ఏ నిమిషానికి ఏమి కూలునో!

అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్‌లో ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఇది. నెల అయినా కాకముందే పైకప్పు కూలిపోయింది. దీన్ని కట్టించిన గుత్తేదారు ఓ వైకాపా నాయకుడు.

Updated : 29 Feb 2024 07:09 IST

జగనన్న ఇళ్లు.. పేదల ప్రాణాలకు ముప్పు
రాష్ట్రవ్యాప్తంగా నాసిరకంగా నిర్మిస్తున్న గుత్తేదార్లు
ఇళ్లలోకి చేరకముందే కూలిపోతున్న నిర్మాణాలు

అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్‌లో ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఇది. నెల అయినా కాకముందే పైకప్పు కూలిపోయింది. దీన్ని కట్టించిన గుత్తేదారు ఓ వైకాపా నాయకుడు. ప్రభుత్వమిచ్చే రూ.1.80 లక్షలతో పాటు అదనంగా మరో రూ.1.30 లక్షల మొత్తాన్ని లబ్ధిదారుడు సొంతంగా ఇచ్చారు. స్లాబ్‌ వేస్తున్న సమయంలోనే సిమెంటు తక్కువ వాడుతుండటాన్ని గమనించి ప్రశ్నించారు. గుత్తేదారు తిరిగి వారినే గద్దించాడు. ఆ కుటుంబం శనివారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా, మంగళవారం ఉదయం ఇంటి పైకప్పు ముందుభాగం కూలిపోయింది.


ఈనాడు, అమరావతి: పనిమంతుడు పందిరేస్తే పిచ్చుక వాలగానే కూలిపోయిందట.. అలా ఉంది పేదల ఇళ్ల నిర్మాణంలో ముఖ్యమంత్రి జగన్‌ పనితనం. ఇళ్లు కాదు.. ఏకంగా ఊళ్లే కట్టేస్తున్నామంటూ జబ్బలు చరుచుకున్న ఆయన.. పేదల గృహాలను అత్యంత నాసిరకంగా కట్టిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల గృహప్రవేశాలు చేయకముందే జగనన్న ఇళ్ల పైకప్పులు కూలిపోతుండడమే అందుకు నిదర్శనం. పనులు పూర్తికాకముందే ఇళ్ల గోడలు నెర్రెలిస్తున్నాయి.. ఈ పరిస్థితుల్లో వాటిలో చేరేందుకు లబ్ధిదారులు హడలిపోతున్నారు. 2020 డిసెంబరులో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఎంతమందికైనా ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని జగన్‌ ప్రకటించారు. మూణ్నాళ్లకే ఆ మాటపై నాలుక మడతేశారు. రకరకాల కొర్రీలు వేసి ఆప్షన్‌-3 కింద లబ్ధిదార్ల సంఖ్యను 3.54 లక్షలకు కుదించారు. వాటిని కూడా తీసికట్టుగా నిర్మిస్తున్నారు. విశాఖ నుంచి పాలిస్తానంటూ రుషికొండకు గుండు కొట్టించి, రూ.430 కోట్ల వ్యయంతో ప్యాలెస్‌ కట్టుకుంటారే.. పేదలకు నాణ్యతతో ఇళ్లు కట్టించి ఇవ్వాలనే స్పృహ లేకపోతే ఎలా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

ఇసుక ఎక్కువ.. సిమెంటు తక్కువ

ఇంటి నిర్మాణంలో ఇసుక, సిమెంటును తగు పాళ్లలో కలపాలి. జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల్లో డబ్బు మిగుల్చుకునేందుకు గుత్తేదార్లు సిమెంటు తక్కువ, ఇసుక ఎక్కువగా కలుపుతున్నారు. పునాదులు నిర్దేశించిన మేర తీయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇటుకల మధ్య సిమెంటును అరకొరగా పూడ్చుతున్నారు. దీంతో గోడలు బీటలు వారుతున్నాయి. సిమెంటు ఇటుకలను సైతం గుత్తేదార్లు నాసిరకంగా తయారు చేస్తున్నారు. గట్టితనానికి క్యూరింగ్‌ చాలా ముఖ్యమైంది. దాన్ని కూడా మమ అనిపిస్తున్నారు. పైకి ఇవేమీ కనిపించకుండా వైకాపా రంగులు వేస్తున్నారు.


35 బస్తాల సిమెంట్‌తో ఇంటి నిర్మాణమా?

జగనన్న ఇంటికి 90 బస్తాల సిమెంటును ప్రభుత్వం ఇస్తోంది. కానీ నెల్లూరు పరిధిలోని వెంకటేశ్వరపురం లేఅవుట్‌లో నిర్మిస్తున్న వాటికి 35 బస్తాలు చొప్పున మాత్రమే వాడుతున్నారు. ఇక్కడ గుత్తేదారు పిచ్చుక గూళ్ల మాదిరిగా ఇళ్లు కట్టారు. మూడు నెలల కిందట సామూహిక గృహప్రవేశాలు చేయించారు. లబ్ధిదారులు ఇళ్ల లోపలకి వెళ్లి చూస్తే ఫ్లోరింగ్‌ లేదు. సిమెంట్‌ ప్లాస్టింగ్‌ చేయలేదు. ఇప్పటికీ ఆ ఇళ్లలో ఒక్కటంటే ఒక్క కుటుంబం చేరలేదు. దాదాపు ఈ జిల్లా పరిధిలోని అక్కచెరువుపాడు, కొండ్లపూడి, కావలిలోని మెగా లేఅవుట్‌, బుచ్చిరెడ్డిపాలెం లేఅవుట్‌లో చేపట్టేవన్నీ నాసిరకం నిర్మాణాలే. నాణ్యత లోపాలపై అధికారులు నివేదిక సిద్ధం చేసినా, ఓ గుత్తేదారు మంత్రాంగంతో అది బయటకు రాలేదు.


సిమెంటులో బూడిద కలిపి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస వద్ద లేఅవుట్‌లో గుత్తేదారులు సిమెంటులో బూడిద కలిపి నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. వర్షాలు పడితే ఒక్క ఇల్లు కూడా మిగలదని, కూలిపోయే ప్రమాదం ఉందని తాపీమేస్త్రీలే చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 1,000 గృహాల్ని కడుతున్నారు.


పునాది.. నాణ్యతకు సమాధి

అనంతపురం ప్రజలకు నగరం సమీపంలోని ఆలమూరు, బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇక్కడ రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బంధువుకు చెందిన గుత్తేదారు సంస్థ రాక్రీట్‌ ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతోంది. ఆలమూరులో కట్టిన ఇళ్లు నాసిరకంగా ఉన్నాయని లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. సిద్ధరాంపురం లేఅవుట్‌లో పునాదుల నిర్మాణం తీసికట్టుగా ఉంది. ఇక్కడే కాదు.. విశాఖ, విజయనగరం జిల్లా గుంకలాం లేఅవుట్‌, ప్రకాశం జిల్లా మార్కాపురం, పొదిలి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, చంద్రగిరి పరిధిలోని లేఅవుట్లలో గుత్తేదార్లు కట్టిస్తున్న ఇళ్ల నిర్మాణాల నాణ్యత అత్యంత దారుణంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని