ప్రత్తిపాటిపై కత్తికట్టారు!

రాష్ట్ర మాజీమంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌బాబును పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 01 Mar 2024 06:56 IST

మాజీమంత్రి కుమారుడు శరత్‌ అరెస్టు
జీఎస్టీ ఎగవేశారంటూ ఆరోపణలు
పుల్లారావు సతీమణి సహా  ఏడుగురిపై కేసు
కేంద్ర ఏజెన్సీ నోటీసు ఇస్తే..  జగన్‌ సర్కారు దూకుడు
ఎన్నికల వేళ ఇదో కుట్ర: తెదేపా ఆరోపణ

ఈనాడు - అమరావతి: రాష్ట్ర మాజీమంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌బాబును పోలీసులు అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేతకు, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లారావు భార్య, కుమారుడు, బావమరిది సహా ఏడుగురిపై విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున శరత్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత విజయవాడ తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన డీజీడీఐ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌).. అవెక్సా కార్పొరేషన్‌లో తనిఖీలు చేసి, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంటూ రూ. 16 కోట్లు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని 2022 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. ఆ సమయంలో అవెక్సా కార్పొరేషన్‌ తరఫున ఏపీలోని విజయనగరంలో ఏర్పాటైన బ్రాంచి ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

కేంద్రం జారీ చేసిన నోటీసు ఆధారంగా రాష్ట్రంలోనూ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రూపంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ విచారణ నిర్వహించాలని మాచవరం పోలీసులకు రాష్ట్ర డీఆర్‌ఐ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కేంద్ర సంస్థ జారీ చేసిన నోటీసును జతచేశారు. కేంద్ర సంస్థ విచారణ జరుపుతుండగానే రాష్ట్ర అధికారులు దూకుడుగా వ్యవహరించి అరెస్టు వరకు వెళ్లడం ప్రభుత్వ రాజకీయ కుట్రను స్పష్టం చేస్తోందని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. సంస్థకు అదనపు డైరెక్టర్‌గా పట్టుమని రెండు నెలలు కూడా లేని శరత్‌ను ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరెస్టు చేయడం ప్రభుత్వ దూకుడును స్పష్టం చేస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్న సంస్థతో ఎటువంటి సంబంధం లేని శరత్‌ను అరెస్టు చేయడంతో జగన్‌ ప్రభుత్వ తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. పుల్లారావు కుమారుడు శరత్‌ను గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ విమానాశ్రయం బయట అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా దుమారాన్ని రేపాయి.

అదనపు డైరెక్టరుగా 66 రోజులే..

నిర్మాణ పనులకు సంబంధించి బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ నుంచి అవెక్సా కార్పొరేషన్‌ సబ్‌కాంట్రాక్టులు పొందింది. 2017లో రాజధాని అమరావతిలోని సీడ్‌ యాక్సెస్‌ ఎన్‌ 9 (ఉద్దండరాయునిపాలెం నుంచి నిడమర్రు) రోడ్డు నిర్మాణ పనులను తీసుకుంది. దీంతో పాటు టాటా ప్రాజెక్టు నుంచి ఏపీ టిడ్కో ప్రాజెక్టు పనులు, ఎన్‌సీసీ లిమిటెడ్‌ నుంచి మిడ్‌ పెన్నా దక్షిణ కాలువ (అనంతపురం), సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ నుంచి 800 హుద్‌హుద్‌ ఇళ్ల నిర్మాణం పనులు తీసుకుని చేపట్టింది. ఈ క్రమంలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ అక్రమంగా లబ్ధి పొందినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అవెక్సా కార్పొరేషన్‌కు శరత్‌ 2019 డిసెంబరు 9 నుంచి 2020 ఫిబ్రవరి 14 వరకు అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో జీఎస్టీ ఎగవేత జరిగిందన్న ఆరోపణలపై మాచవరం పోలీసుస్టేషన్‌లో ఫిబ్రవరి 25న కేసు నమోదైంది.

పుల్లారావు కుమారుడు శరత్‌తో పాటు కుర్రా జోగేశ్వరరావు (డైరెక్టర్‌), బొగ్గవరపు నాగమణి (అదనపు డైరెక్టర్‌), పుల్లారావు భార్య ప్రత్తిపాటి వెంకాయమ్మ (డైరెక్టర్‌), బొగ్గవరపు అంకమరావు (డైరెక్టర్‌), బొగ్గవరపు మార్కండేయులు (డైరెక్టర్‌), పి.భీమరాజు (అదనపు డైరెక్టర్‌)లను నిందితులుగా చేర్చారు. వీరిలో జోగేశ్వరరావు, నాగమణి మాత్రమే ప్రస్తుతం అవెక్సా సంస్థకు డైరెక్టర్‌, అదనపు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన వారందరికీ ప్రస్తుతం సంస్థతో ఎటువంటి సంబంధాలు లేకపోవడం గమనార్హం. 2009, 2011, 2015, 2019, 2020 సంవత్సరాల నుంచి వీరందరూ ఒక్కొక్కరుగా వైదొలిగారు. నిందితుల జాబితాలో పేర్కొన్న మార్కండేయులు కొన్నేళ్ల కిందటే మరణించారు.

దిల్లీ నుంచే శరత్‌ వేట మొదలు

హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు శరత్‌బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ తీసుకువచ్చారు. ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకు విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతి రాణా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు దిల్లీ, హైదరాబాద్‌లలో మకాం వేశాయి. ఓ బృందం శరత్‌ను దిల్లీ నుంచే అనుసరించింది. ఆయన కదలికలను గమనిస్తూ హైదరాబాద్‌లోని బృందాన్ని అప్రమత్తం చేసింది. హైదరాబాద్‌కు విమానంలో వస్తున్నట్లు చెప్పడంతో.. ఓ బృందం శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద కాపు కాసింది. బయటకు రాగానే అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చింది. శరత్‌ను విజయవాడలో పలుచోట్లకు మారుస్తూ విచారణ చేపట్టారు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం, కమాండ్‌ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వన్‌టౌన్‌లో కరుడుగట్టిన నేరస్థులను విచారించే సీసీఎస్‌ ఇంటరాగేషన్‌ సెల్‌కు తరలించారు. శరత్‌ ఆచూకీ తెలియక పుల్లారావుతో పాటు, తెదేపా నేతలు ఆందోళన చెందారు.

కన్నీటిపర్యంతమైన పుల్లారావు

కుమారుడి అరెస్టు ఉదంతంపై ప్రత్తిపాటి పుల్లారావు కన్నీటిపర్యంతమయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయన విజయవాడలోని జిల్లా తెదేపా కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఉన్న నేతలు గద్దె రామ్మోహన్‌, పట్టాభి, దేవినేని ఉమా, తదితరులను చూసి పుల్లారావు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడిపై అక్రమంగా కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను నేతలు ఓదార్చి ధైర్యం చెప్పారు. శరత్‌ అరెస్టును తెదేపా నేతలు  నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమామహేశ్వరరావు ఖండించారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని పేర్కొన్నారు.

బోగస్‌ బిల్లులంటూ ఆరోపణలు

విజయవాడ పోలీసులు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శరత్‌ అరెస్టుపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. అవెక్సా కార్పొరేషన్‌ సంస్థ.. 2017 నుంచి 2022 వరకు రాజధాని అమరావతి సీఆర్డీఏ పరిధిలో రోడ్లను నిర్మించకుండానే బినామీ కంపెనీల పేరుతో బోగస్‌ బిల్లులు సృష్టించారని ఆరోపించారు. రోడ్ల నిర్మాణానికి మెటీరియల్‌ను దిల్లీలో కొన్నట్లు బోగస్‌ బిల్లులతో ప్రభుత్వం నుంచి రూ. కోట్లలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌గా పొందినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని