అప్పులు పుట్టించారంటూ.. అప్పనంగా వందల కోట్లు!

ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చిన జగన్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు ప్రతిష్ఠలను గంగలో కలిపేస్తోంది.

Published : 01 Mar 2024 05:34 IST

ట్రస్టు ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్లకు అవకాశం
టెండర్లు లేకుండానే సంస్థ ఎంపిక
ప్రొఫెషనల్‌ ఫీజు పేరిట ఇప్పటికే రూ.360 కోట్ల చెల్లింపులు
మరో రూ.273 కోట్లు ఇచ్చేందుకు ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చిన జగన్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు ప్రతిష్ఠలను గంగలో కలిపేస్తోంది. రూ.లక్షల కోట్ల అప్పులు పుట్టించి రాష్ట్ర భవిష్యత్తును అస్తవ్యస్తం చేసింది. ఆ అప్పులు, వాటికి వడ్డీలు భరించడం ఒక ఎత్తయితే.. ఆ అప్పులను పుట్టించడానికి ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని దానికి ఫీజు కింద వందల కోట్ల రూపాయలు అప్పనంగా ధారపోయడం మరో ఎత్తు. కేవలం బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు పుట్టించేందుకే ఒక ప్రైవేట్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. అలా అప్పు పుట్టించినందుకు ప్రొఫెషనల్‌ ఫీజు పేరిట వారికి ఏకంగా రూ.వందల కోట్లు ధారబోస్తోంది. అసలు ఈ సంస్థను ఎంపిక చేసే ముందు టెండర్లు పిలిచిన దాఖలా కూడా లేదు. ఎవరు తక్కువ ఫీజుకు ఈ పని నిర్వహిస్తారో పరిశీలించి, అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఆధారాలూ లేవు. ప్రభుత్వ పరపతితో తెచ్చిన అప్పులను కూడా ఈ సంస్థే ఇప్పించినట్లు చూపించి నిధులు దోచిపెట్టేశారు. అదే సంస్థకు ఇప్పుడు మరో ఏడాదిపాటు బాధ్యతలు పొడిగించి, మరిన్ని వందల కోట్లు సమర్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులూ ఇచ్చేయడం దారుణం.

టెండర్లు పిలవకుండానే సంస్థ ఎంపిక

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యంపై వ్యాట్‌ రూపంలో వివిధ రకాలపై 50 నుంచి 150 శాతం వరకు పన్ను వసూలు చేసేది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని 10 శాతానికి తగ్గించి, ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించుకుంది. అయితే బెవరేజస్‌ కార్పొరేషన్‌కు మద్యం బ్రాండ్లపై సెస్‌ వసూలు చేసుకునే అధికారం కల్పించింది. ఆ రూపేణా కార్పొరేషన్‌కు ఏటా రూ.8 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని చూపించి.. దాని ఆధారంగా అప్పులు పుట్టించేందుకు పావులు కదిపింది. బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను జారీ చేసి, వాటి ద్వారా రుణాలు పుట్టించింది. ఈ డిబెంచర్లు మార్కెట్‌లో అమ్మేందుకు మార్కెటింగ్‌ చేసి, అప్పులు పుట్టించేందుకు ఒక ప్రత్యేక సంస్థకు బాధ్యతలు అప్పగించింది. మార్కెట్‌లో బాండ్లు విడుదల చేసి వాటిని అమ్మి, దాని ద్వారా రుణాలు తీసుకునేందుకు వీలుగా మర్చంట్‌ బ్యాంకర్‌ను ఏర్పాటు చేసుకోవాలని బెవరేజస్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రతిపాదించారు. ముంబయికి చెందిన మర్చంట్‌ బ్యాంకర్‌ ట్రస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. 2021లోనే ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. సంస్థను ఎంపిక చేసుకోవడానికి టెండర్లు ఆహ్వానించినట్లుగానీ, ఎన్ని సంస్థల నుంచి అభ్యర్థనలు వచ్చాయని గానీ, ఆ సంస్థను ఏ ప్రాతిపదికన మర్చంట్‌ బ్యాంకర్‌ను ఎంపిక చేశారనీ గానీ ఆ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొలేదు. కానీ బాండ్లు అమ్మకానికి పెట్టి, అప్పులు సాధించిపెట్టేందుకు ఆ సంస్థకు 1.44 శాతం ఫీజు ఇచ్చేలా ఉత్తర్వులు మాత్రం వెలువడిపోయాయి.

రూ.360 కోట్ల ధారబోత

బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం రాబడిని ఆధారంగా చూపి మార్కెట్‌ నుంచి ఇప్పటికే రూ.25,000 కోట్ల రుణం పుట్టించినట్లు కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లోనే ఉంది. ఆ అప్పు పుట్టించినందుకు మర్చంట్‌ బ్యాంకర్‌కు ప్రతి రూ.100 కోట్లకు రూ.1.44 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.360 కోట్లు ఇచ్చేశారు. అయితే అసలు ఆ అప్పులు పుట్టించడంలో వారేం ప్రతిభ చూపారన్నది చర్చనీయాంశమవుతోంది. ఈ రుణం తీసుకున్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచే కావడం గమనార్హం. మొదట ఈపీఎఫ్‌, వివిధ బీమా కంపెనీలు ఈ బాండ్లను కొనుగోలు చేశాయి. ఆ సంస్థలకు 9.62 శాతం వడ్డీ ఇచ్చేలా ఈ రుణం తీసుకున్నారు. తదుపరి ఆ బాండ్ల అమ్మకానికి ఈ మర్చంట్‌ బ్యాంకర్‌ ఒప్పించింది రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలనే కావడం గమనార్హం. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, మూడు విద్యుత్తు పంపిణీ సంస్థలు వారి ఉద్యోగుల నుంచి వసూలు చేసే పీఎఫ్‌ మొత్తాలను ఆధారంగా చేసుకుని బెవరేజస్‌ కార్పొరేషన్‌ బాండ్లు కొనిపించారు. అంతే తప్ప ఆ మర్చంట్‌ బ్యాంకర్‌ ఎలాంటి ప్రైవేటు నిధులనూ అప్పుగా తేలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరో ఒకరి ఒత్తిడి వల్లే విద్యుత్తు సంస్థలు అక్కడ తమ నిధులను వెచ్చించి బాండ్లు కొన్నాయన్నది కాదనలేని అంశం. ఆ నిధులను బాండ్లకు మళ్లించగలిగే అవకాశం ప్రభుత్వానికే ఉన్నప్పుడు ఇందుకోసం మధ్యవర్తిగా ఒక మర్చంట్‌ బ్యాంకర్‌ను ఏర్పాటు చేసి రూ.వందల కోట్లు ధారబోయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో ఈ బ్యాంకర్‌కు ప్రభుత్వంలో ఎవరో ఒక కీలక వ్యక్తి అండదండలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. తాజాగా ప్రభుత్వం ఆ మర్చంట్‌ బ్యాంకరుకు మరో ఏడాదిపాటు ఆ బాధ్యత నిర్వహించేందుకు అవకాశాన్ని పొడిగించింది. 2024 డిసెంబరు నెలాఖరులోపు రూ.19,000 కోట్ల అప్పు తీసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ మొత్తాలు అప్పుగా తెస్తే ఆ సంస్థకు మరో రూ.273.60 కోట్లు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని