పోర్టు రాసిచ్చేస్తారా? జైలుకు వెళతారా?

దోపిడీ మనస్తత్వం, ఫ్యాక్షనిజానికి రాజ్యాధికారం తోడైతే పర్యవసానాలు అతి దారుణంగా ఉంటాయి. రాష్ట్రంలో 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక కాకినాడలోని డీప్‌ వాటర్‌ పోర్టు నిర్వహణ బాధ్యత చేతులు మారిన తీరే ఇందుకు నిదర్శనం.

Updated : 01 Mar 2024 13:07 IST

కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టుపై జగన్‌ ప్రభుత్వ దుర్మార్గం
పోర్టు నిర్వహణ సంస్థ మెడపై గొడ్డలి పెట్టి సింహభాగం వాటా హస్తగతం
ప్రతిగా చెల్లించింది రూ.494 కోట్లే
ఇది మార్కెట్‌ ధరకంటే రూ.1178 కోట్లు తక్కువ
అధికార దందాతో భారీగా లబ్ధి పొందిన ‘అరో ఇన్‌ఫ్రా’
అది విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ కంపెనీ
జే గ్యాంగ్‌ దోపిడీపై ‘ఈనాడు-ఈటీవీ’ పరిశోధనాత్మక కథనం
ఎన్‌.విశ్వప్రసాద్‌, ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

అమ్మితే కొనుక్కోవడం... వ్యాపారం!
మెడపై కత్తి పెట్టి లాక్కోవడం... దౌర్జన్యం!
మొదటిది వాణిజ్య వృత్తి!
రెండోది నేర ప్రవృత్తి!
అధికారం అండతో అక్రమార్జనకు మరిగిన జే బ్యాచ్‌ రెండోరకంలో ఆరితేరింది!  
కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు నిర్వహణ సంస్థను కారుచౌకగా కొట్టేసింది!
మొదట యంత్రాంగాన్ని ఉసిగొల్పింది... తప్పులంటూ తడికెలు కట్టింది...
శిక్షలంటూ భయపెట్టింది... ఆనక మంత్రాంగానికి తెర లేపింది...
చెప్పింది చేయాలంది... తోచింది ఇస్తామంది...
లేదంటే జైల్లోకి తోస్తామంది... అలా ఉక్కిరిబిక్కిరి చేసి...

రూ.1670 కోట్లకుపైగా విలువైన వాటాను రూ.494 కోట్లకే కొట్టేసింది!

అంతకుముందు ఎత్తిచూపిన తప్పులన్నీ తూచ్‌ అనేసింది! చేతికి మట్టి అంటకుండా... మామూలు మనిషి ఊహకు అందకుండా... జే గ్యాంగ్‌ సాగించే అవినీతికి... నిలువెత్తు నిదర్శనం కాకినాడ డీప్‌ పోర్టు నిర్వహణ కంపెనీ యాజమాన్య బదిలీ వ్యవహారం! వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ భారీ దోపిడీ, ఇందుకు జగన్‌ అధికారాన్ని దుర్వినియోగం చేసిన తీరుపై ‘ఈనాడు-ఈటీవీ’ పరిశోధనాత్మక కథనం...

దోపిడీ మనస్తత్వం, ఫ్యాక్షనిజానికి రాజ్యాధికారం తోడైతే పర్యవసానాలు అతి దారుణంగా ఉంటాయి. రాష్ట్రంలో 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక కాకినాడలోని డీప్‌ వాటర్‌ పోర్టు నిర్వహణ బాధ్యత చేతులు మారిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక వైకాపా అగ్ర నాయకత్వం అధికారబలంతో అమలు చేసిన ఒక ముఖ్యమైన ప్రణాళిక ఏమిటో తెలుసా...? పోర్టును నిర్వహిస్తున్న కంపెనీలోని సింహభాగం వాటాను చేజిక్కించుకోవడానికి వీలైన భూమికను సిద్ధం చేయడమే. అందులో భాగంగా కంపెనీ యాజమాన్యాన్ని లొంగదీసుకునేందుకు తమకు అత్యంత ప్రావీణ్యమున్న ఫ్యాక్షనిస్టు పద్ధతులను ప్రయోగించారు. వారి ముందు రెండు మార్గాలను ఉంచారు. వాటిలో ఏదో ఒకదాన్ని తక్షణమే ఎంచుకోవాల్సిందేనంటూ మెడపై గొడ్డలి పెట్టారు. అవేంటంటే...

1. కంపెనీ నిర్వహణలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఒప్పుకొని, కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లేందుకు సిద్ధపడాలి.
2. కంపెనీకి సంబంధించిన ప్రధాన వాటాను సీఎం జగన్‌, వైకాపా నేత విజయసాయిరెడ్డిలకు అత్యంత సన్నిహితమైన ‘అరో ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (ఇంతకుముందు దీని పేరు అరబిందో రియాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’)కు అప్పగించాలి.

ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి గురించి బాగా తెలిసిన బాధితులు, వారిని ఎదుర్కొనడం తమ శక్తికి మించిన వ్యవహారంగా భావించి... పోర్టులో వాటాను బదిలీ చేసి, మౌనంగా పక్కకు జరిగారు. వైకాపా పెద్దలు... కంపెనీలోని రూ.1,672 కోట్ల విలువైన 41.12% వాటాను రాయించుకుని, ప్రతిగా రూ.494 కోట్లను మాత్రమే చెల్లించారు. ఈ వ్యవహారంలో బాధితులు తమ వాటాను మార్కెట్‌ రేటు కంటే రూ.1,178 కోట్ల తక్కువకే వదులుకోవాల్సి వచ్చిందంటే దోపిడీ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

జగన్‌ సీఎం అయ్యే నాటికి ఇదీ పూర్వరంగం

కాకినాడలో తాను నిర్మించిన డీప్‌వాటర్‌ పోర్టు నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1999లో ప్రైవేటుపరం చేసింది. అప్పుడు తెదేపా అధికారంలో ఉంది. ఏడీబీ (ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు) నుంచి తీసుకున్న రూ.246 కోట్ల రుణంతో కలిపి మొత్తం రూ.321 కోట్లను ఖర్చు పెట్టి పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మూడు బెర్తులను నిర్మించింది. నాలుగో బెర్తును నిర్మించడంతోపాటు పోర్టు అభివృద్ధికి అదనంగా రూ.395 కోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడి పెట్టాలనే షరతుతో దాని నిర్వహణ కోసం సింగపూర్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్‌ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌ ’అనే సంస్థను ఎంపిక చేసింది. ఈ మేరకు 1999 మార్చి 19న రాయితీల ఒప్పందం కుదిరింది. పోర్టు అభివృద్ధి, నిర్వహణకు సింగపూర్‌ కంపెనీ ‘కోకనాడ పోర్టు కంపెనీ’ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. తర్వాత 2001లో దాని పేరు కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌)గా మారింది. రాయితీల ఒప్పందానికి కొన్ని మార్పులు చేస్తూ 2003 ఆగస్టులో తొలి అనుబంధ ఒప్పందం జరిగింది.

వైఎస్‌ హయాంలో మరిన్ని మార్పులు

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ నాయకత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం... పోర్టు నిర్వహణ సంస్థకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ 2009 జనవరి 12న ఉత్తర్వులిచ్చింది. దీనికి అనుగుణంగా రెండో అనుబంధ ఒప్పందాన్ని అదేనెల 28న పోర్టు నిర్వహణ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నాయి. ఈ అదనపు రాయితీలపై కాగ్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం ప్రజాపద్దుల సంఘం(2018-19) కూడా దీనిపై పరిశీలించింది. తన నివేదికను 2019 ఫిబ్రవరి 6న ఏపీ శాసనసభకు సమర్పించింది. అందులో...

  • తొలి ఒప్పందం అమలులో ఉండే కాలం 20 ఏళ్లు. అది పూర్తయ్యాక ఒక్కోసారి అయిదేళ్ల చొప్పున రెండుసార్లు గడువును పొడిగించుకోవచ్చు. అంటే ఒప్పందం గరిష్ఠంగా అమలయ్యే కాలం 30 ఏళ్లు మాత్రమే. తర్వాత పోర్టు మళ్లీ ప్రభుత్వ పరం కావాలి. 2009లో చేసిన మార్పుల తర్వాత తొలి గడువు 30 సంవత్సరాలకు పెరిగింది. ఆ తర్వాత ఒక్కోసారి పదేళ్ల చొప్పున రెండుసార్లు మళ్లీ వ్యవధిని పెంచుకునే వీలు కల్పించారు. అంటే కంపెనీకి హక్కులను 50 ఏళ్లకు పెంచారని ఎత్తిచూపింది.
  • స్థూల ఆదాయంలో ఏటా 22% లేదా మినిమం గ్యారంటీ ఎమౌంట్‌లలో ఏది ఎక్కువైతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పోర్టు నిర్వహణ కంపెనీ చెల్లించాలని తొలి ఒప్పందంలో ఉండగా... ప్రభుత్వ రాబడికి నష్టం కలిగించేలా 2009లో ఈ మినిమం గ్యారంటీ ఎమౌంట్‌ నిబంధనను తీసివేశారని ఆక్షేపించింది.
  • ఇక నాలుగు బెర్తులకు అదనంగా మరోటి నిర్మించాలనుకుంటే... ఆ బాధ్యతను ఏదైనా ప్రైవేటు పార్టీకి అప్పగించడానికి ఉన్న అధికారాన్ని 2009లో చేసిన మార్పుల కారణంగా ప్రభుత్వం కోల్పోయింది. ఇది పోర్టు నిర్వహణపై ఏకఛత్రాధిపత్యానికి దారి తీస్తుందని నివేదిక హెచ్చరించింది. నివేదిక సమర్పించేనాటికే ఎన్నికలకు గడువు దగ్గరపడింది. ఎన్నికల్లో వైకాపా గెలిచి, జగన్‌ సీఎం అయ్యారు.

కేఎస్‌పీఎల్‌ చుట్టూ అష్ట దిగ్బంధనం

అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు నిర్వహణను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి వైకాపా పెద్దలు... భారీ కుట్రకు తెర తీశారు. కంపెనీ యాజమాన్యం తమకు, తాము ఆదేశించిన పద్ధతిలోనే వాటాలను స్వయంగా బదలాయించేలా చేసేందుకు ‘తమదైన శైలి’లో రెండు దశల ప్రణాళికను అమలుచేశారు.

  • మొదటి దశ: పోర్టుకు సంబంధించి 2014-19 కాలంలో జరిగిన అన్ని వ్యవహారాలపై ప్రత్యేక ఆడిట్‌ జరపాలని నిర్ణయించి, రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబరులో ‘పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్‌పీ’ అనే సంస్థకు బాధ్యతలను అప్పగించింది. పోర్టు కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ‘రాయితీల ఒప్పందం’లో పేర్కొన్న మేరకు వాటాలను చెల్లించారా? లేదా? అనే విషయమై ప్రధానంగా ఈ ఆడిట్‌ పనిని అప్పగించారు. ఆడిట్‌ సంస్థ 2020 మార్చిలో 25 పేరాలతో కూడిన నివేదికను అందించింది. పోర్టుకొచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి దక్కాల్సిన వాటాను తగ్గించేందుకు, రాబడిని పక్కదారిలో మళ్లించేందుకు యాజమాన్యం అనేక పద్ధతులను అనుసరించిందని, తద్వారా 2014-19 సంవత్సరాల మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.965.65 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చింది. అనంతరం ప్రభుత్వ పెద్దల నుంచి యాజమాన్యానికి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. క్రిమినల్‌ కేసులు పెట్టి, జైలుకు పంపించి, ఆస్తులను జప్తు చేయమంటారా? లేదా కంపెనీలో వాటాను మేం చెప్పిన విలువకు మాకు ఇచ్చేస్తారా అనేది వాటి సారాంశం.
  • రెండోదశ: పోర్టు వ్యవహారాలపై ఆడిట్‌ చేసే పరిధిని విస్తరిస్తూ 2020 ఏప్రిల్‌ 1న రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది. అంతకుముందు 2014-15 నుంచి 2018-19 వరకు ఉన్న వ్యవధిపై ఆడిట్‌ చేయాలని నిర్దేశించగా... కొత్త మెమో ద్వారా 1999 మార్చి నుంచి 2013-14 వరకు, అలాగే 2019-20కి సంబంధించిన వ్యవహారాలనూ పరిశీలించాలంది. అంటే మరో పదిహేనేళ్లకు సంబంధించిన వ్యవహారాలపైనా పరిశీలనకు ఆదేశించింది. అంతేకాకుండా... విచారించే అంశాలనూ పెంచింది. సీపోర్ట్స్‌ కంపెనీకి మొత్తం ఎన్ని రుణాలు ఉన్నాయి? వాటిలో పోర్టు అభివృద్ధికి ఎన్ని ఖర్చు పెట్టారు? ఇతర కంపెనీలకు ఏమైనా మళ్లించారా? వంటి అంశాలను జోడించింది. పోర్టు భూములు, ఇతర ఆస్తులను ఏమైనా తాకట్టు పెట్టారా? ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? అనే కోణంలోనూ అధ్యయనం చేయాలంది.
  • వైఎస్‌ హయాం నాటి ‘2009 రాయితీల ఒప్పందం’లో గడువును పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తే... కంపెనీకి ఎలాంటి పరిహారం చెల్లించకుండానే పోర్టును 2019లోనే ప్రభుత్వం వెనక్కి తీసుకోగలదంటూ యాజమాన్యాన్ని భయాందోళనకు గురిచేసినట్లు కూడా తెలిసింది.

...ఈ ఒత్తిడిని తట్టుకోలేమని, ప్రభుత్వాన్ని ఎదిరించి మనుగడ సాగించడం అసాధ్యమని అర్థం చేసుకున్న బాధితులు లొంగిపోయారు. కంపెనీలో తమకున్న సింహభాగం వాటాను ప్రభుత్వ పెద్దలు చెప్పిన సంస్థకు... వారు ఎంత డబ్బు ఇస్తే అంతే తీసుకుని బదలాయించేందుకు ఒప్పుకొన్నారు.

ఈ కంపెనీలో ఎక్కువ వాటాలున్న కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌... పోర్టు నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. దీని అధినేత కె.వి.రావు. సీపోర్ట్స్‌ కంపెనీకి ఆయన ఎండీగానూ ఉన్నారు. ప్రభుత్వ దెబ్బకు ఆ కంపెనీ లొంగిపోయింది. సీపోర్ట్స్‌ కంపెనీలో కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఉన్న 41.12 శాతం వాటాలను అరబిందో రియాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ‘అమ్మేందుకు’ నిర్ణయించుకున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కంపెనీ నుంచి 2020 డిసెంబరు 5న ప్రభుత్వానికి లేఖ వెళ్లింది. అప్పటికే సిద్ధంగా ఉన్న ఏపీ మారిటైం బోర్డు వాటాలను ‘అమ్ముకునేందుకు’ కంపెనీ చేసిన ‘విజ్ఞప్తి’ని ఆమోదించవచ్చని రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖకు ఆఘమేఘాల మీద పదో తేదీన సిఫారసు చేసింది. ఆమేరకు ఆశాఖ అదేనెల 24న జీవోను విడుదల చేసింది. ఫలితంగా సీపోర్ట్స్‌ కంపెనీలో కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కున్న 41.12% వాటాలు 2021 ఫిబ్రవరిలో అరబిందో కంపెనీకి కారుచౌకగా దఖలు పడ్డాయి.

వాటాలు చేజిక్కగానే యూటర్న్‌

పోర్టు కంపెనీని చేజిక్కించుకోగానే... దాని చుట్టూ తాము అల్లిన అష్టదిగ్బంధనాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తొలగించారు. పోర్టు కార్యకలాపాలపై ఆడిట్‌ సంస్థ ఇచ్చిన నివేదికలో ప్రధానంగా పేర్కొన్న అంశాలపై కంపెనీ తరఫున ఇద్దరు న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. నివేదిక ఎత్తిచూపిన అంశాలను పలుచన చేసేలా వారు సూచనలు చేశారు. నివేదికపై వాదనలు వినిపించేలా ఆడిట్‌ సంస్థకు కంపెనీ నుంచి లేఖ రాయించారు. దానిపై ఆడిట్‌ సంస్థ కూడా కీలక అంశాలపై కంపెనీ వాదనలకు సానుకూలమైన రీతిలో సిఫారసులు చేస్తూ ఏపీఐఐసీకి లేఖ రాసింది. దాంతో ఆడిట్‌ సంస్థ నివేదికలో పేర్కొన్న 25 పేరాలకు 21 పేరాలలో పేర్కొన్న అంశాలన్నిటినీ ఏపీ మారిటైం బోర్డు సిఫారసు మేరకు తొలగిస్తున్నట్లు ప్రభుత్వం 2023 జులై 12న ఒక మెమోను జారీ చేసింది. మిగతా నాలుగు పేరాలలో పేర్కొన్న అంశాలకు సంబంధించి.. ప్రభుత్వానికి వాటిల్లిన రూ.9.03 కోట్ల నష్టాన్ని 2018 ఏప్రిల్‌ ఒకటి నుంచి ఎస్‌బీఐ రేటు ప్రకారం వడ్డీని కలిపి చెల్లించాలంది.

...అంటే పోర్టు కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించడానికి ముందుగా దానివల్ల ప్రభుత్వానికి రూ.965.65 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పి... తాము అనుకున్నది సాధించాక ఆ నష్టాన్ని రూ.9.03 కోట్లు కుదించారన్నమాట. ఇదంతా తమ స్వప్రయోజనం కోసమే చేశారన్నమాట. తమ స్వార్థం కోసం అధికారాన్ని దారుణంగా దుర్వినియోగం చేశారన్నమాట. జగన్మాయ అంటే ఇదే మరి.


జగన్‌ సీఎం అయ్యాక ‘అరో ఇన్‌ఫ్రా’ విజృంభణ

పీలో 2019లో అధికారం చేపట్టాక వైకాపా పెద్దలు అనేక పెద్ద ప్రాజెక్టులు ‘అరో ఇన్‌ఫ్రా’కు వెళ్లేలా చూస్తున్నారు. కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టుతోపాటు కాకినాడ సెజ్‌ కూడా ఈ కంపెనీకే వెళ్లింది. వైకాపా పార్లమెంటరీ పార్టీ అధినేత వి.విజయసాయిరెడ్డి అల్లుడు పి.రోహిత్‌రెడ్డి కుటుంబ సంస్థ ఇది. ఆయన కుటుంబానికి చెందిన ఆర్‌పీఆర్‌ సన్స్‌ అడ్వయిజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పి.సుశీలారాణికి కలిపి కంపెనీలో 82.26% వాటాలున్నాయి. ఆర్‌పీఆర్‌ సన్స్‌ అడ్వయిజర్స్‌ సంస్థలో రోహిత్‌రెడ్డి డైరెక్టర్‌ కూడా.


వాటాలు మారిన తీరు దారుణం

పోర్టు నిర్వహణ కంపెనీలో వాటాలు చేతులు మారిన తీరు చాలా దారుణంగా ఉందని, ప్రభుత్వ నిర్ణయాల్లో ఎక్కడా హేతుబద్ధత కనిపించడం లేదని ఈ విషయంపై అవగాహన ఉన్న పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఉన్న పోర్టుకు సంబంధించిన ప్రధాన వాటాను సంబంధిత కంపెనీ అప్పటికి పోర్టుల నిర్వహణలో అనుభవం లేని మరో సంస్థకు విక్రయించడానికి ప్రభుత్వం అనుమతించకూడదని వారు స్పష్టంచేశారు. ఇక ఇద్దరు న్యాయనిపుణుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను ప్రభుత్వానికి కంపెనీ సమర్పించింది. కానీ వాటిపై న్యాయశాఖ, అడ్వొకేట్‌ జనరల్‌ల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోలేదు.


పోర్టు అసలు విలువ ఎంతో ఎక్కువ

కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో సీపోర్ట్స్‌ సంస్థ 2011-12 నాటికే బెర్తులను ఆరుకు పెంచింది. ఈ సంస్థ 2020-21లో రూ.651.87 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఎబిటా (వడ్డీ, పన్నులు, తరుగుదల, అప్పు వాయిదాల చెల్లింపునకు ముందు ఆదాయం) రూ.406.81 కోట్లుగా చూపింది. సాధారణ ప్రమాణాల ప్రకారం... నిర్వహణ కంపెనీ ఎబిటాకు కనీసం పదిరెట్ల మొత్తాన్ని ఎంటర్‌ప్రైజ్‌ విలువ (సంస్థ విలువ)గా పరిగణిస్తారు. ఈ లెక్కన కంపెనీ విలువ రూ.4,068 కోట్లు అవుతుంది. దీని ప్రకారం పెద్దల సంస్థ తీసుకున్న 41.12% వాటాల విలువ రూ.1,672 కోట్లు. అంటే ప్రభుత్వ పెద్దలు తమ అధికార గుండాయిజంతో కేవలం రూ.494 కోట్లు ఇచ్చి... ఏకంగా రూ.4,068 కోట్ల విలువైన పోర్టును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారన్నమాట. ప్రస్తుతం కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌... అరో ఇన్‌ఫ్రా రికార్డుల్లో అసోసియేట్‌ కంపెనీగా మారిపోయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని