంటి పందిరి వేయలేదు.

Updated : 18 Apr 2024 16:30 IST

ఇళ్లన్నారు.. ఊళ్లన్నారు.. అయిదేళ్లలో పాతిక లక్షల గూళ్లు కట్టిస్తానన్నారు... అయిదేళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే... ఆయన కోటలు కట్టుకున్నారు కానీ, పేదలకు చిటికెల పందిరే తప్ప ఇంటి పందిరి వేయలేదు. బల్లులు గుడ్లు పెట్టని... గుట్టల్లో, వంకల్లో... డొంకల్లో స్థలాలిచ్చి.. జగనన్న కాలనీలు కట్టేశామంటూ డప్పు కొట్టుకుంటూ ఊరేగుతున్నారు!

మోసమనే మాటకు ప్రాణమొచ్చి ప్యాంటూ చొక్కా వేసుకుంటే- అచ్చం జగన్‌మోహన్‌రెడ్డిలా ఉంటుంది. రొచ్చుగుంటలు, రాళ్లగుట్టలతో నిండిన ‘జగనన్న కాలనీ’ల్లోకి వెళ్తే- పేదలను జగన్‌ ఎంతగా దగాచేశారో అర్థమవుతుంది. ‘‘అధికారంలోకి వచ్చాక ప్రతి పేదకూ ఇల్లు కట్టిస్తా’’నని ప్రజాసంకల్ప యాత్రలో వైకాపా అధినేత ఆశపెట్టారు. చంద్రగిరి నుంచి పలాస వరకు ప్రతిచోటా అదే మాట పదేపదే చెప్పి, జనాన్ని నమ్మించి ఓట్లేయించుకున్నారు. గెలిచి సీఎం అయ్యాకేమో దారీతెన్నూ లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేయించారు జగన్‌. వాటితోనే అందరినీ ఉద్ధరిస్తున్నట్లు డ్రామాలాడుతూ అందినకాడికి అయినవారికి దోచిపెట్టారు. పేరుగొప్ప కాలనీలు, ఊరు దిబ్బ పనులతో పేదల సొంతింటి కలలను జగన్‌ కుప్పకూల్చారు.


నోరు తెరిస్తే కట్టుకథలే

వినేవారు ఉంటే జగన్‌ ఎన్ని కట్టుకథలైనా చెబుతారు. ‘‘చేయలేనిది చెప్పకూడదు... మాటిస్తే తప్పకూడదు’’ అనే మనస్తత్వం తనదని ఫిబ్రవరి ఆరున రొమ్ము విరుచుకుని మరీ చెప్పారు జగన్‌. ఆయనగారు నిజంగా అంతటి సుగుణశీలి అయితే- పేదలకెందుకు పంగనామాలు పెట్టారు? ‘‘అయిదేళ్లలో పాతిక లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తా’’నని ఊరించి ఊరించి పదవిలోకి వచ్చారు జగన్‌. మరి మాట తప్పకుండా పాతిక లక్షల ఇళ్లను కట్టించి అర్హులకు అందజేశారా? మురిపించిన దాంట్లో కనీసం పావువంతైనా పూర్తిచేశారా? అబ్బే... ముళ్లచెట్టుకు ఎక్కడైనా మామిడి కాయలు కాస్తాయా? రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు నిరుడు అక్టోబరులో సొంత గొప్పల చిట్టా చదివారు జగన్‌. తెదేపా జమానాకు చెందిన 2.62 లక్షల ‘టిడ్కో’ ఇళ్లు, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల వ్యక్తిగత స్థలాల్లో నిర్మితమవుతున్న 1.80 లక్షల గృహాలను కూడా జగన్‌ తన ఖాతాలో కలిపేసుకున్నారు. ఆ సిగ్గుమాలినతనం సంగతి అలా ఉంచితే, ఈ నెల మొదటి వారం నాటికి జగనన్న కాలనీల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల సంఖ్య... 18.64 లక్షలు. వాటిలో పూర్తయినవి కేవలం 5.94 లక్షలు. వీటిలోనూ రకరకాల మాయాజాలాలు, వేధింపుల పర్వాలున్నాయి. తెదేపా హయాంలో ఎన్‌టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే- జగన్‌ ఒట్టి ప్రగల్భాల రాయుడిగానే మిగిలిపోయారు.


మూడు ఆప్షన్లు... జగన్‌ పచ్చిమోసం!

‘‘లబ్ధిదారులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా, సమస్యలు లేకుండా’’ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ధర్మోపదేశాలు చేశారు జగన్‌. కానీ, పురిట్లోనే నోట్లో బియ్యంగింజ వేసి బిడ్డ ప్రాణం తీసినట్లు- లబ్ధిదారుల ఆశలను లేఅవుట్ల దశలోనే జగన్‌ కాలరాశారు. ‘జగనన్న కాలనీ’ల పేరిట కొండలు, గుట్టలు, పల్లపు ప్రాంతాల్లో లేఅవుట్లు వేయించారు. పేదలకు తామే ఇళ్లు కట్టిస్తామన్న పాత బాసలను తూచ్‌ అనేశారు. మూడు ఆప్షన్ల పేరిట లబ్ధిదారుల జీవితాలతో జగన్‌ మూడు ముక్కలాట ఆడుకున్నారు. ‘విడతల వారీగా రూ.1.80 లక్షలు ఇస్తాం.. మీ ఇల్లు మీరే కట్టుకోండి’ అంటూ చాలామంది లబ్ధిదారులను ఆయన సర్కారు బలవంతపెట్టింది. ఇంటి పనులకు ఆ డబ్బు సరిపోదన్న వారిని అధికారులు, వాలంటీర్లతో భయపెట్టించి పనులు ప్రారంభింపజేసింది. దాంతో లబ్ధిదారులు అనేకులు అప్పుల పాలయ్యారు. ఎక్కడో విసిరేసినట్లుండే కాలనీలకు నిర్మాణ సామగ్రి తరలింపు వంటివి లబ్ధిదారులకు పెనుసమస్యలయ్యాయి. ఖర్చులు పెరిగిపోయాయి.

ఉదాహరణకు నంద్యాల జిల్లా డోన్‌ దగ్గరి దొరపల్లి గుట్ట పక్కన జగనన్న కాలనీ ఒకటి ఉంది. అక్కడి వెళ్లడానికి సరైన రోడ్డే లేదు. ఇటుక, సిమెంటు వంటి వాటిని అక్కడికి తరలించడానికి వాహనదారులు జడిసిపోతుంటారు. అలాగే, భీమవరం సమీపంలోని కాలనీకి వెళ్లాలన్నా ఒళ్లు హూనం కావాల్సిందే. ఇలాంటివే ఇంకా ఎన్నో కాలనీలు... జగన్‌ను నమ్ముకుని ఇంటి నిర్మాణంలోకి దిగిన పాపానికి లబ్ధిదారుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది.


చెప్పిన దాంట్లో చేసింది ఒక శాతమే!

ఒక లక్ష రూపాయలు ఖర్చుపెట్టి లేనివారికి అన్నదానం చేద్దాం అనుకున్నారు మీరు... ఇంతలో మీ మిత్రుడెవరో వచ్చి ఓ వెయ్యి రూపాయలిచ్చి ఆ కార్యక్రమానికి వాడమన్నాడు. అతగాడే బయటికి వెళ్లి అన్నదానం అంతా తానే చేస్తున్నానని చెప్పుకొంటే ఏమంటారు? ‘థూ...’ అని మొహమ్మీద ఉమ్మేస్తారా... లేదా? జగన్‌వి కూడా అచ్చం అలాంటి పేరు కక్కుర్తి బుద్ధులే. జగనన్న కాలనీల్లో ప్రతి ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయల చొప్పున కేంద్రమే ఇస్తోంది. అవికాక గ్రామీణ లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం (ఇదీ కేంద్రానిదే) కింద ఇంకో రూ.30వేలు అందుతున్నాయి. మొత్తమ్మీద పల్లెల్లో ఇళ్ల నిర్మాణాలకు జగన్‌ పైసా ఇవ్వట్లేదు. కేంద్రం నిధులకు తోడుగా కేవలం పట్టణాల్లోనే రూ.30 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఈ వాస్తవాలను బయటికి చెప్పకుండా బీదలకోసం తాను తెగ చెమట చిందిస్తున్నట్లు దొంగ ప్రచారం చేసుకుంటున్నారు జగన్‌. ‘‘ప్రతి పేదవాడికీ ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తా’’ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ చెప్పిన మాట! సీఎం అయ్యాక చావుతెలివితేటలు చూపించి మూడు ఆప్షన్ల కుట్రకు పాల్పడ్డారు. వాటిలో ఆప్షన్‌-3 కింద 3.54 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం తరఫున ఇళ్లు కట్టించి ఇవ్వడానికి అతికష్టంగా ఒప్పుకొన్నారు. వాటిలో మొన్న జనవరి నెలాఖరు నాటికి పూర్తయిన ఇళ్లు... కేవలం 26,204. అంటే, పేదలకు పాతిక లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని మ్యానిఫెస్టోలో మాటిచ్చిన జగన్‌- చివరికి వాటిలో 1.04శాతం గృహాలను మాత్రమే నిర్మించారన్న మాట! కట్టించిన ఆ కొద్దిపాటి ఇళ్లలోనూ నాణ్యతా సమస్యలు అనేకం ఉన్నాయి. పనులు పూర్తికాక మునుపే మధ్యలోనే కుప్పకూలిపోయిన ఇళ్లూ (జంగారెడ్డిగూడెం, కావలి, రాయదుర్గం మండలం మల్లాపురం కాలనీల్లో మాదిరిగా) కనపడతాయి. నిజాలు ఇలా ఉంటే- మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేసేశామని జగన్‌ నిర్లజ్జగా పచ్చి అబద్ధాలాడుతున్నారు.


పేరు పేదలది... లాభం వైకాపాది!

‘జగనన్న కాలనీ’ల కోసం సుమారు రూ.11 వేల కోట్లు పెట్టి ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేశారు. చాలాచోట్ల భూముల రేట్లు పెంచి సర్కారుతో కొనిపించి, సంబంధిత యజమానుల నుంచి కమీషన్లు కొట్టేశారు. మంత్రి ఉష శ్రీచరణ్‌ ఇలాఖాలో బయటపడిన భూబాగోతమే ఇందుకు మచ్చుతునక. జగనన్న కాలనీలకు భూసేకరణలో అవతవకలు చేటుచేసుకున్నాయని హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి. వీటికితోడు రూ.2200 కోట్లు ఖర్చుపెట్టి చేసిన మెరక పనుల్లోనూ జగన్‌ అనుచర గణాల చేతివాటాలు భారీగా సాగాయి. దాంతో చినుకుపడితే చాలు- జగనన్న కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకుంటున్నాయి. రహదారులు, మురుగుకాల్వలు, విద్యుత్తు, తాగునీటి సదుపాయాలూ చాలాచోట్ల కరవయ్యాయి. మంత్రులతో పాటు జగన్‌ స్వయంగా సామూహిక గృహప్రవేశాలు చేయించిన కాలనీల్లోనూ ఇదే దుస్థితి తాండవిస్తోంది. దాంతో కాలనీల్లో ఇళ్లు కట్టుకోలేక, అష్టకష్టాలు పడి కట్టుకున్నా కాపురం ఉండలేక చాలామంది లబ్ధిదారులు తమ స్థలాలను అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. పేదల బాధలను అదునుగా మార్చుకుని జగన్‌ అంతేవాసులే వాటిని చేజిక్కించుకుంటున్నారు. లబ్ధిదారుల దగ్గరి నుంచి కొనుగోలు చేసిన వాటిని ఎక్కువ ధరలకు ఇతరులకు అమ్ముకుని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. అలా ఒక్క శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని జగనన్న కాలనీలోనే రూ.50 కోట్ల విలువైన స్థలాలు లబ్ధిదారుల చేతుల్లోంచి వైకాపా నేతల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి.


రాష్ట్రానికి పట్టిన ఏలిననాటి శని!

గాలి మాటలతో నవరత్నాల మాలలు అల్లడంలో జగన్‌ పండిపోయారు. అధికారులకు సూచనలు చేయడానికి రూపాయి ఖర్చు కాదు కదా... అందుకని ‘‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపడుతున్న ఇంటి నిర్మాణాల్లో ఏ చిన్న లోపానికీ తావు ఇవ్వొద్దు’’ అంటూ జగన్‌ బోలెడు ఉచిత సలహాలు ఇచ్చారు. కానీ, కాలనీలను లోపాలపుట్టలుగా మార్చి వదిలేశారు. ఇంటి నిర్మాణాలకంటూ లబ్ధిదారులను బెదిరించి పీడించి రూ.35 వేలు అదనంగా వసూలు చేయించారు. మొత్తం సొమ్మును గుత్తేదారుల చేతుల్లో పోయించారు. డబ్బులు తీసుకున్నవారు ఆపై చాలాచోట్ల అయిపూఅజా లేకుండా పోయారు. వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బంధువులు, అనుచరులు డైరెక్టర్లుగా ఉన్న రాక్రీట్‌ సంస్థకు రూ.1100 కోట్ల విలువైన ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఏకపక్షంగా కట్టబెట్టింది జగన్‌ సర్కారు. గృహనిర్మాణాలను పరుగులు తీయిస్తున్నట్లు మొదట్లో తెగ నటించిన ఆ సంస్థ- ఆపై మన్ను తిన్న పాము అయ్యింది. లబ్ధిదారుల ఆశలకు ఘోరీకట్టింది. అదే ప్రకాశ్‌రెడ్డి మొన్నామధ్య మాట్లాడుతూ- ‘‘జగనన్న ఇళ్ల నిర్మాణంతో పేదల కల నెరవేరుతోంది. పేదలను దోచుకునే అలవాటు మాకు లేదు’’ అని గంగిగోవు మొహం పెట్టారు. చేసే దారుణాలన్నీ చేసేసి, ఆపై ధర్మాత్ముల వేషాలేయడంలో జగన్‌, ఆయన భక్తులకు సాటిలేదు అనడానికి ఇదే నిదర్శనం. జగనన్న కాలనీల్లో అనర్హులకు స్థానం కల్పించడం, సామాజిక అవసరాలకు వదిలిన ఖాళీ స్థలాలను కబ్జా చేయడం... ఇలా జగన్‌ అంతేవాసులు పాల్పడని అరాచకాలు అంటూ ఏమీ లేవు. సొంతిళ్లు అంటూ పేదలను ఎండమావుల్లో వదిలేసి, వారి బతుకులను ఇంకా దుర్భరం చేశారు జగన్‌. అదే సమయంలో సొంత పార్టీ నేతల మేతలకు అపరిమిత అవకాశాలు కల్పించారు. జనాన్ని భ్రమలో ముంచి స్వప్రయోజనాలను నెరవేర్చుకున్న జగన్‌- ఒక్కమాటలో చెప్పాలంటే, రాష్ట్రానికి పట్టిన ఏలిననాటి శని!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని