పాడి కష్టం.. అమూల్‌ ‘పాలు’!

2020 డిసెంబరు 2న లీటరు గేదెపాలకు రూ.67, ఆవుపాలకు రూ.32 చొప్పున రైతులకు ఇచ్చేవారు.

Published : 01 Mar 2024 04:42 IST

లీటరుకు రూ.4 చొప్పున పాడిరైతులకు బోనస్‌ ఇప్పిస్తానన్న జగన్‌
వివిధ రూపాల్లో అమూల్‌కు మాత్రం రూ.6 వేల కోట్లకు పైగా ప్రయోజనాలు
ఆస్తుల అప్పగింత నుంచి.. పాల సేకరణ వరకు అన్నీ తానైన సర్కారు
ఈనాడు, అమరావతి

2020 డిసెంబరు 2న లీటరు గేదెపాలకు రూ.67, ఆవుపాలకు రూ.32 చొప్పున రైతులకు ఇచ్చేవారు. అమూల్‌ వచ్చాక రెండేళ్లలో ఎనిమిదిసార్లు రేట్లు పెంచడంతో.. లీటరు గేదెపాలకు రూ.89.76, ఆవుపాలకు రూ.43.69 చొప్పున లభిస్తున్నాయి. లీటరు గేదెపాలపై రూ.22, ఆవుపాలపై రూ.11 చొప్పున అదనంగా దక్కుతున్నాయి.

గతేడాది జులై 7న చిత్తూరు జిల్లాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి


నమ్మబలికి.. నట్టేటముంచి!

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. చిత్తూరు డెయిరీ సహా రాష్ట్రంలో సహకార డెయిరీలను పునరుద్ధరిస్తామంటూ జగన్‌ నమ్మబలికారు. అధికారంలోకి రావడంతోనే జీసీఎంఎంఎఫ్‌తో హడావుడిగా ఒప్పందం కుదుర్చుకుని అమూల్‌ను రాష్ట్రంలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్‌)కు చెందిన రూ.వేలాది కోట్ల విలువైన ఆస్తుల్ని అప్పనంగా కట్టబెడుతున్నారు. మొత్తంగా చూస్తే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రూ.6,500 కోట్ల విలువైన ప్రయోజనాలు అమూల్‌కు కల్పించారు.


తన కక్ష కోసం పాడిరైతుకి శిక్ష వేస్తున్నారు జగన్‌..
రైతుల నుంచి పాల సేకరణ కోసం..
రాష్ట్రంలోని డెయిరీలు, సహకార సంఘాలను కాదని..
ఎక్కడో ఉన్న.. అమూల్‌కు ఆహ్వానం పలికారు!!
ఏం బేరీజు వేసుకున్నారో కానీ..
విలువైన ఆస్తుల్ని కారుచౌకగా లీజుకు కట్టబెట్టారు...
దీనివల్ల రైతులకు ఉపయోగం లేదు... పైసా ప్రయోజనం లేదు..
కేవలం ప్రతిపక్ష నేత మీద కక్షతోనే ఈ వివక్ష!!
అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరుకు మన పాడిరైతుకే ఇది శిక్ష!!


ఇటీవల ఓ ఉదయం.. రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని 4,762 గ్రామాల్లో 70,931 లీటర్ల గేదెపాలు, 94,305 లీటర్ల ఆవుపాలు సేకరించారు. జగన్‌ చెప్పే ధరల ప్రకారం గేదెపాలకు రూ.63.67లక్షలు, ఆవుపాలకు రూ.41.20 లక్షల చొప్పున మొత్తం రూ.1.05 కోట్లను రైతులకు చెల్లించాలి. అయితే వారికి లెక్కకట్టిన మొత్తం రూ.78.46 లక్షలు మాత్రమే (ఏపీడీడీసీఎఫ్‌ డ్యాష్‌బోర్డు ప్రకారం). అంటే ఒక్క పూట సేకరించే పాలకే..  సీఎం చెప్పిన ధరల కంటే రూ.26.41 లక్షలు తక్కువగా రైతులకు ఇస్తున్నారు.


రెండు పాడి గేదెలు/ఆవులున్న రైతు కుటుంబం.. నెలకు 200 లీటర్ల పాలు అమ్మితే బోనస్‌గా లీటరుకు రూ.4 చొప్పున రూ.800 అదనంగా వస్తాయి. అంటే ఏడాదికి రూ.9,600. అయిదేళ్లకు రూ.48 వేలు. అమూల్‌ ద్వారా రైతులకు అదనపు ధర ఇప్పిస్తున్నామంటూ.. ఈ మొత్తాన్ని జగన్‌ ఎగ్గొడుతున్నారు. రాష్ట్రంలోని ఇతర డెయిరీలు ఇచ్చే దాని కంటే.. అమూల్‌ ద్వారా అదనపు ధర లభిస్తుంటే రైతులంతా దానికే క్యూ కట్టరా? ప్రభుత్వం సకల యంత్రాంగాన్ని మొహరించి అమూల్‌ సేవలో తరించాల్సిన అవసరం ఏముంటుంది?


హకార డెయిరీలను పునరుద్ధరిస్తామని, వాటికి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హోరెత్తించిన జగన్‌.. ముఖ్యమంత్రి కాగానే మడమ తిప్పేశారు. అమూల్‌ను(జీసీఎంఎంఎఫ్‌- గుజరాత్‌ సహకార పాల పంపిణీ సమాఖ్య) అడ్డదారిలో రాష్ట్రంలోకి తెచ్చి.. పాడి రైతుల్ని ఉద్ధరిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అమూల్‌ రావడంతో.. లీటరుకు రూ.11 నుంచి రూ.22 చొప్పున అదనపు ధర లభిస్తోందని సీఎం జగన్‌ చెప్పేదంతా వట్టిమాటే. అమూల్‌ చెల్లించే ధర కంటే.. రాష్ట్రంలోని డెయిరీలే బోనస్‌తో కలిపి లీటరుకు రూ.10 నుంచి రూ.15 వరకు అధికంగా ఇస్తున్నాయి. 

ఏళ్లు గడుస్తున్నా...

అమూల్‌ పాలసేకరణ ప్రారంభించి 39 నెలలు అయినా.. ఇప్పటికీ రోజుకు 3.45 లక్షల లీటర్లకు మించడం లేదంటే.. ఆశించిన ధర రైతులకు లభించడం లేదనేగా అర్థం. వాస్తవానికి ఈ నాలుగేళ్లలో అమూల్‌కు అప్పగించిన ఆస్తులెన్ని? తద్వారా రైతులకు కలిగిన మేలెంత? పాడి రైతుల ప్రయోజనాల కంటే.. మనది కాని అమూల్‌ అంటే ముఖ్యమంత్రి జగన్‌కు అంత ప్రేమ ఎందుకు? అవే ప్రయోజనాల్ని మన రాష్ట్రంలోని డెయిరీలకు కల్పిస్తే.. ఇప్పుడిచ్చే ధర కంటే లీటరుకు రూ.10 నుంచి రూ.15 అదనంగా కల్పిస్తామంటున్నా.. ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారు. అమూల్‌ ప్రవేశంతో పాడి రైతులు ప్రయోజనాలు దెబ్బతింటాయని, సహకార రంగ డెయిరీల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌ మాత్రం అమూల్‌కు ఎర్రతివాచీ పరిచి మరీ సాగిలపడుతున్నారు.


గ‘లీజు’ ఒప్పందాలు!!

రాష్ట్ర విభజన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో మదనపల్లెలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూహెచ్‌టీ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దాన్ని కూడా అమూల్‌ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఏపీడీడీసీఎఫ్‌ పరిధిలోని డెయిరీలకు మొత్తంగా 700 ఎకరాల వరకు భూములు, రూ.2,200 కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయి. వీటిలో అధికభాగం తక్కువ ధరకే అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో 4,796 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, 11,800 ఆటోమేటిక్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లకు ఉచితంగా స్థలంతోపాటు రూ.2,452 కోట్ల వ్యయం చేస్తోంది. ఇందులో తొలి విడతగా రూ.690 కోట్లతో నిర్మాణాలు చేస్తున్నారు. జగనన్న పాలవెల్లువ కింద 3.94లక్షల మందితో రూ.2,955 కోట్లతో పాడి పశువుల్ని కొనుగోలు చేయించారు. వీటిని కొన్న రైతులు కూడా అమూల్‌కే పాలు పోయాలని ఒత్తిడి తేవడం గమనార్హం.


అప్పు తీర్చి అప్పగించారు..

చిత్తూరు డెయిరీ.. దేశంలోనే రెండో అతిపెద్దది. అధికారంలోకి వస్తే.. దీన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల సభల్లో జగన్‌.. రైతుల్ని నమ్మించారు. ఆయన దృష్టిలో పునరుద్ధరించడం అంటే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడమే. అందుకే సుమారు రూ.650 కోట్ల విలువైన ఆస్తులున్న ఈ డెయిరీని అమూల్‌కు ఏడాదికి రూ.కోటి చొప్పున 99 ఏళ్ల లీజుకు ఇచ్చేశారు. రూ.182 కోట్ల అప్పుల్ని తీర్చి మరీ అమూల్‌కు అప్పగించడం గమనార్హం.


 ‘పొడి’ చేస్తామన్నారు!

ఒంగోలు డెయిరీ.. పాల సేకరణ, పాల పొడి తయారీలో ఎంతో ప్రసిద్ధి పొందింది. సుమారు 3 వేల టన్నుల సామర్థ్యం ఉన్న కర్మాగారం ఇక్కడ ఉంది. అమూల్‌తో ఒప్పందంలో భాగంగా ఈ డెయిరీ భవిష్యత్తుకు మంగళం పాడేశారు. రైతుల నుంచి పాల సేకరణ కూడా నిలిపి వేయించి.. మూత పెట్టారు. ఆ తర్వాత అమూల్‌.. నిర్వహణ భారంతో దీన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో యంత్రాలు నిరుపయోగంగా తయారయ్యాయి.   పునరుద్ధరణ పేరుతో దీన్ని మళ్లీ అమూల్‌కే అప్పగిస్తున్నారు. ఒంగోలు డెయిరీ భూములు, యంత్రాల విలువ సుమారు రూ.700 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.


మించకున్నా.. ముంచుతున్నారు!!

అమూల్‌తో ఒప్పందంలో భాగంగా.. ప్రభుత్వం 2020 నుంచి పశుసంవర్థకశాఖ, గ్రామీణాభివృద్ధి సహా వివిధ శాఖల యంత్రాంగాన్ని అమూల్‌ సేవకు వినియోగించింది. గ్రామాల్లో మహిళా పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు నుంచి రుణాలిచ్చి గేదెలు కొనిపించే వరకు అన్ని విధాల చేదోడువాదోడుగా నిలుస్తోంది. 2020 నవంబరు నుంచి పాల సేకరణ మొదలై.. ఇప్పుడు 19 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయినా కేవలం 4,762 గ్రామాల్లోనే పాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో సహకార, ప్రైవేటు డెయిరీలు రోజుకు సగటున 22 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంటే.. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పాల సేకరణ రోజుకు 3.65లక్షల లీటర్లకు మించడం లేదు.


అయినా... అమూల్‌కే పెద్దపీట!

ఎవరైనా డెయిరీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే.. భూమి, భవనాలు, యంత్రాలు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాల వారీగా పాలు పట్టే వారిని ఎంపిక చేసి యంత్రాలు అందించాలి. శీతలీకరణ, రవాణా ఏర్పాటు చేసుకోవాలి. పాలు పోసే రైతులకు రుణాలివ్వాలి. అయితే అమూల్‌కు ఇలాంటి ఖర్చులేవీ అవసరం లేకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ తానై పాలు సేకరిస్తోంది. చిత్తూరు, ఒంగోలు, మదనపల్లె తదితర డెయిరీల్లోని రూ.వేల కోట్ల ఆస్తుల్ని.. లీజు పద్ధతిపై కట్టబెట్టింది. వచ్చిన పాలను తీసుకెళ్లడమే అమూల్‌ పని. అంటే నిర్వహణ వ్యయం లీటరుకు రూ.10 నుంచి రూ.12 ఉంటుందనేది డెయిరీ యాజమాన్యాల మాట. ఆ ప్రయోజనాలన్నీ తమకు కల్పిస్తే ఇప్పుడిచ్చే ధర కంటే లీటరుకు రూ.10 నుంచి రూ.12 ఎక్కువే ఇస్తామంటున్నా.. ప్రభుత్వం అమూల్‌కే పెద్దపీట వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని