తుపాను బాధిత రైతులకు సాయం విదల్చని సర్కారు

గతేడాది డిసెంబరులో వచ్చిన మిగ్‌జాం తుపాను ప్రభావంతో రైతులు పెద్దఎత్తున నష్టపోయినా వారికి ఇప్పటి వరకు సాయం ఊసే లేదు.

Updated : 29 Feb 2024 06:04 IST

అదే విపత్తులో దెబ్బతిన్న రోడ్లకు రూ.348 కోట్లు
ఎన్నికలొస్తున్నాయని రోడ్ల పనులకు హడావుడిగా నిధులు

ఈనాడు, అమరావతి: గతేడాది డిసెంబరులో వచ్చిన మిగ్‌జాం తుపాను ప్రభావంతో రైతులు పెద్దఎత్తున నష్టపోయినా వారికి ఇప్పటి వరకు సాయం ఊసే లేదు. రైతు భరోసా, సున్నా వడ్డీ పంటరుణాల రాయితీని బుధవారం విడుదల చేసినా.. తుపాను నష్టానికి పెట్టుబడి రాయితీ మాత్రం జమ చేయలేదు. సంక్రాంతి నాటికే రైతులకు పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామన్న  హామీని ముఖ్యమంత్రి జగన్‌ పక్కన పెట్టేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లు తిరగబడతారేమోనన్న భయంతో రహదారుల మరమ్మతులకు మాత్రం రూ.వందల కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చేస్తున్నారు.

  • తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ పరిధిలో ఉన్న క్లిష్టమైన రహదారుల పనులకు రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధి నుంచి రూ.879.79 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ ఉత్తర్వులిచ్చారు. విడుదల చేసిన మొత్తంలో రహదారులు, భవనాలశాఖ పరిధిలో పనులకు రూ.768.39 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని వాటికి రూ.106.40 కోట్లు కేటాయించారు.
  • మిగ్‌జాం తుపాను కారణంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.120.68 కోట్లు మంజూరు చేశారు. 2023 డిసెంబరులో భారీ వర్షాలు, తుపాను కారణంగా దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.226.87 కోట్లు మంజూరు చేస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని