ప్రశ్నిస్తే.. వేధింపులే!

చెత్త పన్ను వసూళ్లపై ఒత్తిడి చేయవద్దని ఉద్యోగుల సంఘం నాయకుడిగా అధికారులను అడగడమే ఆయన చేసిన నేరమైంది.

Updated : 01 Mar 2024 05:55 IST

జగన్‌ ప్రభుత్వంలో ఉద్యోగులకు రక్షణ కరవు
చెత్త పన్నుపై ప్రశ్నించినందుకు కక్ష సాధింపు
వేధింపులతో ఎస్టీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
జీవీఎంసీ కమిషనర్‌ తీరుపై ఉద్యోగుల నిరసన

ఈనాడు, అమరావతి: చెత్త పన్ను వసూళ్లపై ఒత్తిడి చేయవద్దని ఉద్యోగుల సంఘం నాయకుడిగా అధికారులను అడగడమే ఆయన చేసిన నేరమైంది.. వార్డులో శానిటరీ మేస్త్రీలు చేసే పనులను పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో చేయిస్తారేంటని ప్రశ్నించడమే ఆ నాయకుడి తప్పిదమైంది.. అధికారుల అహం దెబ్బతింది. అంతే.. ఆ గిరిజన ఉద్యోగి పట్ల దారుణంగా వ్యవహరించి తీవ్ర వేదనకు గురి చేశారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించి ఆయన ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యారు. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారుల తీరు ఇది. విశాఖలోని 45వ వార్డు పరిధిలోని సచివాలయ ఉద్యోగి కావటి శివ ఆదిమూర్తి వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శుల సంఘం నాయకుడు. ప్రజల నుంచి చెత్త పన్ను వసూళ్ల కోసం జీవీఎంసీ అధికారులు కార్యదర్శులపై తీవ్ర ఒత్తిడి చేస్తుండడంపై ఆయన పది నెలల క్రితం ప్రశ్నించారు.  ప్రజలు చెత్త పన్ను చెల్లించడం లేదని.. కార్యదర్శులను వేధించొద్దని గట్టిగా చెప్పారు.

దీంతో కమిషనర్‌ నుంచి అధికారుల వరకు ఆదిమూర్తిని వేధించడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది కార్యదర్శులు చెత్తపన్నుపై అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను దాదాపుగా అందరినీ ఆ తరువాత విధుల్లోకి తీసుకున్నారు. విశాఖలో ఆదిమూర్తి విషయంలో మాత్రం జీవీఎంసీ అధికారులు సస్పెన్షన్‌ ఎత్తివేయకపోగా.. ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించారు. పేద కుటుంబానికి చెందిన  ఆయన జీతం లేక ఆర్థిక ఇబ్బందులకు, తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. చివరకు జీవీఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. సహచర ఉద్యోగులు గమనించి ఆసుపత్రికి తరలించారు. జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ వ్యవహారంపై ఆదిమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. కమిషనర్‌ తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. బాధితుడికి అండగా ఉంటామని సామాజిక మాధ్యమంలో గురువారం పెద్దఎత్తున పోస్ట్‌లు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని