Vizag: సీఎం క్యాంపు కార్యాలయంగా రుషికొండ రిసార్ట్‌

‘విశాఖలోని రుషికొండపై నిర్మించిన రీడెవలప్‌మెంట్‌ రిసార్ట్‌ భవనాలు సీఎం క్యాంపు కార్యాలయంగా ఉంటే బాగుంటుందని ఐఏఎస్‌లతో నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ గతంలోనే నిర్ణయించింది.

Updated : 01 Mar 2024 07:56 IST

జగన్‌ ఆమోదిస్తే ఇక్కడి నుంచే కార్యకలాపాలు
ఆ మాట కోసం నిరీక్షిస్తున్నాం
ప్రారంభోత్సవంలో మంత్రి ఆర్‌కే రోజా
నిరాడంబరంగా వేడుక

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, సాగర్‌నగర్‌: ‘విశాఖలోని రుషికొండపై నిర్మించిన రీడెవలప్‌మెంట్‌ రిసార్ట్‌ భవనాలు సీఎం క్యాంపు కార్యాలయంగా ఉంటే బాగుంటుందని ఐఏఎస్‌లతో నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ గతంలోనే నిర్ణయించింది. అందుకు ముఖ్యమంత్రి ఆమోదిస్తే ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మేమంతా ఆ మంచి మాట కోసమే ఎదురుచూస్తున్నాం’ అని పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా పేర్కొన్నారు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో నిర్మించిన ఆధునిక భవనాలను రోజా చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. అంతకుముందు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో లక్ష్మీపూజ, హోమం నిర్వహించారు. మంత్రి అమర్‌నాథ్‌, వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఛైర్మన్‌ ఎ.వరప్రసాదరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, ఉన్నతాధికారులు పూజల్లో పాల్గొన్నారు. సీఎం కార్యాలయంగా ప్రచారంలో ఉన్న మధ్య భవంతిలో కొద్దిమందితో రహస్యంగా చేపట్టిన ఈ ప్రారంభోత్సవానికి మీడియాను అనుమతించలేదు. సమాచార, ప్రసార శాఖ సిబ్బందితో రోజా మాట్లాడుతూ ‘భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది. జగన్‌ సీఎం అయ్యాక తీర ప్రాంత నియంత్రణ జోన్‌ (సీఆర్‌జడ్‌) ఆమోదంతో అన్నిరకాల అనుమతులు, వసతులతో ఏడు భవనాలు నిర్మించాం. అందమైన నగరంలో అద్భుతమైన భవనాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేశాం. హరిత హిల్‌ రిసార్ట్‌ పాతబడడంతో పునర్నిర్మించాలని సీఎం చెప్పడంతోనే ఈ పనులు చేశామ’ని వివరించారు.

ఇంకా నిర్ణయం తీసుకోవాలి: మంత్రి అమర్‌నాథ్‌

ప్రారంభోత్సవం అనంతరం ప్రాజెక్టు వెలుపల మీడియాతో మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడుతూ ‘ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం సమీక్షలకు ఈ భవనాలైతే బాగుంటాయని కమిటీ సూచించింది. పర్యాటక రిసార్ట్‌గా కొనసాగించాలా, సీఎం కార్యాలయంగా వినియోగించాలా అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి పర్యాటక ప్రాజెక్టుగానే ఉంటుంది. ఆ తరహా అవసరాల కోసమే నిర్మించాం. భవిష్యత్తులో దేనికి ఉపయోగించాలన్నది కాలమే నిర్ణయిస్తుంది’ అని అన్నారు. ‘ఇంకా పది శాతం పనులు పెండింగ్‌లో ఉండడం, ఒకవేళ సీఎం కార్యాలయంగా వినియోగిస్తే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయనే ఎవరినీ అనుమతించలేదు. దీన్ని ప్రారంభించడానికి న్యాయపరమైన చిక్కులు లేనందున అధికారికంగానే చేపట్టాం. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. దీన్ని అభివృద్ధి చేయకుండా ఉండేందుకు ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు కల్పించాయి. చంద్రబాబు గొడవలు సృష్టించే ప్రయత్నం చేశార’ని విమర్శించారు.

ప్రారంభించాక, గోప్యత ఎందుకో?

ప్రభుత్వం అధికారికంగానే రిసార్ట్‌ను ప్రారంభించామని చెబుతున్నప్పటికీ ఎవరినీ అటువైపు వెళ్లనీయడం లేదు. కార్యక్రమం పూర్తయ్యాక కూడా పంపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏ చిన్న పనిని ప్రారంభించినా ఆర్భాటం చేసే వైకాపా ప్రభుత్వం.. రూ.వందల కోట్లతో చేపట్టిన ఈ పెద్ద ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించడంపై సందేహాలు ముసురుకున్నాయి. పూజా కార్యక్రమాలను కేవలం మధ్య భవనానికే పరిమితం చేశారు. మిగిలిన భవనాలను చూడనీయలేదు. సముద్రం వైపు సీఎం నివాసంగా పేర్కొంటున్న భవనం వద్దకు ఎవరినీ పంపలేదు. గంటన్నరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పార్టీ నేతలు, అధికారులు తిరుగు ప్రయాణమయ్యారు.


పోలీసుల మోహరింపు

రుషికొండ పరిసరాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ప్రధాన రోడ్డు నుంచి రిసార్ట్‌ భవనాలకు వెళ్లే మార్గంలో ఎవరినీ అనుమతించలేదు. అతి కొద్దిమందినే ఆహ్వానించడంతో ఆ జాబితాలో పేర్లున్న వారిని, పర్యాటక శాఖ గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలికి పంపించారు. కొందరిని సెల్‌ఫోన్లతో అనుమతించలేదు. అదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అటువైపు రాగా పోలీసులు అడ్డుకున్నారు. వాహనం నుంచి కిందకు దిగకుండా ఆపడంతో ఆయన పోలీసులతో వాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని