ఏపీ నుంచి ఇసుక తెచ్చిన 17 లారీల పర్మిట్ల రద్దు!

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భద్రాచలం సమీపంలో 17 లారీలు పట్టబడిన వ్యవహారంపై తెలంగాణ రవాణాశాఖ కఠినంగా వ్యవహరించింది.

Updated : 29 Feb 2024 09:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భద్రాచలం సమీపంలో 17 లారీలు పట్టబడిన వ్యవహారంపై తెలంగాణ రవాణాశాఖ కఠినంగా వ్యవహరించింది. లారీల పర్మిట్లను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఈ నెల 13వ తేదీన ఏపీ నుంచి అనుమతులు లేకుండా ఇసుకతో వస్తున్న లారీలను టీఎస్‌ఎండీసీ, మైనింగ్‌ శాఖ అధికారులు పట్టుకుని బూర్గంపహాడ్‌ పోలీసులకు అప్పగించారు. గనులశాఖ ఒక్కో లారీకి దాదాపు రూ.1.30 లక్షల చొప్పున జరిమానా విధించింది. ఆయా లారీల్లో ఇసుక పరిమితికి మించి ఉండటంతో రవాణాశాఖ తాజా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఆ లారీలను ఇప్పటివరకు యజమానులకు అప్పగించలేదంటూ లారీ యజమానుల సంఘం నేతలు బుధవారం రవాణాశాఖ ఉన్నతాధికారుల్ని కలిశారు. లారీల పర్మిట్లు మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు వారికి చెప్పినట్టు తెలిసింది. అనంతరం లారీ యజమానుల సంక్షేమ సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఏపీలోని కర్నూలుకు ఇసుక రవాణా చేసేందుకు అధికారులు బిల్లులు ఇచ్చారు. రాష్ట్రం మీదుగా వెళ్లేందుకు అవసరమైన రుసుము చెల్లించకపోవడమే లారీ యజమానులు చేసిన పొరపాటు. మొదటి తప్పుగా భావించి లారీలను విడుదల చేయాలి’ అని ప్రభుతాన్ని, రవాణాశాఖ కమిషనర్‌ను సంఘం కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని