బార్‌ కౌన్సిల్‌ నిధుల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్‌.. కొట్టివేసిన ధర్మాసనం

ఏపీ బార్‌ కౌన్సిల్‌లో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణతో విచారణను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Updated : 29 Feb 2024 05:57 IST

ఈనాడు, అమరావతి: ఏపీ బార్‌ కౌన్సిల్‌లో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణతో విచారణను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. వాట్సప్‌లో వచ్చిన సమాచారం ఆధారంగా పిల్‌ వేయడంపై అభ్యంతరం తెలిపింది. పిల్‌ దాఖలు చేసిన న్యాయవాది ఎం.వెంకట బాలిరెడ్డికి రూ.50 వేల ఖర్చులు విధిస్తున్నామని తెలిపింది. తాను ట్రయల్‌ కోర్టు న్యాయవాదినని, సొమ్మును చెల్లించలేనని ఆయన అభ్యర్థించడంతో ధర్మాసనం ఖర్చుల విధింపును తొలగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. బార్‌ కౌన్సిల్‌ స్టాంపుల వ్యవహారంలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ న్యాయవాది ఎం.వెంకట బాలిరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసి వాదనలు వినిపించారు. బార్‌ కౌన్సిల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. బార్‌ కౌన్సిల్‌ రూ.100 విలువైన స్టాంపులను ముద్రిస్తుందన్నారు. ఇందులో రూ.86 బార్‌ కౌన్సిల్‌కు, మిగిలిన సొమ్ము గుమస్తాల సంక్షేమ సంఘం, హైకోర్టు న్యాయవాదుల సంఘానికి వెళుతుందన్నారు. మొతం రూ.100 బార్‌ కౌన్సిల్‌కు చెందుతాయన్న కోణంలో పిటిషనర్‌ లెక్కలు కట్టి నిధుల దుర్వినియోగం జరిగిందని అభిప్రాయపడ్డారన్నారు. దీంతో పిల్‌ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని