దళితుల భూముల్లో వైకాపా పాగా

గుంటూరు జిల్లాలో వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భూదాహానికి అంతే లేకుండా పోతోంది. ఆ ప్రజాప్రతినిధి దళితుల భూములను బినామీల పేరుతో కాజేసిన వ్యవహారం కలకలం రేపుతోంది.

Updated : 01 Mar 2024 06:26 IST

రూ.15 కోట్ల విలువైన భూములు స్వాహా
బినామీ పేర్లతో చేజిక్కించుకున్న ప్రజాప్రతినిధి

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-పెదకాకాని, దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భూదాహానికి అంతే లేకుండా పోతోంది. ఆ ప్రజాప్రతినిధి దళితుల భూములను బినామీల పేరుతో కాజేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. జిల్లాలోని పెదకాకాని మండలం అనమర్లపూడి గ్రామంలో సర్వే నంబరు 56లో 22.38 ఎకరాల భూమి ఉంది. బ్రిటిష్‌ వారి హయాంలోనే ఈ భూమిని 55 మంది దళితులకు కేటాయించారు. ఈ పట్టాలను గ్రామానికి చెందిన నేత ఒకరు రద్దు చేయించారు. అనంతరం 1977లో అనుమర్లపూడికే చెందిన 9 మంది పేర్లతో డీకేటీ పట్టాలు మంజూరయ్యాయి. వీరిలో ఏడుగురు ఎస్సీలు, ఒకరు బీసీ, ఒక ఓసీ రైతు ఉన్నారు. ఈ క్రమంలో గతంలో పట్టాలు పొందిన 55 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డీకేటీ పట్టాలు పొందిన 9 మంది రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ 55 మంది కేసులు కొనసాగిస్తూ వచ్చారు. 2022 జులైలో స్థానిక వైకాపా నేత ఒకరు 55 మందితో మాట్లాడి వివాదం పరిష్కరించుకుంటే అందరికీ డబ్బులు వస్తాయని నమ్మబలికారు.

దీంతో వారు కేసు ఉపసంహరించుకున్నారు. అనంతరం 9 మంది పట్టాదారులతో ప్రజాప్రతినిధి బినామీలు ప్రైవేటు ఒప్పందాలు చేసుకున్నారు. అప్పటికే ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. తాము అప్పట్లో మార్కెట్‌ విలువ చెల్లించినందున 22(ఎ) నుంచి తమ సర్వే నంబర్లను తొలగించాలని పట్టాదారులు దరఖాస్తు చేశారు. వారికి మద్దతుగా ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు, కొందరు దళిత రైతులు ఆందోళనలు చేయడంతో తాత్కాలికంగా ఆ పనిని పక్కన పెట్టేశారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉండి ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించారు. వెంటనే ప్రజాప్రతినిధి తన బినామీలైన 8 మంది పేరుతో 17.55 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇద్దరు భూములను రిజిస్ట్రేషన్‌ చేయడానికి అంగీకరించకపోవడంతో వారి భూమి 4.83 ఎకరాలను మినహాయించారు. పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేస్తే విషయం బయటికి వస్తుందని దుగ్గిరాలలో రిజిస్ట్రేషన్‌ చేయించడం గమనార్హం. ఒక ప్రముఖ ఆలయానికి ఛైర్మన్‌, ఆయన కుటుంబసభ్యుల పేర్లతో పాటు పొన్నూరు మండలం మునిపల్లెకు చెందిన ఇద్దరి పేర్లతో భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. దీంతో పట్టాదారులకు రూ.లక్షలు చెల్లించి రూ.15 కోట్ల విలువైన భూములు చేజిక్కించుకున్నారు.

ప్రణాళిక ప్రకారం చక్కబెట్టారు

అనుమర్లపూడిలో భూములను ప్రజాప్రతినిధికి కట్టబెట్టేందుకు అదే గ్రామానికి చెందిన నాయకులు, మండల ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించారు. సదరు నేత తన వాటాగా రూ.లక్షల్లో కమీషన్‌ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై తహసీల్దార్‌ పెల్లూరి రత్నంను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములు 20 ఏళ్లుగా 22(ఎ)లో ఉంటే వాటిని తొలగించాలని ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. దీని ఆధారంగా కలెక్టర్‌కు నివేదిక పంపామన్నారు. జిల్లా స్థాయి అసైన్‌మెంట్‌ కమిటీ నిర్ణయం తీసుకొని అనుమర్లపూడి గ్రామంలోని భూమిని 22ఎ నుంచి తొలగించినట్లు చెప్పారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట నిరసన

అనుమర్లపూడిలోని దళితుల భూములు దుగ్గిరాల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ అయినట్లు తెలుసుకున్న తెదేపా పెదకాకాని మండల నాయకులు గురువారం ఆ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తెదేపా మండల అధ్యక్షుడు వలివేటి మురళీకృష్ణ మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే దళితుల భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. పెదకాకాని శివాలయం ఛైర్మన్‌ అమ్మిశెట్టి శివశంకర్‌ కుటుంబసభ్యుల పేరుపై సుమారు 10 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని